Saturday, July 13, 2024

**** *గెట్ టు గెదర్* 🤝 🌷🤝 _*పూర్వ విద్యార్థుల*_ _*ఆత్మీయ సమ్మేళనం*

 🤝 *గెట్ టు గెదర్* 🤝

🌷🤝
 _*పూర్వ విద్యార్థుల*_
_*ఆత్మీయ సమ్మేళనం*_
                        🤝🌷

విచ్చేశారు అందరూ
బానపొట్టలూ అరగుండ్లతో
పురుష పుంగవులు.!

బారెడు జడలు
మూరెడు కాగా
సోడాబుడ్డీ కళ్ళద్దాలతో
మహిళా మణులు .!!

వాడు వీడేనా
వీడు వాడేనా.?
ఆమె ఈమేనా
ఈమె ఆమేనా ?
గుర్తింపుల గుబాళింపు.!!

పలకరింపులూ
షేక్ హాండ్ లూ
కౌగిలింతలూ
పరామర్శ లూ 

తాతలుగామారిన
అలనాటి అబ్బాయిలు
అమ్మమ్మలూ నానమ్మలుగా
మారిన అమ్మాయిలు

మరోవైపు

కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు
కవర్ చేస్తూ 
చెంగు చెంగున అలనాటి
గెంతులస్ధానంలో
జాగ్రత్తగా అడుగు లేస్తూ
చేరారంతా ఒకచోటికి

అలనాటి అల్లరులూ
కొట్లాటలు
ఆటలు పాటలు
సరదా సన్నివేశాలు
క్లాస్ రూమ్ లన్నీ
కలయ తిరుగుతూ 
నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ

తమ కలల రాణి కోసం
గుంపులో వెతుకులాడుతూ
దొంగ చూపులు చూస్తూ
గుర్తించలేని మార్పు
కోల్పోయిన వ్యధ

ఎన్నెన్నో జ్ఞాపకాలలో
మరెన్నో మార్పుల వాస్తవాలు.!

బ్రతుకు పండించుకున్న 
వారు కొందరైతే
పోగొట్టుకున్న వారు కొందరు.!
అందరి మోములోనూ
చెరగని చిరునవ్వు 

నాటిమేటి విద్యార్ధి
ఏదో సాధిస్తాడను కున్నవాడు
బడుగు జీవిలా
సంసార సాగరాన్ని
ఈదుతూ అలసి పోగా
ఎందుకూ పనికిరాడను కున్నవాడు
గొప్పవాడై కనుల ముందు .!!

అరేయ్ ఒరేయ్
మావ బావ నాటి పిలుపుల
ఆప్యాయతల స్థానాల్లో
సార్, గారు మర్యాదల మార్పులు.!!

కాలగర్భంలో జారిపోయి
కరిగిపోయిన కొందరు
నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు.!

ఏదైతేనేం
సుఖదుఃఖాల కలబోత
జ్ఞాపకాల దొంతరల వెదుకులాట.!

చేరుకున్నావా? జాగ్రత్త.
చరవాణి హెచ్చరికల మోత.!
తెలియకుండానే కరిగి పోయిన కాలం.!!

బాధాతప్త హృదయాలతో
అడ్డుపడే కన్నీటి పొరల
మసకచూపుల తడిలో
వీడ్కోలు తీసుకునే సమయం.!!
మరలా కలిసే మరో రోజుకు
అందరూ కలవాలనే ఆశతో.!

కాలగమనంలో ఎందరో .!!
చదువులు ముగించి
వెళ్ళేవారికి వీడ్కోలు
వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ!!
ఏమార్పులేని పాఠశాల
చిద్విలాసంగా నవ్వుకుంటూ
 వెళ్ళి రండని  ఆప్యాయంగా
ఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం
ఎదురుచూస్తూ..!!

✍️
(ఓ ఆజ్ఞత కవి రాత ఇది.
 కానీ, ప్రతి వ్యక్తి వ్యధే ఇది.)

No comments:

Post a Comment