Tuesday, July 23, 2024

 రామాయణానుభవం....380

మహాహస్త బలుడైన ప్రహస్తుడు మరణించాడన్న వార్తను రావణాసురుడు జీర్ణించుకోలేక పోయాడు. ప్రహస్తుడు రామలక్ష్మణులను, వానర సేనను తప్పక చంపి. విజయంతో తిరిగి వస్తాడని విశ్వాసంతో ఉన్నాడు.

ప్రహస్తుడు కూడ మరణించాడంటే సైన్యంలో అధిక భాగము నశించినట్లే. ఇక
తాను తన బంధువులు సైనికులు మాత్రమే మిగిలారు.

తన మహాసేనాని మరణము రావణునికి దుఃఖాగ్రహాలను కలిగించింది. ఇక స్వయంగా తానే రణరంగానికి పోక తప్పదు. తన ప్రతాపాగ్నితో వానర సేనా సముద్రాన్ని ఎండింపక తప్పదు.

అందువలన అగ్ని వంటి ప్రకాశము కల్గి, అనేకోత్తమహయాలతో కట్టబడి, రత్న
ఖచితమైన దివ్య రధాన్ని ఎక్కాడు. 

రుద్రుని వెంట ప్రమధ గణాలవలె, రావణుని వెంట
భయంకరమైన రాక్షసగణము బయలు దేరింది. వంది మాగధుల జయజయ ధ్వానాల
మధ్య రావణరధము యుద్ధ రంగానికి బయలుదేరింది.

శ్రీరామచంద్రుడు "ఇంత ఆర్భాటముతో వస్తున్న సేన ఎవ్వరిదని" విభీషణుని ప్రశ్నించాడు.

విభీషణుడు రావణసేనలోని ముఖ్యులు గురించి తెలుపసాగాడు. 

"రామభద్రా !
వచ్చేసేనలో ముందు భాగములో చీకటి కొండ వంటి ఏనుగును అధిరోహించి, మహాధుజ బలముతో వస్తున్నవాడు రావణపుత్రుడైన "అకంపనుడు, "

(సూచన: ఇది వరకు వచ్చి చనిపోయిన అకంపనుడు ఒక సైనికాధికారి. ఈయన స్వయంగా రావణుని కొడుకు)

ఇంద్రధనుస్సు వంటి గొప్ప విల్లును చేబూని సింహ ధ్వజము గల గొప్ప రధముపై వస్తున్నవాడు ఇంద్రుని ఓడించిన "ఇంద్రజిత్తు"

వేయి గుజ్జలను పూన్చిన మహారధముపై ఎక్కి పర్వతము వంటి పెద్ద శరీరముతో
ధనుస్సును చేబూని వచ్చేవాడు "అతికాయుడు".

ఉదయిస్తున్న సూర్యునివలె ఎఱ్ఱని కళ్లు కలిగి, గంటలు కట్టిన మహా గళాన్ని అధిరోహించి, భయంకరమైన స్వరముతో శత్రు భయంకరంగా వస్తున్నవారు. "మహోదరుడు".

పడమటి కొండవంటి దేహకాంతి గల్గి బంగారునగలతో, అలంకరింపబడిన గుఱ్ఱముపై ఎక్కి "కుంతము"అను ఆయుధాన్ని పిడికిలితో పట్టుకొని యుద్ధానికి వస్తున్నవాడు 'పిశాచుడు'.

వేగవంతమైన ఎద్దుపై ఎక్కి, మెరుస్తుండే 'శూలాన్ని' ధరించి వేగంగా వస్తున్నవాడు 'త్రిశిరుడు'.

పాము గుర్తు జండాను గలిగి, తాటి చెట్టంత విల్లుతో, విశాల వక్షస్థలముతో, దేవతా గణాలను వధించడలో సమర్ధుడై వస్తున్నవాడు 'కుంభుడు' వీడు కుంభకర్ణుని కొడుకు.

భయంకర శరీరంతో, భయంకరంగా యుద్ధం చేయగలిగిన వాడు బంగారు రంగుతో
ప్రకాశించే రోకలిని ఆయుధంగా కలవాడు 'నికుంభుడు' ఈయన కుంభకర్ణుని కొడుకే.

అగ్ని వర్ణం గల జండాతో, సమస్త శస్త్రాస్త్రాలతో, కాంతివంతములైన గుఱ్ఱాలు గల రథముపై వస్తున్న భయంకర శరీరుడు 'నరాంతకుడు'.

గజ, వ్యాఘ్ర, హయముల వంటి, జింక, ఒంటెల వంటి ముఖాలు గల అనేక పిశాచాలు కొలుస్తుండగా అపరరుద్రునివలె, వెన్నెల వంటి తెల్లని గొడుగుతో, కిరీటకుండల ప్రకాశంతో, చీకటి కొండవంటి నల్లని పెద్ద దేహము గలవాడు. దేవతలకు
సింహస్వప్నమైనవాడు, సూర్య ప్రతాపుడైన రావణాసురుడు"

విభీషణుని వాక్యాలు విని రఘురాముడు రావణుని పైననే దృష్టి నిలిపాడు.

రావణుని వీర్య తేజస్సులు శ్రీ రామునికి కూడ ఆశ్చర్యం కలిగించాయి.

"రాక్షస రాజు తన తేజస్సు చేత మధ్యాహ్న సూర్యుని వలె చూడరాకున్నాడు. దేవ, దానవాది సకల ప్రాణులలో ఇంతటి ప్రకాశవంతమైన శరీరము ఎవ్వరికి లేదు. ఈయన పరివారంలోని వారందరు. పర్వత దేహులే పర్వత స్థైర్యులే.

ఈ రోజు ఈ దురాత్ముడు అదృష్టవశంగా నా కంటబడ్డాడు. ఇక వీడిని లంకకు తిరిగి మామూలుగా వెళ్లనివ్వను. నా సీతను అపహరించిన నాటి నుండి నేటి వరకు క్షణం క్షణం పెరిగి పోతున్న నా కోపాగ్నిని వీడిపై ప్రయోగిస్తాను" అని లక్ష్మణునితో సహా ధనుర్బాణాలను ధరించి రామ భద్రుడు నిలిచాడు.

రావణుడు తన పరివారాన్ని చూచి "ఇంతమంది నా వెంట వచ్చారే ? మీరందరు నా వెంట ఉంటే ఈ వానరులు వీరులు లేని లంకానగరాన్ని అనాయాసంగా ఆక్రమిస్తారు. కనుక మీరు తిరిగి వెళ్లండి" అని ఆజ్ఞాపించాడు.

తానొక్కడే ధనుర్ధారి అయి వానర సేనా మధ్యభాగాన్ని చీల్చుకొంటూ ముందుకు వెళుతున్నాడు.....

     ..........సశేషం.......

చక్కెర.తులసీ కృష్ణ.

No comments:

Post a Comment