[7/21, 22:54] +91 94918 93164: *విరాట పర్వము – 5*
🎭
*అజ్ఞాతవాసం*
*ద్రౌపది భీముని సహాయం అర్ధించుట*
ద్రౌపది మనసులో “ కీచకుడు మహా బలవంతుడు. అతనిని చంపగలిగిన సామర్థ్యం భీమునికి మాత్రమే ఉంది ” అని తలచింది. ఆ రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో భీముని వద్దకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతున్న భీముని చూసి
“ ఆహా ! నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కాని అది చూసిన మీరు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు. అన్నగారు ఇది తగిన సమయం కాదని చెప్పాడనా ” అనుకుంటూ అతడిని తట్టి లేపింది.
భీముడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి “ఎవరు? ” అని అడిగాడు.
ద్రౌపది “నేను మాలినిని ” అన్నది. భీముడికు ద్రౌపది ఎందుకు వచ్చిందో అర్ధమైనా ఆమె నోట వినాలని “ఏమిటి ఇంత పొద్దుపోయి వచ్చావు? ఎవరు చూడకుండా వచ్చావా? ” అని అడిగాడు.
ద్రౌపది “అన్ని తెలిసి నన్ను అడుగుతారేమి. నా నోట వినాలనుందా! విరాటుని బావమరిది కీచకుడు సుధేష్ణ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసాడు. అతడు నన్ను మోహించి అనరాని మాటలాడి నన్ను అవమానించాడు. నేను అతనితో నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు జాగ్రత్త అన్నాను. సుధేష్ణ పంపగా మధిర కోసం కీచకుని ఇంటికి వెళ్ళాను. అతను నన్ను పట్టుకోవాలనుకున్నాడు నేను అతనిని విదిలించి పరుగెత్తుతూ సభా మండపానికి వచ్చాను. అతడు కూడా నన్ను వెన్నంటి తరుముతూ వచ్చాడు.
అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధవుడు అవమానించాడు. ఈనాడు విరాటుని కొలువులో కీచకునిచే అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్తగాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరుల ధర్మం. నేను ఇలా విలపిస్తుంటే ధర్మరాజు చూస్తూ ఎలా ఉన్నాడు? ” అన్నది.
భీముడు “ద్రౌపదీ! కీచకుడు నిన్ను అవమానించడం చూసిన నన్ను ధర్మరాజు అడ్డుకోకపోతే విరాటునితో సహా కీచకుని అతని సైన్యాన్ని హతమార్చే వాడినే. కాని అజ్ఞాతవాసం భగ్నం అయితే మరలా అరణ్య వాసం అజ్ఞాతవాసం ప్రాప్తించేవి. దీనికంతా కారణం నీవు నేను అని అందరూ మనలను నిందించరా. కనుక నన్ను నివారించిన ధర్మరాజును నిందించవలదు. సమయం మించిపోలేదు. కీచకుని చంపి నీకు ఆనందం కలిగిస్తాను అదెంత పని. కాని అది బహిరంగంగా జరగరాదు. రహస్యంగా చేయాలి కదా ” అన్నాడు.
ద్రౌపది “నేను ఎవరికి భయపడలేదు. అత్తగారు కుంతిని చూసి కాని భర్తలైన మిమ్మల్ని చూసి కాని భయపడలేదు. కాని సుధేష్ణను చూసి భయం కలుగుతుంది. మూర్కుడైన కీచకుని వలన జరిగిన అవమాన భారంతో అన్నాను కాని విషయం తెలియక కాదు. ధర్మరాజుని నిందించడం నా అభిమతం కాదు ” అన్నది.
ఇంకా ధర్మరాజును గురించి ద్రౌపది ఇలా చెప్పింది. “ భీమసేనా! రాజసూయ యాగ కర్త, అజాతశత్రువు, ధర్మనిరతుడనే పేరు ధర్మరాజుకే చెల్లింది కాని వెరెవరికి తగదు. అతని గంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతం మరెవరికి ఉంటాయి. అతడు సామాన్య మానవుడు కాదు. అట్టి మహాత్ముడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే బాధగా ఉంది. బకాసురుడు, కిమ్మీరుడు (జరాసంధుడు) మొదలైన రాక్షసులను చంపిన నీ లాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం ఎంత బాధాకరం. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో అంతఃపుర కాంతలకు నాట్యం నేర్పుతుంటే చూడటానికి కూడా మనసు ఒప్పలేదు. అత్యంత సుందరాంగుడు అరివీర భయంకరుడు అయిన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే కన్నుల నీరు ఆగడం లేదు. అత్యంత సుకుమారుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే దుఃఖభారం ఆగలేదు.
తల్లి తండ్రుల ప్రేమాభిమానాలు పొంది, రాజసూయ యాగంతో పునీతనై కుంతీదేవి లాంటి మహానుభావురాలి మన్ననలందిన నేను నేడు సైరంధ్రిగా సామాన్యురాలిగా సేవిస్తున్నాను. భీమసేనా! కీచకుని వధించక పోతే నాకు మనశ్శాంతి లేదు ” అని దుఃఖించింది.
భీముడు “ద్రౌపదీ! నీవు ఇంతగా చెప్ప పని లేదు. రేపటి రోజున కీచకునికి నా చేతిలో చావు మూడింది. నీవు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాసం ముగియనున్నది. రేపు నువ్వు కీచకుని కోర్కె అంగీకరించినట్లు నటించి అతనిని నర్తనశాలకు ఒంటరిగా రమ్మని చెప్పు. నేను అతనిని చంపుతాను. తెల్లవారబోతుంది ఇక వెళ్ళు ” అన్నాడు.
మరునాడు ఉదయం కీచకుడు నిద్రలేచాడు. కాలకృత్యాలు నిర్వర్తించాడు. ద్రౌపది మీది కోరిక కలిగింది. తనని చక్కగా అలంకరించు కున్నాడు. ద్రౌపది కోసం సుధేష్ణ అంత॰పురాని కి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఆమె దగ్గరగా పోయాడు. భీముడు చెప్పిన మాటలు మననం చేసుకుంది ద్రౌపది. అతనిని చూసీ చూడనట్లు నటించింది.
కీచకుడు ద్రౌపదితో “మాలినీ ఈ తిరస్కారం ఏమిటి? నేనంటే ఇష్టం లేదా? అసలు మగాళ్ళంటేనే ఇష్టం లేదా? నా సంపదలకు నీవే రాణివి. ఈ రాజ్యాన్నేలే విరాటరాజు పేరుకు మాత్రమే రాజు. నేనే అతనికి కూడు పెడుతున్నాను. ఈ రాజ్యంలో ప్రజలందరూ నన్నే రాజుగా ఆరాధిస్తారు. ఈ రాజ్యంలో ప్రజలెవరికీ నా మాట కాదనే ధైర్యం ఎవరికీ లేదు” అన్నాడు.
ద్రౌపది కొంచం మెత్తబడినట్లు నటించి
“ కీచకా! ఎంత కాదన్నా వినకుండా నా మీద మనసు పారేసుకున్నావు. నీలాగే ఎదుటి వారూ మనసు పారేసుకుంటారు కదా. మీరు పురుషులు కనుక బయట పడతారు కాని మగువలు అలా కాదు కనుక కీచకా రహస్యం గా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు” అంటూ నమ్మబలికింది ద్రౌపది.
కీచకుడు ఆనందపరవశుడై “మాలినీ నీ మనసు తెలిసింది కదా మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు” అని అడిగాడు.
ద్రౌపది “ఈ రోజు ఒంటరిగా నర్తనశాలకురా ” అన్నది.
కీచకుడు “మాలినీ! నీ అనుమతి ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు వస్తాను. మాట మీద ఉండు” అన్నాడు.
ద్రౌపది “నీవు ఒక్కడివే రావాలి. లేకుంటే నేను వెడలిపోవుట నిశ్చయం. ఇక మనమిరువుర ము ఇక్కడ ఉండుట భావ్యం తక్షణమే
వెళ్ళిపొండి” అన్నది.
🪷
*సశేషం*
[7/21, 22:54] +91 94918 93164: *విరాట పర్వము – 6*
🎭
*అజ్ఞాతవాసం*
*కీచక వధ*
కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో ” నేను నా పని పూర్తి చేసాను. ఇక మీ పని మీరు పూర్తి చెయ్యండి. ఈ రాత్రికి కీచకుని చంపాలి ఎలా చంపుతారో చెప్పండి ” అన్నది.
భీముడు ద్రౌపదితో ” ద్రౌపదీ! నీవు కీచకుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పు” అని అడిగాడు. ద్రౌపది జరిగినది చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు.
భీముడు ” ద్రౌపదీ ! ఇక చాలు ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను కాని అతడు చెప్పినట్లు ఒంటరిగా వస్తాడా! లేక బుద్ధిహీనుడై అందరికి చెప్తాడా? అయినా ఎందుకు చెబుతాడులే. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా పడుకున్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలిసుకుంటా డు. నేను ఒడిసి పట్టుకుని వాడి అంతు చూస్తాను. వాడు నా చేతిలో హతం కావడం నిశ్చయం ద్రౌపదీ! ఇక నీవు నిశ్చింతగా ఉండు” అన్నాడు.
భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాస భంగం ఔతుందేమో అనుకున్నది ద్రౌపది.
” భీమసేనా! కోపావేశంలో గుట్టు రట్టు చేయకు, ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు. కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలి ” అన్నది.
భీమసేనుడు ” ద్రౌపదీ !వాడు ఎదిరించి నిలబడితే ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుందా. అయినా నీవు చెప్పినట్లు రహస్యంగా చంపడానికి ప్రయత్నిస్తాను ” అన్నాడు.
ద్రౌపది “సుధేష్ణ నా కొరకు వెతుకుతుంటుంది నేను పోయి వస్తాను ” అని వెళ్ళిపోయింది.
కీచకుడు మనసు పరి పరి వధాల తపిస్తుంది అతడు మనసులో “అయ్యో ! ఎంతకీ రాత్రి కాదేమి. మాలిని వస్తుందో రాదో, వచ్చినా ఏమంటుందో, రాత్రిలోగా మనసు మారుతుందేమో, ఆమెకు అయిదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్న మాట నిజమేనా, మాలిని వచ్చే వేళకు సుధేష్ణ ఏదైనా పని చెప్తుందేమో అనుకున్నాడు. మరలా మాలిని ఎందుకు రాదులే అంత కఠినాత్మురాలా. ఆమె వచ్చే ముందు నేనే ఆమెను తీసుకు రావచ్చు కదా ” అనుకున్నాడు. కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించనందు కు సూర్యుని నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి రాకుండా పగలే ఉంచాడని అనుమాన పడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు.
చంద్రోదయం అయింది ద్రౌపది కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. చంద్రుడు కూడా అస్తమించాడు. బాగా పొద్దు పోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళి సమయం ఆసన్నమయినదని భీమసేనుని తొందర పెట్టింది. భీముడు ఒక చీరని తలపాగాలా చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు. ద్రౌపది అతనిని అనుసరించింది.
ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. పాన్పు మీద పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి ”మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను” అన్నాడు కీచకుడు.
భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో
” మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే. నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే” అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.
ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు, అజ్ఞాతవాస భంగం అవుతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలం తగ్గిపోయింది. భీన్మసేనుని బలం అమాంతం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళాను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో
” కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాటపడ్డావు” అనుకున్నది.
భీముడు ”ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా బుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా ” అన్నాడు.
ద్రౌపది ఆనందంతో ” నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈనాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా ” అన్నది. ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది.
ద్రౌపదీ ”ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను” అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.
🪷
*సశేషం*.
[7/21, 22:54] +91 94918 93164: *విరాట పర్వము – 7*
🎭
*అజ్ఞాతవాసం*
*ఉపకీచకుల వధ*
కీచకుని వధించిన భీముడు వంటశాలను చేరాడు. శరీరాన్ని శుభ్రంగా కడిగాడు. ఒంటికి రక్త వాసనలు తెలియకుండా పూత పూసాడు. తన శయ్యపై కూర్చున్నాడు. ద్రౌపది తన భర్త క్షేమంగా చేరుకున్నాడని దృవపరచుకుని అక్కడ ఉన్న కావలి వాళ్ళను పిలిచింది. వారితో “నా భర్తలైన గంధర్వుల వలన ఇతడు ఎలాంటి దుర్గతి పాలయ్యాడో చూడండి ” అన్నది. వారు అది విని కలవరపడి పెద్దగా అరచుకుంటూ నర్తనశాలలోకి ప్రవేశించారు.
కావలి వాళ్ళ అరుపులు విని ఉపకీచకులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చారు. ఇంతలో వారి బంధువులు కూడా అక్కడికి వచ్చారు. వారిలో వారు 'ఎన్నో చావులు చూసాము కాని ఇలాంటి వింత చావు చూడలేదు. అసలు వీడికి చేతులు ఏవి? కాళ్ళు ఏవి ? గంధర్వులు ఇలాగే చంపుతారేమో. ఎందరినో యుద్ధ భూమిలో జయించిన సింహబలుని బలం ఎందుకూ కొరరానిదైంది కదా' అనుకున్నారు.
ఉపకీచకులలో ఒకడు “ఎంతసేపు ఏడ్చినా పోయిన వాడు తిరిగి వస్తాడా. ఇతనికి అంత్యక్రియలు చేద్దాము ” అన్నాడు. మిగిలిన కీచకులు సరే అన్నారు. ద్రౌపది వారికి దగ్గరగా నిలబడి వారేమి చేస్తున్నారో చూస్తూ ఉంది. ఆమెను చూసిన కీచకులు కోపంతో రెచ్చిపోయారు. తమ అన్న మరణానికి కారణం ఆమె అని అనుకున్నారు. ఒక్కసారిగా ద్రౌపది మీదకు దూకి ఆమెను పట్టుకున్నారు. ఆమె చేతులు వెనక్కు విరిచి కట్టారు. వారు “దీని వలనే దీని అందం చూసి మోహించే కీచకుడు మరణించాడు. అంతటికీ కారణం ఈమే కనుక ఈమె ఇక బ్రతుక కూడదు. అన్న శవంతో చేర్చి కాల్చి వేయాలి ” అని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలిపి అతని అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. అప్పటికే కీచకుని మరణవార్త విన్న విరాటుడు కీచకుని మరణానికి ఎంతో దుఃఖిస్తున్నాడు.
“మహారాజా! మేము ఈ సైరంధ్రిని కీచకుని శవంతో చేర్చి దహనం చేయాలని అనుకున్నాం, ఇందుకు మీరు మాకు అనుమతించాలి” అని అడిగారు.
విరాటుడు “మీకు తోచని విధంగా చేయండి” అని చెప్పాడు. ఉపకీచకులు ద్రౌపదిని ఈడ్చుకు వెళ్ళి కీచకుని శవంతో కట్టారు. అందరూ శ్మశానానికి బయలుదేరారు. అనుకోని ఈ పరిణామానికి ద్రౌపది కలత చెందింది.
ఆపత్సమయంలో ఒకరిని ఒకరు తోడు కోసం పిలుచుకోవడానికి పాండవులు నిర్ణయించు కున్న మారు పేర్లతో ద్రౌపది భర్తలను ఎలుగెత్తి పిలువసాగింది.
“జయా! జయంతా! విజయా! జయత్సేనా! జయత్బలా! నన్ను ఈ దుర్మార్గులు కీచకుని శవంతో కట్టి దహనం చేయడానికి తీసుకుపో తున్నారు. రక్షించండి” అని తన రక్షణ కోసం పెద్దగా ఏడుస్తూ పాండవులను పిలిచింది. ద్రౌపది కేకలు భీముని చేరాయి. భీముడు ఆగ్రహోదగ్రుడై వారికంటే ముందుగా శ్మశానం చేరాడు. ఒక పెద్ద చెట్టును మొదలంటా పెకిలించి భుజంపై పెట్టుకుని ఉపకీచకుల రాకకై ఎదురు చూస్తున్నాడు.
శ్మశానం చేరుకున్న ఉపకీచకులు భయంకరా కారంతో నిలబడి ఉన్న భీముని చూసి గంధర్వుడు వచ్చాడనుకుని భయపడి శవాన్ని అక్కడే వదిలి పారిపోయారు. భీముడు వారిని తరిమి తరిమి కొట్టి సంహరించాడు. తర్వాత ద్రౌపదిని విడిపించి “త్వరగా సుధేష్ణ మందిరానికి వెళ్ళు” అని ద్రౌపదికి చెప్పి తాను వడివడిగా వంటశాల చేరుకున్నాడు.
ఉపకీచకుల మరణ వార్త విన్న విరాటుడు తన భార్య సుధేష్ణ వద్దకు వెళ్ళి “సుధేష్ణా! ఈ సైరంధ్రీని ఎలాగైనా ఇక్కడి నుండి బయటకు పంపు. ఆమె ఇక్కడ ఉంటే మగవాళ్ళు ఆమె పక్కకు పోతేనే ప్రమాదంలో చిక్కుకుంటున్నా రు. ఆమె ఇక్కడ ఉంటే మరింతగా అనర్ధాలు జరిగేలా ఉంది. నా మాటగా చెప్పి ఆమెను పంపించు” అన్నాడు విరాటుడు.
శవాన్ని తాకిన మైల పోవడానికి ద్రౌపది సచేల స్నానం చేసింది. సుధేష్ణ మందిరానికి చేరటానికి పురవీధులలో నడచి వస్తుండగా ప్రజలు ఆమెను చూసి భయభ్రాంతికి లోనయ్యారు. “ఈమెను కోరిన కీచకుడంతటి వానికే ఈ గతి పట్టింది ఇక మనమెంత ? ” అంటూ ఆమెను చూడటానికే భయపడ్డారు. వంటశాలను సమీపించిన ద్రౌపది ఎవరికీ అర్ధం కాకుండా “కీచకుల బారి నుండి నన్ను రక్షించిన నా గంధర్వ పతికి నమస్కరిస్తున్నా ను” అన్నది. భీముడు కూడా అలాగే ఎవరికీ అర్ధం కాకుండానే “ఆపదలో ఉన్న భార్యను రక్షించడం భర్త కర్తవ్యం కదా దానికి పొగడ్త ఎందుకు” అన్నాడు.
ద్రౌపది అక్కడి నుండి నర్తనశాలకు వెళ్ళింది. నాట్యం నేర్చుకుంటున్న కన్యలను చూస్తూ నిలబడింది. ఆమెను చూసిన కన్యలు
“ అయ్యో ఆ కీచకుడు ఇంత పని చేసాడా. తగిన శాస్తి జరిగింది. ఉప కీచకులు నిన్ను కీచకుని శవంతో కట్టి తీసుకుపోవడం ఏమిటి? నీ భర్తలచే వారికీ తగిన శాస్తే జరిగిందిలే ” అన్నారు.
ఆమెను చూసిన బృహన్నల “మాలినీ ఏమి జరిగిందో వివరంగా చెప్పు” అని అడిగాడు.
ద్రౌపది “బృహన్నలా ! అంతఃపురంలో కన్యలకు ఆటపాటల నేర్పుకుంటున్న నీకు ఈ సైరంధ్రికి ఏమి జరిగినా పట్టదు కదా. అందుకే ఏమి జరిగిందని అడుగుతున్నావు” అన్నది.
బృహన్నల ” అయ్యో ! సైరంధ్రీ నీవు పడుతున్న కష్టాలు తెలిసినా నిన్ను ఆదుకోలేని పుట్టుక నాది. ఏమి చెయ్యగలను మనసులో నేను పడే బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పు ? నీవు ఏ అపరాధం చేయవని నేనెరుగనా, నీ కస్టాలు నన్ను బాధించవా” అని నిగూఢంగా అన్నాడు బృహన్నల.
ద్రౌపది “అయ్యో ! నీ సంగతి నాకు తెలియనిదా. అంతఃపురంలో నీవు నీకు తగిన విధంగా ఉండటమే నాకు కావలసింది ” అన్నది ద్రౌపది.
ఆమె మిగిలిన అంతఃపుర కాంతలతో చేరి సుధేష్ణ మందిరంలో ప్రవేశించింది. సుధేష్ణ ఆమెను సాదరంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె ద్రౌపదితో “సైరంధ్రీ! నీవు చక్కనిదానవు. కాని మగవాళ్ళు ఏమాత్రం నిగ్రహం లేని వాళ్ళని విరాటరాజు భయపడుతున్నాడు. నీ భర్తలైన గంధర్వులు నిన్ను చూసినంతనే మగవాళ్ళను వెంటనే హతమారుస్తున్నారు. ప్రజలు నిన్ను చూస్తేనే భయపడుతున్నారు. విరాటరాజు నిన్ను నువ్వు కోరిన చోటికి పంపమని తన మాటగా నాకు చెప్పాడు. కనుక నీవు మా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళు” అన్నది.
ద్రౌపది “అమ్మా ! సుధేష్ణా ఇక పదమూడు రోజులు మాత్రం నన్ను ఎప్పట్లా మీ ఇంట ఉండనివ్వండి చాలు. అంతటితో నా వ్రతం పూర్తి ఔతుంది. ఆ తరువాత నా భర్తలు మీకు కనిపించి మీ కోరిక తీరుస్తారు. వారు దయామయులు, పరోపకార పరాత్పరులు. వారికి ఉపకారం చేసిన విరాటునికి వారు ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక సందేహించకు. ఇంత కాలం నన్ను మీతో సమానంగా ఆదరించి ఇప్పుడు విడిచి పెట్టడం భావ్యమా ” అని వేడుకుంది.
ద్రౌపది మాటలకు చలించిన సుధేష్ణ
“మాలినీ! నీ వ్రతం పూర్తయ్యే వరకు నా ఇంట ఉండవచ్చు. నా భర్తను, కుమారుని రక్షించుము. నీవు ఇక అంతఃపురం దాటి రావద్దు. నీకు కావలసినవన్ని నేను సమకూరుస్తాను” అని పలికింది.
మత్స్య దేశంలో ప్రజలు జరిగిన ఉదంతం గురించి నానా విధాలుగా అనుకుంటున్నారు. ” అత్యంత బలశాలి అయిన విరాటుని బావమరిది ఒక్క ఆడదాని కోసం గంధర్వుని చేతిలో మరణించాడు” అని అనుకోసాగారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
[7/21, 23:00] +91 94918 93164: *విరాట పర్వము – 8*
🏹
*అజ్ఞాతవాసం*
*దుర్యోధనుడు పాండవుల జాడకై ప్రయత్నించుట*
హస్థినలో దుర్యోధనుడు చారుల ద్వారా ఈ విషయం విన్నాడు. వెంటనే సభ ఏర్పాటు చేసాడు. దుర్యోధనుడు “పాండవులు అరణ్యవాసం అజ్ఞాత వాసం ముగించుకుని రాజ్యభాగాన్ని అడగక ముందే వారిని తిరిగి అరణ్యాలకు పంపే మార్గం ఆలోచించండి ” అని దుర్యోధనుడు తన మంత్రులను ఆదేశించాడు.
కర్ణుడు లేచి “సుయోధనా ! మనం వేలకొలది చారులను మారువేషాలలో దేశం నలు మూలలకు పంపుదాం. వారు తప్పకుండా పాండవులను గుర్తిస్తారు ” అన్నాడు.
దుశ్శాసనుడు లేచి “పాండవుల గురించి నీవు భయపడవలసిన పని లేదు. వారు ఎప్పుడో అడవులలో కృరమృగాలకు బలి అయి ఉంటారు. వారిని గురించి ఆలోచించడం అనవసరం” అన్నాడు.
ద్రోణుడు లేచి “సుయోధనా! పాండవులకు ఆపద కలగడం అసంభవం. కనుక వారిని వెతికించే ఏర్పాట్లు ముమ్మరం చెయ్యండి ” అన్నాడు.
భీష్ముడు “సుయోధనా ! ద్రోణాచార్యులు చెప్పింది సత్యం. పాండవులు బాహుబలం లోనూ, బుద్ధిబలంలోనూ అసమానులు. దైవబాలం కూడా తోడైంది కనుక వారికి ఆపద కలుగుట అసంభవం. నాకు పాండవులు మీరు సమానులు… కాని అడిగావు కనుక చెబుతున్నాను. పుణ్యత్ముడైన ధర్మరాజు ఏ రాజ్యంలో ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ధర్మవర్తనులై ఉంటారు. అక్కడ పశుసంపద అభివృద్ధి చెందుతాయి. కనుక అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ వెదికించడం మంచిది ” అన్నాడు.
అది విన్న కృపాచార్యుడు “ఆలస్యం చేయకుండా వెదికించడం మంచిది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసారు. అజ్ఞాత వాసం దాదాపు పూర్తి అయింది. పగవాడు అల్పుడైనా అతని పట్ల అప్రమత్తం గా ఉండాలి. పాండవులు మహా బలవంతులు పైగా సుయోధనుని పై ద్వేషంగా ఉన్నారు. కనుక వారితో సంధి చేసుకొనుట సముచితం. లేకున్న యుద్ధం అనివార్యం. పాండవులు సంధికి అంగీకరించకున్నా యుద్ధం తప్పదు. వారు అరణ్యాలలో మరణించారనుకున్నా వారి మిత్రదేశరాజులు మనపై దండెత్తే అవకాశం ఉంది కనుక మనం సైన్యాన్ని సమాయత్త పరచడం మంచిది ” అన్నాడు.
దుర్యోధనుడు అందరి మాటలను సావధానం గా విని సభను ఉద్దేశించి “కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు అసమాన బలాఢ్యులు. వీరితో పోలినవారు భూమిలో ఎవరూ లేరు. వారిలో వారే ఒకరిని ఒకరు గెలవాలి. మత్స్యదేశ సైన్యాద్యక్షుడు కీచకుని గంధర్వుడెవరో చంపాడని తెలిసింది. ఒక కాంత కారణంగా చంపారు అని తెలిసింది. కీచకుని చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఒకరు చంపాలి. బలరాముడు, శల్యుడు మత్స్య దేశానికి దూరంగా ఉన్నారు కనుక వారు చంపలేరు. ఉపకీచకులతో చేర్చి కీచకుని వధించిన గంధర్వుడు అజ్ఞాతవాసం లో ఉన్న భీముడై ఉండచ్చు. ఆ కాంత ద్రౌపది కావచ్చు. తాతగారైన భీష్ముడు చెప్పిన లక్షణాలు మత్స్య దేశంలో కానవస్తున్నాయి. కనుక మనం పాండవుల కొరకు మత్స్యదేశం లో వెదకడం మంచిది. విరాటుడు మన శత్రువు కనుక అతని గోధనాన్ని అపహరిస్తే పాండవులు అతనికి సహాయంగా బయటికి వస్తారు. సమయభంగం అయినదని వారిని గుర్తించి తిరిగి అరణ్యవాసానికి పంపచ్చు. పాండవులు లేకున్నా అతని సంపదనంతా కొల్లగొడతాము కనుక మనకు ఎలాగైనా లాభమే. ఇది అందరికి సమ్మతమైతే యుద్ధప్రయత్నాలు చేయండి ” అన్నాడు.
దుర్యోధనుని మాటలు విన్న త్రిగర్త దేశాధిపతి “సుయోధన సార్వభౌమా! ఇంతకు పూర్వం కీచకుడు నన్ను యుద్ధంలో గెలిచాడు. అతడు మరణించినందున అతనితో యుద్ధం చేసే వీలు లేదు. నన్ను విరాటుని మీదకు యుద్ధానికి పంపండి. నేను విరాటుని ఓడించి అతని పశుధనం పట్టుకొస్తాను. అలాగే పాండవుల జాడ తెలుసుకొస్తాను” అన్నాడు.
అది విన్న కర్ణుడు “సుయోధనా! త్రిగర్త దేశాధీసుడు ఉచితముగా చెప్పాడు. అందుకు మీరు అనుమతి ఇవ్వండి” అన్నాడు.
సుయోధనుడు ఆలోచించి చూసి దుశ్శాసను నితో “ఈ సభలోని పెద్దలు నీకు అనుమతి ఇచ్చారు. మన సైన్యాలను సిద్ధం చెయ్యి. ముందురోజు సుశర్మ విరాటుని మీదకు యుద్ధానికి వెళతాడు. మరునాడు మనం విరాటుని మీదకు యుద్ధానికి వెళతాము” అని సుయోధనుడు అన్నాడు. దుశ్శాసనుడు అలాగే అన్నాడు.
దుర్యోధనుడు తన వ్యూహాన్ని ఇలా వివరించాడు. “ముందుగా సుశర్మ తన బలగాలతో వెళ్ళి ఒక వైపుకి గోవులను మళ్ళిస్తాడు. విరాటుడు సుశర్మతో యుద్ధానికి దిగుతాడు. మరునాడు మనం మరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుందాం. అప్పుడు గత్యంతరం లేక పాండవులు మనతో యుద్ధానికి వస్తారు” అంటూ సుశర్మను చూసి ”రాబోయే బహుళ అష్టమి నాడు నీవు నీ సేనతో విరాటుని గోగణాన్ని అపహరించు. మేము మరునాడు వేరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుంటాము ” అన్నాడు. అందరూ యుద్ధానికి సిద్ధం అయ్యారు కాని అప్పటికే పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయిందని ఎవరూ ఊహించలేదు.
సుశర్మ తన సైన్యాలతో మత్స్యదేశం పై దండెత్తాడు. చారుల వలన గోసమూహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని పట్టుకోవడానికి ముందుకుసాగాడు. గోసమూహాలను చేరి వాటిని మళ్ళిస్తున్నా డు. గోరక్షకులు సుశర్మతో పోరాడుతున్నారు కాని సుశర్మ సైన్యాల ధాటికి ఆగలేకపోతు న్నారు. వెంటనే వారంతా విరాటుని వద్దకు పరుగెత్తారు.
విరాటుడు వారిని చూసి కలవర పడ్డాడు. వారు “మహారాజా ! సుశర్మ తన సేనలతో వచ్చి మన గోసమూహాలను మళ్ళించుకు పోతున్నాడు. తమరు వచ్చి కాపాడాలి ” అన్నారు. అది విన్న విరాటుడు ఆశ్చర్య పోయి ఇలా అన్నాడు. “మీరు చెప్పేది నిజమా. మన చేతిలో చావు దెబ్బ తిన్న సుశర్మకు ఇంతలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది ” అంటూ మంత్రులను చూసి “ఇప్పుడు మనం మన సేనలను తీసుకువెళ్ళి సుశర్మతో యుద్ధం చేయాలి. లేకుంటే మన పశుధనం మనకు దక్కదు. వెంటనే యుద్ధానికి సిద్ధం కండి ” అన్నాడు.
విరాటుడు చారుల ద్వారా సుశర్మ గోగణాల తో ఎటు వెళుతున్నాడో తెలుసుకుని అటు వైపు తన సేనలను నడిపించాడు. విరాటుని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు తమతమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంఖుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఈ సమర సన్నాహాలను చూసిన ధర్మరాజు తన తమ్ములను తీసుకుని విరాటుని వద్దకు వచ్చాడు.
ధర్మరాజు విరాటునితో “మహారాజా నేను ఇది వరకు ఒక ఋషి వద్ద ఎన్నో శాస్త్రాలు అభ్యసించాను. నాకు యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉంది. తమరు యుద్ధానికి వెళుతుంటే నేను ఊరకుండటం న్యాయమా, నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను ” అన్నాడు. విరాటుడు అందుకు అంగీకరించాడు. వెంటనే ధర్మరాజు తన తమ్ములైన భీమ, నకుల, సహదేవులను రమ్మని సైగ చేసాడు.
ధర్మరాజు విరాటునితో “మహారాజా! ఇతడు మన వంటవాడు వలలుడు మల్లయుద్ధంలో నేర్పరని మీకూ తెలుసు మనకు యుద్ధంలో అవసరపడగలడు. అలాగే మన అశ్వపాలకు డైన తామ్రగంధికి యుద్ధంలో ప్రావీణ్యం ఉంది. అలాగే గోరక్షకుడైన తంత్రీపాలునికి యుద్ధం లో నేర్పు ఉంది. అందుకని వీరిని కూడా యుద్ధానికి పిలుచుకుపోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది” అన్నాడు.
విరాటుడు శతానీకుని పిలిచి వారికి కూడా రధాలను సిద్ధ పరచమని చెప్పాడు.
🏹
*సశేషం*
[7/21, 23:00] +91 94918 93164: *విరాట పర్వము – 9*
🏹
*అజ్ఞాతవాసం*
*సుశర్మ విరాటరాజుల యుద్ధం*
అందరితో కలసి విరాటుడు సుశర్మ గోవులను మళ్ళించిన వైపు సైన్యాలను నడిపించాడు. సుశర్మ సేనలను చేరుకున్నాడు. సుశర్మ సేనలకు విరాటుని సేనలకు ఘోర యుద్ధం జరిగింది. శతానీకుడు తన సేనలతో సుశర్మ సేనలను చుట్టుముట్టాడు. మదిరాశ్వుడు తన సేనలతో సుశర్మ సేనలను నుగ్గు నుగ్గూ చేస్తున్నాడు. సూర్యదత్తుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను కకావికలు చేస్తున్నాడు. విరాటుడు కూడా యుద్ధరంగం లో ఎక్కడ చూసినా తానే అయి యుద్ధం చేస్తున్నాడు. విరాటుడు సుశర్మ రధాన్ని చూసి సుశర్మను ఎదుర్కొన్నాడు. ఇద్దరూ భీకరంగా పోరు సాగించారు. విరాటుని ధాటికి తాళలేక సుశర్మ సేనలు తిరుగు ముఖం పట్టాయి.
ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు అలుముకున్నాయి. కళ్ళు కనిపించక యుద్ధం ఆపివేసారు. కొంతసేపటికి చంద్రోదయం అయింది పండు వెన్నెల వచ్చింది. ఆ వెన్నెల వెలుగులో ఇరు పక్షాలు మరలా యుద్ధానికి సిద్ధపడ్డాయి. సుశర్మ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు. విరాటుని సారధిని గుర్రాలను చంపి విరాటుని పట్టుకున్నాడు. తన రథం మీదకు విరాటుని లాగిన సుశర్మ పెద్దగా సింహనాదం చేసాడు. విజయ దుంధుభులు మ్రోగించారు.
సుశర్మ విరాటుని పట్టుకున్నాడన్న వార్త అందరికీ తెలిసింది. ధర్మరాజు భీముని పిలిచి “భీమా! ఈ విరాటుని కొలువులో మేము తలదాచుకుని బ్రతుకుతున్నాము. సుశర్మ విరాటుని బంధీగా పట్టుకున్నాడు. అతన్ని విడిపించడం మన ధర్మం. సుశర్మను వెంబడించి విరాటుని విడిపించి తీసుకురా” అన్నాడు.
భీమసేనుడు ”అన్నయ్యా! అదెంత పని ఈ మద్ది చెట్టును పెకిలించి సైన్యాన్ని చావగొట్టి విరాటుని విడిపించుకు వస్తాను” అన్నాడు. ధర్మరాజు నవ్వి భీమసేనా ”నువ్వలా చేస్తే నువ్వు భీముడవని అందరికి తెలిసిపోతుంది. మన అజ్ఞాతవాసం భంగం ఔతుంది. కనుక విల్లు అంబులతో యుద్ధం చెయ్యి. నకుల, సహదేవులు నీకు చక్ర రక్షకులుగా ఉంటారు” అని అన్నాడు. భీముడికి నిరాశ కలిగినా అన్న మాట ప్రకారం చెట్ల జోలికి పోకుండా
“అన్నయ్యా! తమరు చెప్పినట్లే చేస్తాను నా భుజబలంతో శత్రువులను ఓడిస్తాను. విరాటుని తెచ్చి అప్పగిస్తాను” అన్నాడు.
అంతట ధర్మరాజు తాను ముందుండి సేనలను నడిపించాడు. త్రిగర్త సైనికులు ఇది చూసి ధర్మరాజు పై కత్తులు బాణాలతో దాడి చేసారు. భీముడు శత్రువుల రధాలను విరగొట్టాడు, సారధులను చంపాడు. ధర్మరాజు సుశర్మను ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. ఇది చూసిన సుశర్మ రథంలో ఉన్న విరాటుడు పక్కనే ఉన్న గద ఒకటి తీసుకుని రథం మీద నుండి కిందికి దూకి సుశర్మను మోదాడు. అదే అదనుగా తీసుకుని భీముడు సుశర్మ రథం మీదకు దూకాడు. సుశర్మను పట్టుకుని అతని చేతులు విరిచి పట్టుకుని గట్టిగా సింహనాదం చేసాడు. సుశర్మ సేనలు ఆశ్చర్యపోయాయి. సుశర్మ చక్రరక్షకులు పారిపోయారు. సుశర్మ సైన్యాలు వెనుదిరిగాయి. భీముడు వారిని వెంబడించి తరిమాడు. సుశర్మ తోలుకు పోతున్న పశువులను మళ్ళించాడు.
అన్నగారు ధర్మరాజుతోను నకుల సహదేవుల తోను భీముడు విరాటుని దగ్గరకు వచ్చాడు. విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో వారిని అభినందనలతో ముంచెత్తాడు. విరాటుడు ధర్మరాజును చూసి “మీరు నా ధన, మాన, ప్రాణాలను కాపాడారు. అందుకు ప్రతిగా నేను ఏమిచ్చుకోగలను. నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంటాను. ఇది మీరు కాపాడిన శరీరం, ఈ రాజ్యం మీరు జయించింది. కనుక ఈ మత్స్యదేశాన్ని మీరే తీసుకోండి” అన్నాడు.
ధర్మరాజు విరాటునితో “మహారాజా! ఇది మీకు మా మీద ఉన్న మర్యాద. మీరు విజయోత్సాహంతో మత్స్యదేశంలో విజయం చేయడం కంటే నాకు మరొక ఆనందం లేదు. నన్ను ఇంతగా పొగడ తగదు” అన్నాడు.
విరాటరాజు ధర్మరాజుని చూసి “కంకా! నాకు అర్ధంకానిది ఒకటి ఉంది. నువ్వు చేసింది నాకు ఉపకారమా లేక నా వద్ద ఉన్నందుకు సేవాతత్పరతా ! నాపై కృతజ్ఞతా ! లేక నా పై కృపా ! లేక శతృ సంహార మొనర్చి నీవు కీర్తి పొందుదామనా? ఏ కారణంతో నీవు ఈ శత్రు సంహారం చేసావు. అయినా వంటల వాడేమిటి? అతని పరాక్రమం ఏమిటి? ఆ యుద్ధం చేయడమేమిటి? ఇతడే కదా నన్ను యుద్ధంలో గెలిచింది. ఈ అశ్వశిక్షకుడు, గోపాలకుడు వీరిద్దరే యుద్ధంలో గాయపడ కుండా శత్రుసంహారం చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వాడే నిజమైన మిత్రుడు. కంకా ! నీ మైత్రిని నేను ఎన్నటికీ మరువలేను. మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి గజములా ! అశ్వములా ! కాంచనమా! రత్నములా ! వజ్ర వైఢూర్యములా ! దేవతా కాంతల పోలు అందగత్తెలా ! నానావిధ భోగభాగ్యములా ! మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి నేను మీకు సమర్పించుకుంటాను ” అన్నాడు.
అది విన్న పాండవులు “మహారాజా ! మీరు మమ్ము ఇలా గౌరవించడం మాకు ఎంతో ఎక్కువ. దీని కంటే మీరు ఇస్తానన్న కానుకలు ఎక్కువ కాదు. మనం అందరం నగరానికి చేరుకున్న తరువాత మమ్ములను తగురీతిన సత్కరించండి ” అన్నారు.
ధర్మరాజు విరాటుని చూసి “మహారాజా ! నా దొక మనవి. మీరు కోరుకోమని చెప్పారు కనుక కోరుతున్నాను. ఈ సుశర్మను అతని బంధు మిత్రులతో ససైన్యంగా విడుదల చెయ్యండి. ఇదే నేను కోరుకొనేది. వెంటనే మన నగరంలో ఈ విజయ వార్తను ప్రకటించండి. విజయోత్సవాలు జరిపించండి” అని అన్నాడు. ధర్మరాజు కోరిన ప్రకారం విరాటుడు సుశర్మను అతని బంధుమిత్రుల ను ససైన్యంగా విడుదల చేసాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు విరాట నగరానికి ప్రయాణమయ్యారు.
🪷
*సశేషం*.
*విరాట పర్వము – 10*
🏹
*అజ్ఞాతవాసం*
*ఉత్తరకుమారుని ప్రగల్భాలు*
సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం భీష్ముడు, దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలసి విరాటనగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్ది పాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించలేకపోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రథం తీసుకుని విరాట నగరానికి వెళ్ళాడు.
ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. గవాధ్యక్షుడు
“ఉత్తరకుమారా ! కురు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకుపడ్డాయి. ఆవుల మందలను అపహరించుకునిపోతు న్నాయి మీరు వెంటనే వచ్చి వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి ” అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు తమపరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్య పరాక్రమాల గురించి చెప్తూ తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తుంటారు. తమరి పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి మన ఆలమందలను రక్షించండి ” అని ప్రార్ధించాడు.
గవాధ్యక్షుని పొగడ్తలకు ఉత్తర కుమారుడు పొంగిపోయాడు. “గవాధ్యక్షా! నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కాని నాకు తగిన సారధి లేడు కదా! అందుకని బాధగా ఉంది. సమర్ధుడైన సారధి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వద్దామలను నేను చీసే యుద్ధంతో అర్జునిని తలపింప చేసి ఆలమందలను విడిపించకుంటే నా తండ్రి నా పరివారం నన్ను మెచ్చుతారా. ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకుపోతారు. వెంటనే తగిన సారధిని వెతకండి ” అన్నాడు.
ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది ఉత్తర కుమారుడు తనను తాను అర్జునినితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జునిని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది. అర్జునుడు లెక్కలు వేసి చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుక పరచుకొనే సమయం ఆసన్న మైనదని గ్రహించాడు. ద్రౌపదిని చూసి “నీవు పోయి మన బృహన్నలకు సారధ్యం చేయు సామర్థ్యం కలదు. పూర్వం అర్జునినికి సారధ్యం వహించి అతనికి ఖాండవ వన దహనంలో సహాయం చేసి అతని ప్రశంశ లందుకున్నాడు. అతని సహాయంతో కౌరవ సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు ” అన్నాడు.
ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకుని
“అమ్మా! మన రాకుమారుడు సారధి కొరకు వెతుకుతున్నాడు అని తెలిసింది. మీ గురువు గారు బృహన్నలకు రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. ఖాండవ వన దహనంలోను ఇతర సమయాల లోను అర్జునునికి సారధిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయం రాకుమారునికి చెప్పు ” అన్నది.
ఉత్తర మాలినితో చేరి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పింది. అది విన్న ఉత్తర కుమారుడు ఫక్కున నవ్వాడు. ద్రౌపదితో
“సైరంద్రీ ! నన్ను ఎగతాళి చేస్తావా ! నేను బృహన్నల వంటి వారిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి బృహన్నలను నాకు సారధిని చేస్తావా. కౌరవుల సేనలు వచ్చి గోవులను పట్టుకుని నేను వారిపై యుద్ధానికి వెళ్ళి ప్రతాపం చూపవలసిన తరుణంలో నేను బృహన్నల సారధ్యంలో వెళితే నలుగురూ నవ్వరా? అయినా మన దేశంలో సారధులకు ఇంత కరువొచ్చిందా ” అన్నాడు.
సైరంధ్రి “రాకుమారా! ఒక్క కౌరవ సైన్యం మాత్రమే కాదు ముల్లోకాలు ఒకటై వచ్చినా బృహన్నల సారధిగా ఉన్నచో నువ్వు గెలువ వచ్చు. కారణాంతరాల వలన పేడి తనం వచ్చినంత మాత్రాన అతని సామర్థ్యం పోతుందా ” అన్నది. ఉత్తర కుమారుడు గత్యంతరం లేక బృహన్నలను సారధిగా అంగీకరించాడు.
ఉత్తర కుమారుడు బృహన్నల సారధ్యాన్ని అంగీకరించగానే ఉత్తర బృహన్నల వద్దకు పరుగెత్తింది. గురువు గారికి నమస్కరించి
” మా అన్నయ్య సారధి ఒక యుద్ధంలో మరణించాడు. మరల వేరే సమర్ధుడైన సారధి లభించలేదు. ఈ రోజు కౌరవ సేన మా గోవులను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవడానికి తగిన సారధి లేడని బాధపడుతున్నాడు. మీ సారధ్య సామర్థ్యం గురించి సైరంధ్రి చెప్పింది. అందుకని మా అన్నయ్యకు సారధిగా మిమ్మలిని తీసుకు పోవడానికి వచ్చాను నా మాట మన్నించి నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి ” అన్నది.
బృహన్నల నవ్వి అమ్మా “అమ్మా! ఉత్తరా నాకు సారధ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి. నువ్వు అడిగావు కనుక సారధ్యమే కాదు ఎంతటి కష్టమైన పని అయినా చేసి పెడతాను ” అన్నాడు. బృహన్నల అంత దూరంలో ఉండగానే ఉత్తరకుమారుడు
“ నేను కౌరవులతో యుద్ధం చేయాలి. నీవు సారధిగా నా రథం నడపాలి. త్వరగా రథం ఎక్కు. నీ గురించి సైరంధ్రి చెప్పింది” అన్నాడు.
బృహన్నల ఉత్తరునితో “రాకుమారా! ఏదో ఆట పాటలకు నన్ను పిలువవచ్చు కాని యుద్ధం చేయుటకు సారధిగా నన్ను పిలుచుట ఉచితమా. ఎక్కడైనా బలాఢ్యుడైన వాడిని సారధిగా నియమించు ” అని అన్నాడు
బృహన్నల. “అదేమిటి బృహన్నలా! నాడు ఖాండవవన దహనాన సమయమున అర్జునిని రథం నీవు నడిపావట కదా. అర్జునినికి విజయం చేకూర్చావట కదా మరి ఆచాతుర్యం శౌర్యం నీలో తగ్గిపోయాయా. మరో మాట మాటాడక యుద్ధానికి సిద్ధంకా ” అన్నాడు ఉత్తరుడు. అయిష్టంగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు బృహన్నల.
తరువాత ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తెప్పించాడు. బృహన్నలకు ఇచ్చి తొడుక్కోమన్నాడు. దానిని తల క్రిందులుగా తొడిగి అందరినీ నవ్వించాడు బృహన్నల. ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. “బృహన్నలా త్వరగా రధమునకు హయములను పూన్చుము. ధ్వజమును ఎత్తుము. మనం త్వరగా పోయి గోవులను విడిపించ వలెను” అన్నాడు.
బృహన్నల “నీవు ఏమి చెప్పిన అది చేయ వలెను. నీవు రమ్మన్న రావలయును, పొమ్మన్న చోటికి పోవలెను. నా బలం తెలుసుకుని నా చేత పని చేయించుకుని విజయం సాధించు ” అన్నాడు. బృహన్నల రథం సిద్ధం చేసాడు. కేతనం ఎగురవేసాడు.
యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర “అన్నయ్యా! నీవు కౌరవ వీరులను గెలిచినపుడు వారి తల పాగా కుచ్చులను నాకు బొమ్మ పొత్తికలుగా తీసుకు రావా ” అన్నది.
బృహన్నల “ఉత్తరా! అదెంత పని రాకుమారుడు విజయంతో తిరిగి వస్తాడు. నీకు బొమ్మ పొత్తికలు తెస్తాడు ” అన్నాడు. బృహన్నల వివిధ రకముల ఆయుధములు రథంలో పెట్టించి రథం ఎక్కాడు. ఉత్తరుడు పశువుల కాపరులను అడిగి కౌరవులు పశువులను ఏ పక్కకు తోలుకు వెళ్ళారో తెలుసుకుని ఆ దిక్కుగా రథం పోనివ్వమని అన్నాడు. బ్రాహ్మణుల, పుణ్యాంగనల దీవెన లందుకుని ఉత్తరకు కుమారుడు ఊరి వెలుపలికి వచ్చాడు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment