*అమృతం గమయ*
*తత్వమసి - భగవద్దర్శనం*
నీ దేహమే సమస్త విశ్వానికి సంకేత రూపం. అట్టి దేహమందున్న ఆత్మయే విశ్వ చైతన్య దైవం. దేహ బుద్ధులకు బద్ధుడై పరిమితమైనవాడు జీవుడు కాగా చైతన్యమూలం గా ఉండి సర్వవ్యాప్తమైన వాడు పరమాత్ముడు. చైతన్య మూలంలోనికి ప్రవేశించినప్పుడు దేహమే దేవాలయానుభవ దర్శనం కలుగుతుంది.
భగవంతున్ని చిత్రాలలో అన్వేషించకండి చిత్తములో అన్వేషించండి అని రమణమహర్షి బోధ. అంటే భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడు. కానీ దేహ భ్రాంతుల నీకు కానరావడం లేదు కావున అన్వేషించవలసిన అవసరము.
ఎందువలన కాన రావడం లేదు అని విచారణ చేస్తే మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన అని తెలుస్తుంది. మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు మనోవికారాలు. *నేను అనే భ్రాంతిని కలుగచేసే ఆహంకారం. నాది అనే భ్రాంతిని కలుగ చేసే మమకారం.* ఈ రెండు మాలిన్యాలు తొలగించబడితే జీవుడనబడే నీవు భగవంతుడివి అవుతావు.
మన హృదయములో స్థిరమై ఉన్న పరమాత్ముడు పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని దర్శించాలంటే నీవు పవిత్రం కావాలి. ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు నీవు చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చక స్వామి మొదట చేసే పని - ముందు రోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం.
ఈ విధంగానే హృదయమునందున్న భగవంతుడిని దర్శించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానము, అవిద్యలను నిర్మాల్యములను తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. కర్తృత్వ భావనను తొలగించుకోవాలి. మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యములను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను తొలగించాలి.
సత్కర్మాచరణ, సజ్జన సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములనబడే సాధనతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు.
శుద్ధ ఆహారమంటే కేవలం శరీర పోషణకై నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, మానసిక క్రమశిక్షణకై మనోనికాస స్థిరత్వానికై పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.
మనస్సును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.
నీ సద్గతికైనా, నీ దుర్గతికైనా కారణం నీ మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసి కూడా దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.
నీవు సత్య నిత్య ఆనందం అనుభవించాలంటే ప్రేమ, జ్ఞానం పెంపొందించుకో. నీవు భగవంతుడివే అవుతావు. *తత్వమసి.*
*సత్ చిత్*
No comments:
Post a Comment