Wednesday, July 24, 2024

వీరుడంటే వీడే* (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు9441032212

 *వీరుడంటే వీడే* (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు9441032212
*****************************
ఒక ఊరిలో ఒక పొట్టెగాడు వుండేటోడు. వానికి వాళ్ళ తాత ఎప్పుడూ రాజుల కథలు బాగా వివరించి వివరించి చెప్పేటోడు. దాంతో ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు అవే కలలు వచ్చేటివి. దానికి తోడు వానికి పడుకున్నప్పుడు లేచి అటూ యిటూ తిరిగే అలవాటు వుండేది. దాంతో వాళ్ళ అమ్మా నాన్నా భయపడి వాడు పండుకున్నప్పుడు లేచి బైటికి పోకుండా తలుపులకి గడియ పెట్టేటోళ్ళు.

ఒకసారి ఆ వూరి మీదకు పక్క దేశపు రాజు యుద్ధానికి వచ్చినాడు. వాళ్ళంతా వూరిబైట చుట్టుముట్టి ''మట్టసంగా  లొంగిపోతారా... లేక యుద్ధానికి రమ్మంటారా'' అని హెచ్చరిక పంపినారు.

రాజుకి ఏం చేయాలో తోచలేదు. పక్క రాజేమో చానా బలవంతుడు, చెడ్డోడు. యుద్ధం జరిగితే ఓడిపోవడం ఖాయం. దాంతో పాటు వూరినంతా నాశనం చేసిగానీ వదలడు. అలా అని లొంగిపోడానికి మనసు ఒప్పుకోలేదు. ఎలాగబ్బా ఈ ఆపద నుంచి బైటపడడం అని తెగ ఆలోచించసాగినాడు.

ఆ రోజు చీకటి పన్నాక ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు తాను ఆ వూరికి రాజయినట్టు, గుర్రమెక్కి యుద్ధానికి పోతున్నట్టు కల వచ్చింది. అదే సమయంలో పక్కనున్న అడవిలోంచి ఒక పెద్ద పులుల గుంపు ఆ వూరిలోనికి వచ్చింది. అన్ని పులులను ఒకేసారి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. దాంతో అందరూ వణికిపోయి ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోసాగినారు. ఆ తొందరలో ఈ పిల్లవాని అమ్మానాన్నా గూడా పారిపోతా పారిపోతా వీని తలుపుకు గడియ పెట్టడం మరిచి పోయినారు. దాంతో వాడు వానికి తెలియకుండా బైటకు వచ్చినాడు.

సరిగ్గా అదే సమయానికి ఆ పులుల గుంపు వీని ఇంటి ముందుకు వచ్చింది... వీడు నిదురలో వున్నాడు గదా... ఎదురుగా వున్నది గుర్రాలే అనుకున్నాడు. దాంతో అన్నింటికన్నా పెద్దగా వున్న ఒక పులిని చూసి ఎగిరి దాని మీద కూచుని ''ఏయ్‌.... ఛల్‌... పద'' అన్నాడు. దాంతో పులులన్నీ భయపడిపోయినాయి. ''ఇదేందిరా అందరూ మా గుంపుని చూసి భయంతో వణికిపోతా వుంటే... వీడు వంద పులులు ఎదురైనా ఒక్కడుగు గూడా వెనక్కు వేయకుండా... ఏకంగా మా నాయకుని మీదకే ఎక్కేసినాడు. వీడు చానా పెద్ద వీరుడున్నట్టున్నాడు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా వీడు ఎలా చెబితే అలా చేయడం మంచిది'' అనుకున్నాయి.

వాడు పెద్దపులి ఎక్కి ముందు పోతావుంటే వెనుకనే వంద పులులూ మట్టసంగా భయపడతా భయపడతా రాసాగినాయి. వాడు ఛల్‌... ఛల్‌... అని అదిలించుతా వూరి బైటకు వచ్చినాడు. అక్కడ పక్క వూరి సైనికులు గుడారాలు వేసుకోని తరువాత రోజు యుద్ధానికి కత్తులు నూరుకుంటా వున్నారు. వాళ్ళు వీడు వందపులులతో రావడం చూసినారు. అంతే... ''ఓరి నాయనోయ్‌... ఎవడురా వీడు. గుర్రాల మీద రావడం చూసినాం, ఏనుగుల మీద రావడం చూసినాం, ఒంటెల మీద రావడం చూసినాం.... గానీ ఇలా పులుల మీద ఎక్కి వచ్చినోని గురించి ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. కనలేదు. వీడెవడో మహావీరుడు వున్నట్టున్నాడు. వాటికి గనుక దొరికినామంటే ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసి నంజుకోని తింటాయి'' అనుకుంటా భయపడి కత్తులూ, బళ్ళాలూ ఎక్కడివక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోసాగినారు.

ఈ గొడవకి వానికి మెలకువ వచ్చింది. ఎక్కడున్నానబ్బా అని చుట్టూ చూసినాడు. ఇంకేముంది. పెద్దపులి మీదున్నాడు. భయంతో గుండెలు కొట్టుకున్నాయి. కాళ్ళూ చేతులు వణికినాయి. ''ఎలారా నాయనా వీటి నుంచి తప్పించుకోవడం'' అని అటూ యిటూ చూడసాగినాడు. అంతలో ఎదురుగా ఒక మామిడి పళ్ళ చెట్టు కొమ్మ ఒకటి బాగా కిందికి వంగి కనబడింది. అంతే... అది దగ్గరికి రాగానే లటుక్కున దాన్ని పట్టుకోని పైకి ఎక్కినాడు.

''వాడు ఎప్పుడెప్పుడు దిగుతాడా... ఎప్పుడెప్పుడు ఇక్కన్నించి పారిపోదామా'' అనుకుంటావున్న పులులు వాడు చెట్టుపైకి ఎక్కగానే ''వాడు మామిడి పళ్ళ కోసం పైకి ఎక్కినట్టున్నాడు. మళ్ళీ దిగి వచ్చినాడంటే మనలను వదలడు'' అనుకుంటా ఎక్కడివక్కడ చించుకోని అడవిలోనికి పారిపోయినాయి. వాడు అవి పోయిన కాసేపటికి 'హమ్మయ్య' అనుకుంటా తిరిగి వూరిలోనికి అడుగు పెట్టినాడు.

అక్కడ రాజు దండ చేతిలో పట్టుకోని కనబన్నాడు. వీడు రాగానే మెళ్ళో దండేసి ''నీలాంటి వీరున్ని ఇంతవరకూ మేమెప్పుడూ చూల్లేదు. నీవు ఈడ వున్నంతకాలం ఇంక మేమెవరికీ భయపడవలసిన అవసరమే రాదు'' అని బాగా మెచ్చుకోని మోయలేనంత బంగారం బహుమానంగా ఇచ్చి గౌరవించినాడు. వానికి ఆ పులుల దెబ్బతో అప్పటి నుంచీ నిదురలో నడిచే అలవాటు కూడా పోయింది.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే SHARE చేయండి. రచయిత పేరు తీసేయకండి. మార్చకండి.

No comments:

Post a Comment