Friday, July 26, 2024

****కోరికలను ఎలా జయించాలి?” - మహాసన్నిధానంవారి మహనీయమైన ఉపదేశము

 కోరికలను ఎలా జయించాలి?” - మహాసన్నిధానంవారి మహనీయమైన ఉపదేశము
మాధవీయ శంకర విజయంలోని అయిదవ సర్గలో శ్రీ శంకరభగవత్పాదులవారి బాల్యం వంద శ్లోకాలలో వర్ణించబడింది. వారి రూపం ఎలా ఉన్నదో, వారి ప్రవర్తన ఎలా ఉండేదో, వారు ఎంతటి నిజాయితీపరులో మనం మాధవీయ శంకర విజయం నుండి గ్రహించవచ్చును. అందులో వారు అరిషడ్వర్గాలైన కామక్రోధమోహ లోభ మద మాత్సర్యాలను జయించారని చెప్పబడింది. ఎలా జయించిందీ కూడ చెప్పబడింది. మనకు కూడ వాటిని జయించాలని ఉంటుంది. కాని మార్గమే తెలియదు. ఆ మార్గాన్ని బోధిస్తే, కొందరైనా ప్రయత్నించి కామక్రోధాదుల నుండి ముక్తిని పొందవచ్చు. కొంతమంది ఉపన్యాసాలు విన్నా, తమ మామూలు దారినే పోతుంటారు. మనం ఆ వర్గంలో చేరకూడదు.
కోరికను జయించటమెలా? భౌతికమైన వస్తువుల పట్ల నిర్లక్ష్యాన్ని పెంచు కోవాలి. ''భౌతికమైన వస్తువులు ఆనందదాయకం కానప్పుడు అవి మనకెందుకు ? వాటి వలన ప్రయోజనం లేదు'' అనెడి ఆలోచనను పెంచుకోవాలి. ఒక వస్తువు ఆకర్షణీయంగా అందంగా ఉన్నదనుకున్నప్పుడే మనం దానిని కోరుకుంటాం. మనం చూసిన వస్తువుల గురించి మన కళ్ళే మనకు తెలియ చెప్పుతాయి. చక్షురింద్రియ స్వభావమది. మనం చాలా వస్తువులను చూస్తున్నా, అన్నిటినీ మనం కోరుకొనం. ఆనందాన్ని, సంతోషాన్ని అందించగలవని అనుకున్న వాటినే మనం కోరుకుంటాం. ఒక వేళ అన్ని వస్తువులు పనికి రానివే అని ఎవ్వరైనా భావిస్తే, అతను కోరుకోవటానికి యింకేమి ఉంటుంది ? అందువలన కామాన్ని జయించాలంటే, భౌతికమైన వస్తువులు ఆకర్షణీయమూ, ఆనందదాయికమూ కావనే ఆలోచనను పెంచుకోవాలి.
అసారమేవ సంసారం దృష్ట్వా సారదిదృక్షయా |
ప్రవ్రజన్త్యకృతోద్వాహాః పరం వైరాగ్యమాశ్రితాః ||
శంకరులు సన్యాసాన్ని ఎందుకు స్వీకరించారు ? “అసారమేవ సంసారం దృష్ట్వా” ఇదీ కారణం .
ఏ వస్తువునైనా అనుభవిస్తే ఈ ప్రపంచంలో మనకు ఏమి దక్కుతుంది. అన్ని వస్తువులు అందంగా కనపడ్తాయి కాని, వాటి స్వభావాన్ని విశ్లేషించి చూస్తే వానిలో సారమేమీ కనపడదు.
అంతే కాదు. వానిని మనం సంపాదించేదాకానే వాటి అందం, ఆ తరువాత వానిలో ఎటువంటి ఆకర్షణ ఉండదు. నిర్లక్ష్యం కనుక నిరంతరం ఉంటే ఏ వస్తువునూ పొందటానికి ప్రయత్నం చేయవలసిన పని ఉండదు. కోరికలను జయించటానికి ఇటువంటి మనః స్థితి అవసరం.

No comments:

Post a Comment