Friday, July 26, 2024

పరిస్థితుల ప్రభావము వలన ఎంతటి వారైనా తమ సహజగుణాన్ని కోల్పోయి తమలోని రాక్షసగుణాన్ని ఆశ్రయించి స్వంతవారికి కూడ కీడు తలపెడతారని రామాయణము మనకి తెలియచేస్తున్నది.

 శ్రీమద్రామాయణము.

(239-వ  ఎపిసోడ్),

"" వాతలెన్ని పెట్టినా నక్క యది చిరుత కాదు,
కూతలెన్ని కూసినా కాకియది కోకిల కాదు,
సహజత్వంబు లోపించిన మనుగడలేలనయ్య మనకి,
సత్యగుణశీల శాంతస్వభావ ఓ శ్రీహరీ""

నక్క తనకితానుగ మేనుపై ఎన్ని వాతలు పెట్టుకున్నా అయ్యది చిరుతపులి కానేరదు,అట్లే కాకి ఎంతగట్టిగా కూసినా అయ్యది కోకిల గానము కాదు. కారణము వీటిలో నాటకీయత తప్ప సహజత్వము గోచరించుట అసాధ్యము."

రామాయణము అయోధ్యాకాండములో కుబ్జ యైన మంథర మాటలకు కైకేయి కోపగించుకొని రాముని పట్ల తనకుగల అనన్యమైన ప్రేమ భావాన్ని వ్యక్తపరుస్తుంది.
రామపట్టాభిషేకవార్తను విని నీవేల ఇంతగా పరితపిస్తున్నావని నిలదీస్తూ,

""ధర్మజ్ఞో గురుభిర్థాంతః కృతజ్ఞః సత్యవాక్ శుచిః,
రామో రాజ్ఞః సుతో జ్యేష్టో యౌవరాజ్యమ్ అతో~ర్హతి""
(అరణ్య.కాం.08-14),,

శ్రీ రాముడు శ్రేష్టులైన గురువులకడ చక్కగా శిక్షణ పొందినవాడు.పైగా ధర్నజ్ఞుడు.అంతేగాక ఇతరులొనరించిన స్వల్పమైన ఉపకారమును సైతము జన్మలో మరవనివాడు.పవిత్రుడు.పైగా మహారాజుగారికి పెద్దకుమారుడు.కనుకనే రాముడు యువరాజపదవికి అన్ని విధముల అర్హుడు.

"" యథా మే భరతో మాన్యః తథా భూయో~పి రాఘవః,
కౌసల్యాతో~తిరిక్తం చ సో ~ నుశుశ్రూషతే హి మామ్,"""

రాజ్యం యది హి రామస్య భరతస్యాపి తత్తథా,
మన్యతే హి యథాత్మానం తథా భ్రాత్రూంస్తు రాఘవః,||,(08-18, 19),,

నాకు రాముడు భరతునివలే కాదు కాదు అంతకంటే ఎక్కువ అత్యంత ప్రీతిపాత్రుడు.
రాముడు తన తల్లియైన కౌసల్య కంటెను నన్నే అధికముగ సేవించుచుండును.అతడు తన తమ్ములందరిని తనతో సమానముగ చూచుకొనుచుండును.వారి సోదర ప్రేమఅపూర్వమైనది.యువరాజపట్టాభిషేకము రామునికి జరుగు చున్ననూ భరతునికి జరుగుచున్నట్లే యని నా భావన
 యని కైకేయి తన మాటలలో రామునియెడల గల అభిమానమును వెల్లడి చేస్తుంది.

కానీ జనకుని తరఫున అరణపు దాసిగ వచ్చిన మంథర తన మాటల నైపుణ్యముతో కైకేయి మనస్సును విషతుల్యము చేస్తుంది.

"'" భవితా రాఘవో రాజా రాఘవస్యాను యః సుతః,
రాజవంశాత్తు కైకేయి భరతః పరుహాస్యతే||,(08-22),

ఓయమ్మా కైకేయీ! రాముడు యువరాజుకాబోతున్న వాడు.రేపు రాజగును.రాముడు రాజైన అతని కుమారులలో జ్యేష్టుడు రాజగును.ఈ కారణమున నీ భరతునికిగానీ అతని సంతతికి గాని రాజ్యాధికారము కల్ల అటువంటి  అవకాశమే శూన్యము.

""" దర్పాన్నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయా,
రామమాతా సపత్నీ తే కథం వైరం న యాతయేత్||,(08-37),

నీవు ఇంతవరకు పతియైన దశరథునికి మిక్కిలి ప్రేమపాత్రురాలవని గర్వముచే ఇదివరలో రామమాతను అనేక సార్లు తృణీకరించి యుంటివి.రాజమాత కాగానే కౌసల్యమాత ఆ పగను తప్పక నీపై తీర్చుకొనును. మౌఢ్యమున మంథర మాటలువిని కైకేయి మనసు గాయపర్చుకొని (దేవతల వర ప్రభావము వల్ల) రాముని పట్ల ద్వేషాన్ని పెంచుకొని దశరథుని వంచించి సీతారామలక్ష్మణులను కాననములకు పంపుటకు నిర్ణయించుకొని,

"" అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః,
అనైనావాభిషేకేణ భరతో మే~భిషిచ్యతామ్||,(11-25)

ఓ దశరథమహారాజా! వినుము.రామపట్టాభిషేకమునకు ఏర్పరిచిన సామాగ్రితో నా భరతునికి యువరాజ పట్టాభిషేకము జరుగవలెను.ఇది నా మొదటి వరము. రాముడు నారచీరలు ధరించి జటాధారియై తాపసవృత్తిలో పదునాల్గు వత్సరములు వనవాసము చేయవలెనని కోరి రాముని పట్ల తన మాటలు కాకిగా కూసిన కోయిల  గీతాలని చెప్పకనే తెలియచేస్తుంది. .పైగా ఇది నా రెండవ వరమని కోరగా రాజు దుఃఖితుడై,

""" న ప్రభాతంత్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే |,
క్రియతం మే దయా భద్రే మయా~యం రచితోంజలిః||,(13-18),

చుక్కలతో మంగళకరముగ యున్న  ఓ రాత్రీ! నీకు వినమ్రముగ నమస్కరించుచున్నాను.నన్ను కనికరించి త్వరగా తెల్లవారనీయకుము.ఈ కైకేయిది  రాతిగుండె.దయలేనిది.క్రూరాత్మురాలు.నాకు అంతులేని ఆపద తెచ్చిపెట్టినదని మేకవన్నె పులియని నే నెరుంగలేక పోయానని వాపోతాడు.

పరిస్థితుల ప్రభావము వలన ఎంతటి వారైనా తమ సహజగుణాన్ని కోల్పోయి తమలోని రాక్షసగుణాన్ని ఆశ్రయించి స్వంతవారికి కూడ కీడు తలపెడతారని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment