*సతీ సావిత్రి - 5*
(చివరి భాగం)
రచన : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య
(రేపటినుండి గ్రూప్ లో విరాటపర్వం ప్రారంభించ బడును)
*ఆశ్రమానికి తిరిగిరాక*
సత్యవంతుడు ఒంటి మీది దుమ్ము దులుపుకొని నడవటానికి సిద్ధమయ్యాడు. పండ్ల బుట్ట మోయడం కష్టమని సౌవిత్రి దాన్ని అక్కడే ఒక చెట్టుకు తగిలించింది. భర్త ఎడమ చెయ్యి తన భుజంపై పెట్టుకొని కుడిచేత అతడ్ని పట్టుకొని మెల్లగా నడిపించుకొంటూ ఆశ్రమం వైపు నడిచింది.
ఇంతలో ధర్మదేవత ప్రసాదించిన వరప్రభావం వల్ల ద్యుమత్చేనుడికి కళ్ళు వచ్చాయి. ఆయన ఆశ్రమం నలు వైపులా చూచాడు. ప్రియమైన కొడుకు కనిపించకపోయేసరికి ఆయనకు అంతా శూన్యంగా తోచింది. అందువల్ల కళ్లున్నా కళ్లు లేనివానిలా భార్యతో గూడి ఏడవటం మొదలుపెట్టాడు. అక్కడ వున్న మునులనందరినీ సత్యవంతుణ్ణి చూచారా? అని అడిగాడు. కొడుకు సద్గుణాలు మాటిమాటికీ పేర్కొంటూ విలపించాడు. ధైర్యం కోల్పోయి పెద్దగా శోకించాడు.
ఆయన ఏడుపు విని ఆశ్రమవానులందరూ చుట్టూ గుమిగూడారు. ఉన్నట్టుండి ఆయన కళ్ళు కనిపించినందుకు అక్కడి వాళ్లందరూ ఆశ్చర్యపడ్డారు. తగిన మాటలతో ఆ వృద్ధ దంపతులను వోదార్చారు.
తర్వాత కొంతసేపటికి సావిత్రీ సత్యవంతులు అక్కడికి చేరుకొన్నారు. వాళ్లను చూడగానే వృద్ధదంపతుల కళ్ల నుండి ఆనందబాష్పాలు రాలాయి. వాళ్లు కొడుకును కౌగిలించుకొని సంతోషంతో ఉప్పొంగిపోయారు. మునులు అందరూ వాళ్లను చూచి ఆనందించారు.
"ఇంతసేపు అడవిలో ఎందుకు ఉన్నారు?" అని ద్యుమత్సేనుడు కొడుకును అడిగాడు.
అప్పుడు సత్యవంతుడు తండ్రితో ఇలా అన్నాడు- "నాన్నా! ఇక్కడ నుండి మేము నేరుగా అడవికి వెళ్ళాం. అక్కడ కావలసినన్ని పళ్లు కోసుకొన్నాం. తర్వాత కట్టెలు చీలుస్తూ వుండగా నాకు తీవ్రమైన తలనొప్పి కలిగింది. వొళ్లంతా శూలాలతో గ్రుచ్చినట్టు పోటు పుట్టింది. ఆ బాధ భరించలేక అక్కడే విశ్రాంతి కోసం పడుకొన్నాను. ఇంతలో ఎవడో ఒక పురుషుడు వచ్చి కలలో నన్ను పట్టి లాక్కుపోయాడు".
*యముడి అనుగ్రహించాడు*
ఆ పైన సౌవిత్రి మామతో ఇలా చెప్పింది - " "మీ కుమారుడికి ఈ దినం మరణమని ముందొకసారి నారదమహర్షి చెప్పగా నేను విన్నాను. మునీంద్రుడి మాట తప్పదని భావించి నేను ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఈయనతో గూడా అడవికి వెళ్లాను. అక్కడ బడలికతో ఈయన పడుకోగానే యమధర్మరాజు వచ్చాడు. ఈయన శరీరం నుండి జీవుణ్ణి వేఱు చేసి పాశంతో బంధించి అతడు యమలోకానికి బయలుదేరాడు.
నేను వెంట నడుస్తూ పలు విధాల ఆయన మనన్సు కరిగేటట్లు ప్రార్ధించాను. దయా మూర్తి అయిన ఆ దేవుడు నా స్తుతికి మెచ్చుకొని నాకు నాల్గు వరాలు ప్రసాదించా డు. అందులో ఒక వరం వల్ల మళ్లీ మీ కుమారుడు జీవించగలిగాడు. తక్కిన మూడు వరాలలో ఒక వరం వల్ల మీకు కళ్లు కనిపించాలనీ, రెండవ వరం వల్ల మాకు రాజ్యం ప్రాప్తించాలనీ, మూడవ వరం వల్ల మా తండ్రికి కొడుకులు కలగాలనీ యముడిని ప్రార్థించాను. ధర్మదేవత దయతో నా ప్రార్ధనలన్నీ అంగీకరించి నన్ను ఆయన అనుగ్రహించాడు” అన్నది.
కోడలి మాటలు విని వృద్ధ దంపతులు ఆనందసాగరంలో తేలిపోతూ ఆమెనిలా అభినందించారు- "తల్లీ! కష్టాలనే సముద్రంలో మునిగిపోయిన మా వంశాన్ని గట్టెక్కించావు. నీ చరిత్ర లోక పూజ్యమమ్మా! ''
అక్కడ మునులందరూ జరిగిన సంగతి తెలుసుకొని సావిత్రి గొప్పతనం గుర్తించారు. ఆమెను ప్రశంసిస్తూ ఆశీర్వదించి తమ తమ నివాసాలకు వెళ్ళారు
*ద్యుమత్సేనునికి రాజ్యప్రాప్తి*
తర్వాత కొద్ది రోజులకు ద్యుమత్సేనుడి మంత్రులూ, సేవకులూ, పౌరులు ఆశ్రమానికి వచ్చి "రాజా! మీ శత్రువు తన సేవకులలో కలిగిన అంతఃకలహ వల్ల బంధుమిత్రవర్గంతో సహా మరణించాడు. ప్రజలందరూ మళ్లీ మీకే పట్టం కట్టాలని కోరుతున్నారు. రాజ్యమంత టా మీ విజయఘోషలే కనిపిస్తున్నాయి. మీ తపో బలంతో మళ్లీ మీకు కళ్లు వచ్చాయి. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మా కళ్లు చల్లబడ్డాయి. మా కోరిక మన్నించి వెంటనే బయలుదేరి రాజ్యానికి రండి! " అని ప్రార్థించారు.
ద్యుమత్సేన మహారాజు వాళ్ల మాటలు విని సంతసించాడు. వెంటనే ఆశ్రమవానులందరి తో ' వెళ్లి వస్తాను' అని చెప్పి వాళ్ల అనుమతి తీసుకొన్నాడు. కొడుకుతో గూడా భద్రగజాన్ని అధిష్ఠించాడు. సతీసమేతుడై పరివారంతో నహా బయలుదేరి వెళ్లి మళ్లీ తన రాజ్యం చేజిక్కించుకొన్నాడు. తర్వాత పౌరుల అనుమతితో సత్యవంతుణ్ణి యువరాజును చేశాడు. ధర్మం తప్పక రాజ్యం పాలించి కీర్తిమంతుడయ్యాడు.
ఈ విధంగా సావిత్రి తన పాతివ్రత్య ప్రభావం తో తననూ, భర్తనూ, అత్తమామలనూ, తల్లిదండ్రులనూ ఉద్దరించి లోకపూజ్యురాలై ప్రసిద్ధి వహించింది.
🪷
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment