*శ్రీ గురుభ్యోనమః*
*దక్షిణామూర్తి మౌన స్వరూపుడు ! మౌన స్వరూపం భగవత్ స్వరూపం ! మౌనంతో జ్ఞానాన్ని ప్రసాదించగల వాడికి మాటలతోను, ఊసులతోనూ పనిలేదు.*
మౌనంగా ఉన్నవాడికి ఎక్కువ శక్తి కలుగుతుంది, వాడికి బుద్ధి సూక్ష్మత వస్తుంది, గౌరవింపబడతాడు. కొంతమంది ఎక్కువ మాట్లాడరు, అవసరమైతేనే మాట్లాడతారు. వాళ్ళే సమాజంలో ఎక్కువ గౌరవం పొందుతారు. వాళ్ళ మాటకి విలువ ఉంటుంది. వాళ్ళ మాటకి బరువు ఉంటుంది. వాళ్ళ మాటకి తూకం ఉంటుంది. వాగుడు కాయలు గౌరవింపబడరు. వారిని ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు. అలా వాగుతూ ఉంటాడు పట్టించుకోకండి అంటారు. అందుచేత మౌనంలో ఉన్న తూకం మాటలో లేదు.
కొంతమంది కోపం వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చుంటారు. అది మౌనం కాదు. అత్తగారి మీద కోపం వస్తే రెండు రోజులు మాట్లాడకుండా ఉంటారు. అది మౌనం అనుకోకండి. మీ భర్త కూర బాగోలేదు అంటారనుకోండి .. అప్పుడు మీకు కోపం వచ్చి రెండు రోజులు మాట్లాడటం మానేయచ్చు. ఎందుకంటే కూర బాగోలేదంటే మీ అహంకారానికి గాయం తగులుతుంది.
ఎక్కడయితే మాట అణిగిందో .. ఎక్కడయితే మనసు అణిగిందో .. ఎక్కడయితే తలంపులు అణిగిపోయాయో .. *శేషం లేకుండా ..* అది మౌనం ! అక్కడ్నించి ఉబుకుతుంది జ్ఞానం ! అంతేగాని కోపాలు వచ్చి నోటికి తాళం వేసుకుంటే మౌనం కాదది. కొంతమంది ఇంట్లో కోపం వస్తే 2, 3 రోజులు మాట్లాడరు. ఇవన్నీ మౌనాలు కాదు.
*శ్రీ నాన్నగారి అనుగ్రహ భాషణం -*
*మురమళ్ళ :* 2005 / 02 / 09
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment