ఈ కథ నా స్వీయ సృజన.
*పిల్లలు దేవుడితో సమానం*
కోడలు మనవరాలిని తీసుకురావడానికి స్కూలుకు వెళ్ళగానే తలుపు వేసుకుని
టీవీ చూస్తూ కూర్చుంది వర్ధనమ్మ .
కాలింగ్ బెల్ మోగగానే 'హు'అనుకుంటూ సీరియల్ చూస్తుంటే మధ్యలో ఆటంకపరచినందుకు విసుక్కుంటూ వెళ్లి తలుపు తీసింది.
పక్కింటి సరోజ "ఏం చేస్తున్నారమ్మా?..." అంటూ లోపలికి వచ్చింది.
"అదేమిటి!? నీవు మీ బాబును తీసుకురావడానికి స్కూల్ కి వెళ్లలేదా?" అన్నది వర్ధనమ్మ.
సరోజ కొడుకు తన మనవరాలు క్లాసే. అదే స్కూల్ కి వెళుతుంటాడు .ఇద్దరూ కలిసి వెళ్లి పిల్లల్ని తీసుకొస్తారు ...అందుకే అడిగింది .
"లేదమ్మా!.. ఇందాకే ఇంటికి చాలా ఏళ్ల తరువాత మా పిన్ని పిన్ని కొడుకు, కోడలు వస్తున్నట్టు ఫోన్ చేశారు .ఇంకాసేపట్లో వస్తారు .అందుకే శారదను మా చంటిని కూడా తీసుకుని రమ్మని చెప్పాను. ఏదైనా టిఫిన్ చేద్దామనుకున్నాను .అరగంటే ఉంటారట ...త్వరగా అయ్యే టిఫిన్ బజ్జిలే కదా! శెనగపిండి అయిపోయింది .ఇవాళ సాయంత్రం సరుకులు తేవడానికి వెళ్లాలి.. అందుకని మీ దగ్గర శెనగపిండి ఉంటే ఒక గ్లాసుడు ఇస్తే సాయంత్రం ఇచ్చేస్తాను" అన్నది.
వర్థనమ్మకు సరోజను చూస్తే ఆకారణ ద్వేషం.. తన కోడలు శారద ,సరోజ స్నేహంగా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తన గురించి కూడా ఏదైనా చెప్పుకుంటారేమో అని ఎప్పుడూ ఒక చెవి వేసి ఉంటుంది. స్కూలుకు వెళ్ళినప్పుడైనా చెప్పుకుంటారు కదా అని మనసులో అనుమానం .
అందుకని పిండి ఉన్నా గబుక్కున ఆనేసింది "మా ఇంట్లో కూడా అయిపోయింది"అని.
"ఓహో.. సరే అమ్మ! బాంబే రవ్వ ఉప్మా చేస్తాను.ఏం చేద్దాం ..పర్వాలేదు లెండి" అంటూ వెళ్లిపోబోయింది .
ఇంతలో శారద కూతురు శ్వేత ను సరోజ కొడుకు చంటి నీ తీసుకొని లోపలికి వచ్చింది.
"ఇల్లు తాళం ఉంటే వీడిని ఇక్కడికే తెచ్చాను.. ఎక్కడికి వెళ్లావో అనుకుంటూ..." అన్నది శారద సరోజతో
"అదే పిన్ని వాళ్ళు వస్తున్నారు కదా! బజ్జీలు చేద్దామని శెనగపిండి కోసం చూస్తే అయిపోయింది .మీ ఇంట్లో ఉందేమో అమ్మని అడిగి తీసుకుందామని వచ్చాను. కానీ మీ ఇంట్లో కూడా అయిపోయిందటగా?.. ... లేదని చెప్పారు. .అందుకే ఉప్మా చేద్దామని వెళుతున్నాను " అన్నది.
వెంటనే ఏడేళ్ల శ్వేత "అమ్మా నువ్వు మైసూర్ పాక్ చేయాలి సెనగపిండి తెమ్మంటే ఉదయమే నాన్న తెచ్చారు కదా! నానమ్మే కదా ఫ్రిజ్లో పెట్టింది . మరి ఆంటీ కి లేదంటుందేంటి "అంది పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆశ్చర్యంగా వర్ధనమ్మ వైపు చూస్తూ...
ఒక్కసారిగా బిక్క మొహం వేసింది వర్ధనమ్మ. మొహం పాలిపోయింది
ఆమె పరిస్థితి చూసి శారద కల్పించుకొని "నాన్నమ్మకు గుర్తుండదు కదమ్మా !పెద్దవాళ్ళు అయ్యారు ..అందుకే మరచిపోతుంటారు. అవును తెచ్చారు సరోజ. ఇస్తాను ఉండు" అంటూ వెళ్లి పెద్ద గ్లాసుడు శనగపిండి తెచ్చి ఇచ్చింది.
"థాంక్స్ శారద ! సాయంత్రం తెచ్చిస్తాను" అంటూ వెళ్లిపోయింది సరోజ.
"ఇలా అప్పులు అంటూ అందరికీ అందుకుంటూ పోతుంటే సంసారాలు బాగుపడ్డట్టే !..ఇస్తుందో ..మర్చిపోతుందో ఎవరికి తెలుసు .అందుకే లేదన్నాను .ఇది వచ్చి హరిశ్చంద్రుని చెల్లెలు లాగా నిజం చెప్పింది "వర్ధనమ్మ అంటూ ఉంటే శ్వేత ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ "అలా అబద్ధాలు చెప్పొచ్చా!? తప్పు కదా బామ్మ!" అన్నది.
"బామ్మ చెప్పేది నీకు అర్థం కావడంలేదు చిన్న పిల్లవి కదా ..అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు వెళ్లి కాళ్లు చేతులు కడుక్కుని రా! ...బిస్కెట్లు తిని పాలు తాగుదూ గాని" అంటూ శ్వేతను పంపించివేసింది.
అత్తగారి వైపు చూస్తూ నెమ్మదిగా అన్నది "మీరు ఇలా అనడం బాగాలేదు ..చిన్నపిల్లల మనసులో మనం ఏది చెప్తే అలా ముద్రించుకు పోతుంది. మనల్ని చూసి వాళ్లు మంచి చెడ్డలు నేర్చుకుంటారు.
అయినా మీరు సరోజ విషయంలో అలా ఎందుకు ఉంటారో అర్థం కావడం లేదు. మేము అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాము.
తను ఎప్పుడూ అంటూ ఉంటుంది..' మీకు పెద్ద దిక్కుగా మీ అత్తగారు ఉన్నారు.
నీవు చాలా అదృష్టవంతురాలివి'అని. తనకు మీరంటే ఎంతో గౌరవం"
వర్ధనమ్మ తప్పు చేసినట్టు తలదించుకుంది.
అవమానభారం తో మొహం ఎర్రబడింది.
తర్వాత సరోజ ఎప్పుడు వచ్చినా అభిమానంగా మాట్లాడి పంపించేది.
పిల్లలు కూడా దేవుడి లాగే మనుషుల కళ్ళు తెరిపిస్తుంటారేమో!.. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు.
************************************
బాలల దినోత్సవం సందర్భంగా నేను వ్రాసిన కథ.కల్మషములేని పసి మనసులకు
అంకితం.
Rajalakshmi Sarma
No comments:
Post a Comment