Wednesday, July 24, 2024

వేదాంత సారము!!!

 *వేదాంత సారము!!!*
             

*కురుక్షేత్ర సంగ్రామం హోరాహోరీగా సాగుతున్నది. కౌరవ, పాండవ సేనలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధం ఎలా సాగుతుందో.. చూసేందుకు అటుగా వచ్చాడు వేదవ్యాసుడు. అన్ని పక్కలా చూస్తూ ముందుకు సాగుతున్నాడు.*

*అలా వెళ్తుండగా మార్గంలో ఓ చిన్న పురుగు కనిపించింది. ప్రాణ భయంతో వణికిపోతున్నది. దారి దాటేందుకు ప్రయత్నిస్తున్నది. వ్యాసుడు ఆ పురుగుతో.. ‘ఎందుకు అంతలా కంగారు పడుతున్నావ్‌?’ అన్నాడు.*
 
*‘నాలుగైదు క్షణాల్లో ఇటుగా ఓ రథం రానుంది. అది వచ్చేలోగా ఈ దారి దాటేయాలి. లేకపోతే రథ చక్రాల కిందపడి చచ్చిపోవాల్సి వస్తుంది’ అనుకుంటూ బిరబిర దారి దాటే ప్రయత్నం చేసింది.*

*ఈ చిన్నికథలో.. వేదాంత సారమంతా ఇమిడి ఉన్నది.* 

*పుట్టడం, గిట్టడం ఈ రెండే ఆ పురుగుకు తెలుసు. అందుకే బతికినంత కాలం చావకుండా ఉండేందుకు అది పోరాడటంలో న్యాయం ఉంది.*

*కానీ, మానవ జన్మకూడా ఇలా పుట్టుక, చావుల మధ్య కొట్టుమిట్టాడాల్సిందేనా? అరుదైన సందర్భాలు మినహాయిస్తే ఈ చరాచర సృష్టిలో ఒక్క మనిషికే మళ్లీ పుట్టకుండా మోక్షాన్ని పట్టుకోగల సామర్థ్యం ఉంది.* 

*అందుకే శంకర భగవత్పాదులు ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అన్నారు.*

*మనిషై పుట్టినవాడు తప్పక పొందాల్సినవి ధర్మార్థకామమోక్షాదులనే పురుషార్థాలు.*

*‘తద్యథేహకర్మజితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యజితో లోకః క్షీయతే’ అంటుంది ఛాందోగ్యశ్రుతి.*

*అంటే ధర్మార్థకామాలు కూడా అశాశ్వతాలే! శాశ్వతమైన పురుషార్థాలు కావు. లౌకికమైన సంపదలు, భోగములు నాశనం పొందేవే. పుణ్యం ద్వారా సంపాదించుకున్న స్వర్గాదులు కూడా పుణ్య పరిసమాప్తి తర్వాత దూరం అవుతాయి. మళ్లీ జనన మరణాదులు సంభవిస్తాయి!*

*‘న స పునరావర్తతే’ ఈ జరామరణ చక్రంలో పడకుండా అనుగ్రహించే ఏకైక మార్గం మోక్షం. అదే శాశ్వతమైన పురుషార్థం.* 

*మానవజన్మ ఎత్తినందుకు మోక్షప్రాప్తికి సాధన చేయాలి. అందుకు సోపానాలు ఉపనిషత్తులు. అందులోని సారాన్ని గ్రహించగలిగితే, అనుభవంలోకి తెచ్చుకోగలిగితే.. శాశ్వత పురుషార్థమైన మోక్షం సంప్రాప్తిస్తుంది.* 

*ఇంతకీ ఉపనిషత్తు అంటే ఎమిటి? వేదంలో ప్రధానమైనది ఉపనిషత్తు. వేదం పూర్వభాగం యజ్ఞయాగాది రూపమైన కర్మ ప్రతిపాదకమైనందున అది కర్మకాండం. ఉత్తర భాగం ‘అహం బ్రహ్మాస్మి’ అనే ఆత్మసాక్షాత్కార రూపమైన మోక్షాన్ని, అందుకు సాధనా భూతమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. అందుకే దీనిని జ్ఞానకాండం అన్నారు. వేదంలో చివరి భాగం కావడంతో వేదాంతం అని పిలుస్తారు. వేదాలకు శిరస్సు వంటివి (ప్రధానమైనవి) కావడం వల్ల కూడా వీటికి వేదాంతాలని పేరు.*

*వేదాల పరమ తాత్పర్యం, సిద్ధాంతం కూడా పరబ్రహ్మమే! జ్ఞానరూపమైన ఉత్తరభాగాన్ని వేదాంతం అని చెబుతారు. ఆ భాగాన్ని ఉపనిషత్తులని కూడా పిలుస్తారు.* 

*ఉపనిషత్తు బ్రహ్మ సాక్షాత్కార సాధనా భూతమైన దర్శన శాస్త్రం. అదే వేదాంత శాస్త్రం.* 

*ఉపనిషత్తుల సారం సంసారం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంటే, సన్యాసులను చేస్తుందని కాదు, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది. సంసారానికి మూలభూతమైన నేను, నాది అనే అవిద్యను నాశనం చేస్తుంది. తద్వారా ‘అహం బ్రహ్మాస్మి’ అన్న స్పృహను కలిగిస్తుంది.*

*’ఉపనిషత్తులు ఎన్ని?’ అని చాలామంది సందేహం. ‘అనంతావై వేదాః’ అంటే వేదాలు అనంతాలు అని. వేదాల్లో భాగమైన ఉపనిషత్తుల సంఖ్య కూడా ఇంత అని చెప్పడానికి వీల్లేదు. కొందరు 220 ఉపనిషత్తులు ఉన్నాయంటారు. అంతకుమించి ఉన్నాయనీ చెబుతారు. ముక్తికోపనిషత్తు నుంచి 108 ఉప ఉపనిషత్తులు ఉన్నాయని తెలుస్తున్నది.*

*అంతేకాకుండా ఈ ఉపనిషత్తులను శైవ, శాక్త, వైష్ణవ, యోగ మొదలైన భేదాల కారణంగా అనేక రకాలుగా చెబుతారు. సంఖ్య విషయంలో ఎన్ని విభేదాలున్నా.. అన్ని ఉపనిషత్తుల్లోనూ సచ్చిదానంద స్వరూపమైన అద్వితీయ ఆత్మతత్వమే కనిపిస్తుంది.* 

*ఈశావాస్య, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక.. ఈ ఉపనిషత్తులు ప్రధానమైనవని చెబుతారు.* 

*ఈ దశ ఉపనిషత్తుల శ్రవణం, పఠనం, స్మరణం జన్మకో అదృష్టం.*

No comments:

Post a Comment