*‘ఆత్మజ్ఞానం’*
మాయా ప్రభావంతో జీవులు ఈ మనోబుధ్యాహంకార వికారాలలో తాదాత్మ్యము చెంది ఈ సంసారమున బందీలగుచున్నారు. కానీ జ్ఞానులు వాటిని తమనుండి వేఱుగా పరిగణించి శాశ్వతచైతన్యవంతమగు ఆత్మయందే దృష్టిపెట్టి సంసారబంధము నుండి విముక్తి పొందుతున్నారు.
ఈ విషయాన్నే ఆదిశంకరులు, తన "నిర్వాణ షట్కము", మొదటి శ్లోకంలోనే తెలియజేసేరు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాదు. అలాగే పంచభూతాత్మకమగు, పంచ కర్మేంద్రియాలకు, పంచ జ్ఞానేంద్రియాలకు విధేయుడను కాను. చిదానందరూపుడైన శివుడను నేను! శివుడను తప్ప వేరెవ్వరినీ కాను!
అందుకే శ్రీ రమణులు, "నేను ఎవరు?" అని జీవుడు నిత్యము తనను తాను ప్రశ్నించుకుంటూ, ఇంకో ఆలోచనలేక సాధనచేస్తూ వుంటే, తాను "ఆత్మస్వరూపుణ్ణి" అన్న సత్యం బోధబడుతుందని, తాను అనుభవించి మనకు తెలియజేసేరు.
జ్ఞానులు మనస్సుతో గాక మనస్సాక్షితో తాదాత్మ్యము చెందుతారు. అంటే ఈ జడమైన ప్రకృతికి ఆధారభూతుడై, అదే ప్రకృతియందు సర్వత్రావ్యాపించియున్న ఆత్మస్వరూపాన్ని దర్శిస్తారు జ్ఞానులు. ఆ ఆత్మస్వరూపమే "పరమాత్మ".
శాశ్వతమైనదాన్ని, ఆత్మస్వరూపంగా వెలుగొందుదానిని, చైతన్యవంతమైనదానిని, అన్నింటానెలకొని ప్రకాశించుదానిని, పరమానందాన్ని కలుగజేసేదానిని, పరమాత్మగా పిలవబడేదానిని గ్రహించడానికి, వర్ణించడానికి ఎంతోమంది మహనీయులు ఎన్నోసాధనలు చేసేరు. తుదకు దానిని వర్ణించడం అసాధ్యమని, అనుభూతి ద్వారా మాత్రమే ఆ పరమసత్యాన్ని గ్రహించగలమని తేల్చిచెప్పేసారు.
ఈ అనుభూతిని పొందడానికి వేషభాషలు, ఆడంబరత, పాండిత్యము, విశేష శాస్త్రపరిజ్ఞానం అవసరంలేదు! భగవంతుడు సహజంగా అందరి మానవులకు ప్రసాదించిన జ్ఞానం సరిపోతుంది! తమకున్న పరిమిత జ్ఞానంతో పశుపక్ష్యాదులు కూడా పరమాత్మ వైభవాన్ని గ్రహించగలవు!
నశించే స్వభావము కలిగిన ఉపాధులు(పదార్ధములు) అధిభూతము. దీనినే అపరప్రకృతి అని అంటారు. పరప్రకృతి అయిన పురుషుడే అధిదైవము. సకల దేహములందు అంతర్యామిగా ఉండే పరమాత్మే అధియజ్ఞము. అన్ని యజ్ఞములందు ఆరాధింప బడేది ఇదే.
సర్వము నెఱింగినవాడు, సనాతనుడు, అన్నింటిని శాసించువాడు, అతి సూక్ష్మమైనవాడు, కోటి సూర్యుల కాంతి కలవాడు, విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప శక్యంకాని రూపమును కలవాడు, అజ్ఞానానికి అతీతుడైనవాడే పరమాత్మ.
దానిని గ్రహించాలంటే ప్రతినిమిషం ఆత్మనిష్ఠలో వుండాలి. అన్నింటా, అన్ని ఉపాధులందు పరమాత్మను దర్శించాలి. పరమాత్మయందే విశ్వమంతా వున్నది. విశ్వమంతా పరమాత్మ వ్యాపించియున్నాడు. ఆత్మజ్ఞానముతో అతనిని పొందవచ్చును.
No comments:
Post a Comment