Monday, July 29, 2024

 రామాయణమ్ 9
...
కుశిక వంశీయుడు,గాధి కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుక పరచండి! మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక మునిపుంగవుడు పలికిన పలుకులివి.
.
ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూచి భయముతో వణకిపోయి దశరధసముఖమునకు శీఘ్రమే చేరి మహర్షివిశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలిపినారు!.
.
అంతటి పరమపూజనీయుడయిన మహర్షి తన నగరుకు రావటాన్ని తన పుణ్యఫలంగా భావించి, దశరధుడు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, ఒక ఉచిత ఆసనం అలంకరింపచేసి అంజలిఘటించి నిలుచున్నాడు.

మహారాజు వినయ విదేయతలకు సంతసించిన మహర్షి దశరధుడిని కుశలప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు!.
.
మహర్షి ఎదుట నిలుచున్న దశరధుడు ఆయన రాకలోని ఆంతర్యమేమిటో తెలియనివాడై ,మహర్షిని ఏ పని మీద మీరు ఇచటికి వచ్చినారో సెలవిండు ,మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చెదను, నా వద్దనున్న సమస్తము మీ పాదాక్రాంతము చేస్తున్నాను మీ కేమికావాలో తీసుకొనుడు అని సవినయంగా ప్రార్ధించాడు.
.
అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు ! 
.
మహర్షికోరిక తెలుసుకొని ఒక్కసారిగా నవనాడులూ కృంగిపోయి ,జవసత్వాలుడిగినవానిలాగా నీరసించాడు దశరధుడు! .
.
ఆ కోరిక ఏమై ఉంటుంది? .
.
మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడు ,
కానీ ఆయన అడిగింది ! శ్రీరాముని తనతో పంపమని !
.
 క్రూర,ఘోర రాక్షసులైన మారీచ ,సుబాహులనుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దుబిడ్డడిని పంపాలట!
.
మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరధుడు!
.
మహర్షి కోరిక ఆయన హృదయాన్ని నిలువునా కత్తితో చీల్చినట్లయినది ,తన ముద్దులమూట,ముక్కుపచ్చలారని పసికూన ,నిండా పదహారు నిండనివాడు ,అరవిచ్చినతామరల వంటి కన్నులుగల తన గారాలపట్టిని ఈ మహర్షివెంట అడవులకు పంపడమా! మనసు ససేమిరా అంటున్నది!.
.
మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి !
దశరధా ! 
రాముని గురించి నీ కేమి తెలుసని అలా ఆలోచిస్తున్నావు!
.
అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్
వసిష్టోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః.
.
రాముడెవరో నాకు తెలియును,నీ కుల గురువైన వసిష్ఠునకు తెలియును, ఈ ముని సంఘాలకూ తెలియును! 
.
రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్ధ్యము లేదు! రాముని ఎదుట మారీచ,సుబాహులు ఏవిధముగనూ నిలువజాలరు!
.
న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథం చన!.
.
అని ఇంకా చెపుతున్నారు మహర్షి!..
..

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

No comments:

Post a Comment