Wednesday, July 24, 2024

అందుకనే రామాయణము జరిగిదానికి చింతించి ఉపయోగము లేదని జరగవలసిన దానిని ముందుగనే జాగ్రత్తగ యోచించి ఆయా కార్యాలని చేయమని ఏ కార్యాన్నైనా వెనుక ముందులు ఆలోచించి ఆచరించమని మనలను హెచ్చరిస్తున్నది.

 శ్రీమద్రామాయణము.

(237 వ ఎపిసోడ్),

""కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన""

ఎవ్వరు కూడ ఏ పరిస్థితులలో తొందరపడి ఏ పని చేయరాదు.ఒకవేళ కొన్ని సమయాలలో కొన్ని అత్యవసర పనులు చేయవలసి వచ్చినప్పుడు అవి నిర్వహించిన తర్వాత వాటి గురించి పునరాలోచన చేసి వగచుట నిరర్ధకము.పని ముగిసిన తర్వాత ఆ పని జరిగిన వేళ  ముహూర్తము గురించి విచారణ చేయుటయు  వ్యర్ధము.

రామాయణము సుందరకాండములో హనుమంతులవారు రావణాసురుని అనుయాయులు  తన తోకకి నిప్పు పెట్టడము వల్ల ఆ అగ్నితో లంకానగరాన్ని దహనము చేసిన తర్వాత తాను చేసిన పని వల్ల సీతామాత కూడ ఆ  అగ్ని   వల్ల  ప్రమాదము  ఏర్పడి‌ఉంటుందని భావించి చాలా దుఃఖపడతారు.ఆవేశములో తాను చేసిన అనుచిత  కార్యానికి చింతిస్తాడు.ఆవేశము అనే రాజసభావము ఎంత చెడ్డదో అని అనుకుంటు

"" ధిగస్తు రాజసం భావమ్ అనీశమనవస్థితమ్|,,
ఈశ్వరేణాపి యద్రాగాత్ మయా సీతా న రక్షితా||,,(55-17),,

ఛీ!ఛీ! రాజస గుణము ఎంత నికృష్టమైనది.దానిని అదుపు చేయటము అతి కష్టమైన విషయము. ఈ రాజస గుణము  చాలా చంచలమైనది.
తాను ఎంతో కష్టపడి సముద్రాన్ని లంఘించి సీతమ్మజాడ కనుగొని విజయాన్ని సాధించాననే గర్వముతో ఈ రాజసభావము ఏర్పడటము వల్ల  ఆ రజోగుణాన్ని అదుపుచేసుకోలేక అమితమైన కోపము వల్ల జానకీమాతను  రక్షించుకొనలేకపోయానని చింతింస్తాడు.

తర్వాత జరిగిదానికి వగచి ఉపయోగము ఏమున్నది.జరిగినపనికి ఏ ముహూర్తములో ఇది జరిగినదని  వగచి అలా జరిగియుండకూడదని యోచించుటము వల్ల  లాభము లేదని తలచి అగ్నిలోని దాహక శక్తి భగవత్సరూపమని యోచన చేసి  రాముడు సాక్షాత్తు భగవంతుడే కనుక అటువంటి రామపత్నిని అగ్ని నిశ్చయముగ దహించదని తనకి తాను ధైర్యము చెప్పుకుంటాడు.

అందుకనే రామాయణము జరిగిదానికి చింతించి ఉపయోగము లేదని  జరగవలసిన దానిని ముందుగనే జాగ్రత్తగ యోచించి ఆయా కార్యాలని  చేయమని  ఏ కార్యాన్నైనా వెనుక ముందులు  ఆలోచించి  ఆచరించమని మనలను హెచ్చరిస్తున్నది.

జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment