*(జూలై 23 - 2024) -- చక్కెర పొంగలి -*
*శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన వంటకం చక్కెర పొంగలి. అన్ని ప్రధాన శ్రీ వైష్ణవ ఆలయాలలో.. ముఖ్యంగా ప్రధాన పర్వదినాలైన ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసం రోజుల్లో, మకర సంక్రాంతి, రథసప్తమి, శ్రావణ శుక్రవారాలు, దసరా నవరాత్రులు లలో ఒక ప్రసాదంగా చక్కెర పొంగలి చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.* అలాగే అమ్మవారికి కూడా ఈ చక్కెర పొంగలి ప్రీతికరమే. దసరా నవరాత్రులలో ఒకరోజు చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చక్కెర పొంగలి ఆంధ్రా వంటకమని చెప్పాలి. శ్రీ వైష్ణవుల ఇళ్ళల్లో పైన పేర్కొన్న పర్వదినాల్లో ఈ తీపి వంటకం విధిగా ఉంటుంది. చక్కెర పొంగలి కి కావలసినవి.. బియ్యం, పెసరపప్పు, పంచదార (లేదా బెల్లం), కొద్దిగా పాలు, ఏలకులు, జీడిపప్పు, కిస్మిస్, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు. ఇవన్నీ వేసి చేసిన చక్కెర పొంగలి మహా రుచికరమైన తీపి వంటకం. చక్కెర పొంగలి, పులిహోర, దద్ధోజనం.. ఈ మూడూ ఉంటే పూర్తి భోజనమే. తయారీ చేస్తుంటేనే మంచి ఘుమఘుమలాడే వాసన వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు తింటే చక్కెర పొంగలి రుచి అమోఘం అని చెప్పాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్నతనంలో చక్కెర పొంగలి చేసే పొంగలి పండుగ కోసం ఎదురుచూసే వాళ్ళం. డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం వలన ఇప్పుడు ఎక్కువగా పంచదార బదులు బెల్లం తో ఈ తీపి పొంగలి చేస్తున్నారు. ఐతే పంచదార తో చేస్తేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. కులగోత్రాలు సినిమా పేకాట పాటలో.. ఎంతో పుణ్యం దక్కేది.. చక్కెర పొంగలి చిక్కేది.. వంటి పద సాహిత్యం ఉంది. అతిథులు భోజనానికి వచ్చినప్పుడు స్వీట్ గా ఈ చక్కెర పొంగలి చేయడం మా ఇళ్ళల్లో అలవాటు. చక్కెర పొంగలి తయారిలో (నా) మేడం విజయ (గారి) హస్తలాఘవం అపూర్వం. నాకు చాలా ఇష్టమని నా ప్రతీ పుట్టినరోజు నాడు ఈ చక్కెర పొంగలి తో treat ఇచ్చి eat చేయిస్తుంది తన ప్రేమను కూడా రంగరించి. చక్కెర పొంగలి గురించి ఇలా రాస్తుంటే ఈరోజే తినాలనిపించేస్తోంది.. ఎలాగూ (మా) పెళ్లిరోజు దగ్గర్లోనే ఉంది కదా.. ఆరోజు చేసుకుందామంది నా శ్రీమతి. చక్కెర పొంగలి గురించి చిన్న వ్యాఖ్య లేదా పద్యం ఎవరైనా రాయగలిగి పంపితే చక్కెర పొంగలి తిన్నంత సంతృప్తి నాకు కలుగుతుంది. తియ్యటి (కాఫీ) కబుర్లు ఇంతటితో ముగిద్దాం.. హేవె స్వీట్ డే.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852..
No comments:
Post a Comment