Friday, July 5, 2024

నీడ -1* 👤 *రచన : నండూరి శ్రీనివాస్*

 *నీడ -1*
👤

*రచన : నండూరి శ్రీనివాస్*

శివుని జటాజూటం నుండి జాలువారిన పావనగంగా తరంగాల్లో శివుని ముని పుంగవులు అఘమర్షణ స్నానమాచ రించే పవిత్ర బ్రహ్మీ ముహూర్తమది! భూ బృందారక బృందము లోకబాంధవుని రాకకు అడ్డుపడే మందేహాది రక్కసి మూకల ఉక్కడగించుటకై సంధ్యావందన మంత్రాలు పఠించే సమయమది! ఆధ్యాత్మిక భావన కలిగిస్తోంది.

దీక్షితులవారు కోనేట్లో తలారా స్నానం చేసి, తడి పంచెతో బయటకొచ్చారు. గట్టు మీదున్న చేతి సంచీ తీసుకుని మెల్లగా ఏదో మంత్రం ఉచ్ఛరిస్తూ పడమర దిక్కుగా నడవటం మొదలు పెట్టారు. ఆయన రెండడుగులు వేశారో లేదో, అప్పటివరకూ చెట్టు చాటుగా నించుని ఆయననే గమనిస్తున్న ఓ యువకుడు ముందుకొచ్చాడు. అతడి మెళ్ళో వీడియో కెమేరా వేళాడుతోంది! వీపు మీద స్పోర్ట్స్ బ్యాగ్, ఒంటికి స్వెట్టరుతో చూసేందుకు పట్నం కుర్రాడిలా ఉన్నాడు. దీక్షితులవారిని చూస్తూనే “నమస్కారమండీ" అన్నాడు. ఆయన ఒక్క క్షణం ఆగి అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశారు.

"నన్ను హెడ్మాస్టారు పంపించారండీ! నా పేరు సూర్యం..." 

ఆయన నొసలు చిట్లించి చూశారు. ఆయన మనస్సులో భావాన్ని అతడు గ్రహించి “దెయ్యాల మీద వ్యాసం రాస్తున్న జర్నలిస్టుని నేనేనండీ" అన్నాడు.

అది విన్న ఆయనకి చప్పున ఏదో స్ఫురించింది. ఆప్యాయంగా నవ్వుతూ ముందుకి పదమన్నట్టు చేయి చూపించి ఊరి వైపు నడవటం మొదలుపెట్టారు. అతడు ఆయన చేతిలో ఉన్న సంచీ తీసుకుని పక్కనే నడుస్తున్నాడు.

దట్టమైన మంచు. దారంతా తడిసి పోయింది. నాలుగడుగుల అవతలున్న ఏ వస్తువూ కళ్ళు చిట్లించుకుచూసినా కనిపించట్లేదు. ఆ చలికి సూర్యం గజగజా వణికిపోతున్నాడు. గతుకుల రోడ్డు మీద వెళ్ళే బస్సు అద్దాల్లా అతడి పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. 

స్వెట్టర్ని అరచేతుల మీదుగా లాక్కుని చేతులు బయటకి కనిపించకుండా తాబేలు పిల్లలా ముడుచుకుపోయాడు. భుజానికి వేళాడుతున్న బ్యాగ్లోంచి మఫ్లర్ తీసి తలచుట్టూ చుట్టుకుని, శాలువా తీసి, తల పైనుంచి ఒళ్ళంతా కప్పుకున్నాడు. అప్పటికి కొంచెం వెచ్చగా అనిపించింది. ఆశ్చర్యంతో దీక్షితులవారి వైపు చూశాడు.

ఆయన నడుం చుట్టూ వేళాడుతున్న తడిపంచె తప్ప ఒంటి మీద మరే ఆచ్ఛాదనాలేదు. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ వడివడిగా అడుగులేస్తున్నారు.

ఆయన నడుస్తుంటే మెడలో వున్న నూటెనిమిది రుద్రాక్షల మాల లయబద్ధం గా నాట్యం చేస్తోంది. ఆ క్షణంలో ఆయన మొహం చూసిన వారెవ్వరికైనా ఆయన ఏదో ప్రకృతి శక్తిని ఆప్యాయంగా పేరు పెట్టి పిలుస్తున్నారేమో అనిపిస్తుంది. అలా ఒక మైలు దూరం నడిచారు.

పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతంతా మారుమ్రోగుతోంది. అతడు కష్టం మీద గొంతు పెగల్చుకుని "మనం ఇప్పుడు దెయ్యాన్ని చూడటానికి వెళ్తున్నామా?” అనడిగాడు. ఆయన చదువుతున్న మంత్రం ఒక్క క్షణం ఆపి అతడి వైపు చూసి చిరునవ్వు నవ్వారు.

సమాధానం చెప్పకుండా "త్ర్యంబకం యజామహే" అని చదువుతూ ఎడం అరచేతిలో ఉన్న చితాభస్మాన్ని, కుడిచేతి బొటనవేలితో మెత్తగా నలిపారు.

ఒక్క క్షణం నిలబడి తూర్పు వైపు తిరిగి శూన్యంలోకి చూస్తూ "త్ర్యాయుషం జమదగ్నే కశ్యపస్య త్ర్యాయుషం... " యద్ధేవానాం త్రాయుషం... "అని తన్మయత్వంతో చదివి భస్మాన్ని వేళ్ళకి పట్టించుకున్నారు.

కనుబొమల చివరలు దాటకుండా ఉంగరపు మధ్య వేళ్ళతో రెండు విభూతి రేఖలు రచించారు. బొటనవేలితో కుడి నుంచి ఎడమకి మధ్య గీతని గీశారు.

త్రిపుండ ధారణం పూర్తయ్యాక పంచె అంచునున్న చిన్న కుంకుమ పొట్లాన్ని బయటకి తీశారు. దాంతోనే  స్నానం చేయటం వల్ల అది పూర్తిగా తడిసిపోయి ఉంది. దాన్ని జాగ్రత్తగా తెరచి అందులోని కుంకుమని భక్తిగా తీసి కనుబొమల మధ్యన రూపాయి బిళ్ళంత బొట్టులా పెట్టుకున్నారు. ఆయన నుదుటి మీద విభూతి తూర్పు సముద్రపు కెరటాల్లాగా, కుంకుమ బొట్టు ఉదయదరుణ బింబం లాగా ప్రకాశిస్తున్నాయి. 

ఆ దారిలో ఒక రైతు నీళ్ళ కావడి భుజాన వేసుకుని వీళ్ళకి ఎదురుగా వస్తున్నాడు. దీక్షితులవారిని చూడగానే కావడి గబుక్కున పక్కకి దింపి, భుజమ్మీద ఉన్న తువ్వాలు తీసి నడుముకి కట్టుకుని ఆ మట్టిదారిలోనే అడ్డంగా పడుకుని సాష్టాంగనమస్కారం చేశాడు. ఆయన చిరునవ్వు నవ్వి 'ఆయుష్మాన్భవ' అంటూ సాగిపోయారు.

వాళ్ళు ఇంకొంత దూరం అలా నడిచి డొంకల్లోంచి నెమ్మదిగా తారు రోడ్డు మీదకి వచ్చారు. ఓ పాతిక అడుగులేసేసరికి రోడ్డుకి రెండు వైపులా మేడలు. ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేకపోవడం వల్ల అప్పటిదాకా వినిపిస్తున్న పక్షుల కిలకిలా రావాలు కూడా ఠక్కున ఆగిపోయాయి. అంతరొద ఒక్కసారిగా ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది, సూర్యం వెన్నులో చలి పుట్టింది.

ఎందుకోగానీ ఆ వాతావరణం అతడికి హాయిగా అనిపించలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలనుకుని "అసలు దెయ్యాలనేవి నిజంగా ఉంటాయాండీ... ఉంటే ఎక్కడుంటాయి?" అనడిగాడు.

ఆయన నవ్వుతూ చూశారు అతని వైపు. "నువ్వూ నేనూ ఉన్నాం కదా... అలాగే అవీనూ! మన చుట్టూనే ఉంటాయి. సూక్ష్మ శరీరాలు! వాటికే లోకులు దెయ్యాలని నామకరణం చేశారు" చెప్పారాయన. 

"అయితే చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలవుతారా..." అంటూ నాలిక్కరుచుకుని "అదే...ఐ మీన్ సూక్ష్మశరీరాలు అవుతారా?" అనడిగాడు.

"దానికి చనిపోవక్కర్లేదు. ప్రతి మనిషి స్థూల శరీరం చుట్టూ అతడి సూక్ష్మశరీరం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటుంది. మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న ఆత్మ మన మరణానంతరం ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. చేసిన కర్మలని పాప పుణ్యాల రూపంలో అనుభవించి ఆ తరువాత ఇంకా పై శరీరాల్లోకి వెళ్తూ చివరికి దేహంతో మాత్రమే అనుభవించా ల్సిన కర్మల కోసం మళ్ళీ ఇంకొక జన్మని ఎత్తుతుంది" వివరించారు దీక్షితులు.
👤
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

No comments:

Post a Comment