Saturday, July 13, 2024

 *దేశం నడుస్తూనే ఉంది...*

మెదడు మోకాల్లోనో
వీపుపైనో కాదు
తల్లో ఉంటేనే అందం ఆనందం
తప్పకుండా వాడితేనే తలమానికం...

వ్యవస్థను బట్టి దేశపు మెదడు మెరుస్తుంది
వేగంతోను, నిదానంతోను
పరిస్థితులకు పరివారమై
దేశం ప్రతిభ ప్రతిష్ట పెంచాలి ఇప్పుడు...

ఎవరిదారిలో వారు 
నడుస్తూ
ఎవరిపనులు వారు చేస్తూ
దేశం ఎదుగుదలకు సహకరించాలి ఇప్పుడు...

రాజకీయ తంట
మతాల మంట
కులాల కుంట
అవినీతి పెంట
ఈ చతుర్ముఖ పద్మవ్యూహం నుంచి దేశాన్ని చెక్కే శిల్పి సామాన్యుడే...

దేశాన్ని ఆనందవనం చేయడానికి
అన్ని వర్గాలు కార్యచరణ కణికలవ్వాలి
దేశాన్ని అభివృద్ధి నిలయం చేయడానికి
అన్ని హృదయాలు ఇష్టాపూర్వ బలం అవ్వాలి...

దేశమంటే మనుషుల మాగాణి
దేశమంటే శ్రమజీవుల సౌధ విఫణి
దేశమంటే సకల కళల తరంగిణి
దేశమంటే ప్రపంచానికి దారి చూపే సామరస్య ధ్వనిమణి
దేశం బాగుండాలి
అందులో అందరముండాలి...

ఎప్పటినుంచో
నా దేశం మెదడును మోసుకుని నత్త నడక నడుస్తూనే ఉంది
అభివృద్ధి శిఖరంగా ప్రకాశించడానికి

ఈ నడక లక్ష్యం చేరుగాక
భారతీయుడి మదిగది ఉప్పొంగిపోవుగాక...

*అభిరామ్ 9704153642*

No comments:

Post a Comment