కాలి పై కాలు వేసుకొని జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు -
.. అనే డోపమైన్ హై కథ !
తండ్రి - కష్టపడి ఎదిగి పారిశ్రామిక వేత్త అయ్యాడు
కూతురంటే అమితమయిన ప్రేమ .
పెళ్ళీడొచ్చిన ఆమె కోసం మంచి సంభందం వెదికాడు . శ్రమ ఫలించింది. వెయ్యి కోట్ల సంపద కలిగిన ఉన్నత శ్రేణి పారిశ్రామిక వేత్తల సంభందం . ఒక్కడే కొడుకు .
అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది ." అదృష్టం అంటే ఆమెదే .. ప్రేమంటే ఆ తండ్రిదే" అని అందరూ కొనియాడారు .
ఇప్పుడామె కాపురం చేస్తోంది .
లంకంత ఇల్లు .
ఇంట్లో ఎప్పుడూ ఆరుగురు పనివారుంటారు . ముగ్గురు వంటవారు.
పొద్దునే కనీసం అరడజను బ్రేక్ఫాస్ట్ టైమ్స్ డైనింగ్ టేబుల్ పై ఉంటాయి .
మామగారు భోజన ప్రియుడు .
ఏరి కోరి స్టార్ హోటల్ లో చెఫ్ గా పని చేసిన వ్యక్తిని నియమించుకున్నాడు . ఆహా ఏమి రుచి .. అన్నట్లుంటాయి ఆహార పదార్థాలు .
టిఫిన్ అయ్యాక కాసేపు స్మార్ట్ టీవీ.. లేటెస్ట్ మోడల్ ఆపిల్ ఫోన్ .
భర్త ఇండస్ట్రీ పనులు చూసుకొంటారు .
" ఇంటి కోడలు ఇండస్ట్రీ కి వెళ్లాల్సిన అవసరం లేదు . అక్కడ రఫ్ అండ్ టఫ్ మనుషులుంటారు . కావలిస్తే ఇంకో ఇద్దరు మేనేజర్ ల ను పెట్టుకొంటాము .. ఇంటి కోడలు ఇండస్ట్రీ కి పోవడం ఎందుకు ? హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చెయ్యక " అంటారు మామగారు అత్తగారు .
మధ్యాహ్నం లంచ్ . ఆ పై కాసేపు నిద్ర . ఓటిటి సినిమా . ఇంటి బయట రెండు బెంజ్ కార్ లు ఎప్పుడూ సిద్ధం . డ్రైవర్ లు వుంటారు . సాయంకాలం కాసేపు దగ్గర లోని పార్క్ లో వాకింగ్ కెళ్లొచ్చు .
రాత్రికి డిన్నర్ .
సంవత్సరానికి రెండు సార్లు భర్త తో కలిసి ఫారిన్ టూర్ .
కావలసినప్పుడు పెద్ద మాల్స్ లో షాపింగ్ . ఆమెకు తండ్రి పెట్టిన నగలు, పది కిలోల దాక వున్నాయి . ఇంకా కావాల్సిన డ్రెస్ నగలు ఎన్నయినా కొనుకోవచ్చు . చేతిలో క్రెడిట్ కార్డు . భర్త , అత్తామామ ఎప్పుడూ లెక్క అడగరు . ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు .
ప్రేమించే భర్త . సొంత కూతురులా చూసుకొనే అత్తమామలు .
" పెట్టి పుట్టింది . బతికితే ఇలా బతకాలి . కాలిపై కాలేసుకుని దర్జాగా జీవితాంతం బతికే అదృష్టం ఎంతమందికి ఉంటుంది ? " .. ఇవీ ఆమె గురించి నలుగురూ అనుకొనే మాటలు .
మీరు ఆమె జీవితం గురించి ఏమనుకొంటున్నారు ?
మీ ఇంటి అమ్మాయికి ఇంత మంచి సంభందం దొరికితే బాగుండు అనుకొంటున్నారా ?
మీరే కాదు . నూటికి తొంబై ఎనిమిది మంది ఇలాగే ఆలోచిస్తారు. ఒక గొప్ప కుటుంబం లో ఇస్తే కూతురు సుఖపడుతుంది అనుకొంటారు .
నాణేనికి మరో వైపు చూద్దామా ?
ఆమెకు కొన్నాళ్ళు హ్యాపీగా నే లైఫ్ గడిచింది . ఇప్పుడేంటొ తెలియదు . చెప్పలేని అసంతృప్తి . తనదీ ఒక బతుకేనా ? గానుగెద్దు బతుకు . లంకంత కొంప కాదు .. ఫైవ్ స్టార్ జైలు తనది . ఏదో తెలియని అసంతృప్తి .
ఎవరైనా చెబితే నవ్వి పోతారు . "ఏంటమ్మా నీకు సమస్యలు ? భర్త సరిగా చూసుకోవడం లేదా ? అత్తా మామ పోరా ?" అని అడుగుతారు.
అయ్యో వారు బంగారం .
మరేంటి తన సమస్య ?
పోస్ట్ ఇక్కడి దాక చదివారు కదా ?
ఆమెకున్న సమస్య ఏంటో చెప్పగలరా ?
ఎందుకు ఆమెలో అసంతృప్తి ?
ఎందుకు లైఫ్ ను ఆమె ఎంజాయ్ చేయలేక పోతోంది ?
ఎందుకు మెల్లమెల్లగా డిప్రెషన్ స్థాయికి చేరుకొంటోంది ?
పోస్ట్ మిగతా భాగం చదవకుండా ఆలోచించండి .
సమాధానం తడితే మీరు సరైన ఆలోచనా దృక్పథం కలిగివున్నారు . గొప్ప తల్లితండ్రి అవుతారు .
నేటి సమాజం లో నూటికి అయిదు మంది మాత్రం ఆలా ఆలోచించగలరు .
ట్రై చెయ్యండి .
సమాధానం తట్టడం లేదా ?
అయితే చదవండి .
కాలిపై కాలేసుకుని గంట కూర్చుంటే తిమ్మిరి పట్టేస్తుంది . అలాంటిది జీవితాంతం కాలిపై కాలేసుకుని కూర్చుంటే జీవితానికే తిమ్మిరి పట్టేస్తుంది .
సైన్స్ భాషలో దాన్నే డోపమైన్ హై అంటారు .
దేన్నైనా అతిగా అనుభవిస్తే అందులో మాధుర్యం పోతుంది .
బాగా రుచి కరమైనయినా వంట . నాలుగు రోజులు తింటే మీకు బోర్ కొట్టేస్తుంది .
వంటైనా జీవితమయినా అంతే .
బాగా ఆకలేసి నప్పుడు తినే పప్పన్నం ఎంత రుచో !
బాగా దప్పికేసినప్పుడు తాగే మంచి నీరు ఎంత హాయినిస్తుందో ?
బాగా చెమట చెమట పట్టినప్పుడు చల్లటి గాలి వీస్తే ఎంత బాగుంటుందో .
అనేక అపజయాల తరువాత వచ్చే విజయం ఎంత కిక్ నిస్తుందో !
దేవుడు / ప్రకృతి . భలే భలే సెట్ చేసాడు . సంతోషం కలిగితే డోపమైన్ హార్మోన్ వస్తుంది . సంతోషం తరువాత కాస్త కష్టముండాలి . అప్పుడే తిరిగీ సంతోషం కలుగుతుంది . అది ప్రకృతి రూల్ . సృష్టిలో వున్నది మొత్తం తనకే అన్నట్టు లాగేసుకొని ఎంజాయ్ చెయ్యడం మొదలెడితే సంతోషం కాదు . సమస్యలు వస్తాయి .
ఒక పెగ్ తాగితే కిక్.
అదే కిక్ రావాలనుంటే కొన్ని నెలలకు ఫుల్ బాటిల్ కావాలి . అయినా కిక్ రాదు .
అర్థం కాలేదా ?
అప్పుడెప్పుడో దూరదర్శన్ కాలం లో .. శుక్రవారం చిత్రలహరి, శనివారం తెలుగు సినిమా వచ్చేది .
గుర్తుందా ?
అబ్బా .. ఎంత ఉల్లాసం .. ఉత్తేజం . శుక్రవారం కోసం ఎంత గా ఎదురు చూసేవారం ? . చిత్ర లహరి చూసిన తరువాత ఎంత ఆనందం?
ఇప్పుడో? .. వామ్మో .. ఏ ఛానల్ పెట్టిన సినిమాలు .. పాటలు . అయినా బోర్ .. బోర్. రిమోట్ నొక్కుతూ నొక్కుతూ .. .. "ఛీ ఇదీ ఒక బతుకేనా అనిపిస్తోంది" . అవునా?కాదా ?
అదేనండి డోపమైన్ హై .
ఆమె బాగా చదువుకొంది. తెలివయినది . నాయకత్వ లక్షణాలు మెండుగా వున్నాయి . ఆమె చదువు- తెలివితేటలు ఇప్పుడు అడవి గాచిన వెన్నెల . పరాన్నబుక్కు జీవితం . తినడం కోసం బతకాల్సి వస్తోంది . మళ్ళీ పడుకోవడం కోసం నిద్ర లేవాల్సి వస్తోంది . సోమవారం మంగళవారం .. బుధ గుర శుక్ర శని ఆది వారలు .. జనవరి నుంచి డిసెంబర్ దాక అన్ని నెలలు తనకు ఒకటే . అదే రొటీన్ . బోర్ . బోర్ .అతి సుఖం . డోపమైన్ హై .
పుట్టింది ఎందుకు ? ఏమి సాధిస్తోంది ? పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా ? తన బతుకూ చెదబతుకే. తండ్రి అత్తామామ భర్త తనకో అందమయిన బంగారు పంజరం తయారు చేసారు . ఫారిన్ పళ్ళు దానికి .. తనకూ అంతే . అంతా కాస్టలీ లైఫ్ . జీవితం లో ఆనందం ఆవిరై పోయింది .
బతుకంటే ఇంట్లో తొంగోని తిని నిద్ర పోవడం కోసమే అయితే తాను ఎందుకు చదివినట్టు ? అవును .. తన నాన్నమ్మ, వారి ముందు ముందు తరాల స్రీలు ఇంటి పట్టునే ఉండేవారు . తాను అలాగే బతకాలి అనుకొంటే తనని ఎందుకు చదివించినట్టు ?
వారానికొక్క సారి వచ్చే చిత్రలహరి కోసం ఆఫీస్ నుండి త్వరగా ఇంటికొచ్చి.. త్వరగా వంట చేసి... ఎదురు చూసినమ్మ ఇప్పుడు రిమోట్ పట్టుకొని ఎందుకు పదే పదే ఛానల్ మారుస్తోందో .. తన బతుకు అంతే .
చీకటి వెలుగుల రంగేళీ .. జీవితమే ఒక దీపావళి .
సమస్య లేని బతుకూ ఒక బతుకేనా ?
సమస్యలన్నీ మీరు అనుభవించి మీ కొడుక్కి / కూతురికి సమస్యల్లేని జీవితం ఇవ్వాలని చూస్తున్నారా ? అయ్యో .. ఎంత అన్యాయం ?
జీవితం లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెదుక్కొంటే రాటుదేలుతారు . నాయకులవుతారు . డోపమైన్ హై రాదు .
సమస్యలన్నీ మీరు అనుభవించి వారికి వడ్డించిన విస్తరి లాంటి జీవితం ఇస్తే .. వారికి తమ జీవితమే సమస్య అయిపోతుంది .
జీవితం లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారముంటుంది . కానీ జీవితమే ఒక సమస్యే అయితే ? మానసిక వైద్యుడు / ఉరితాడు .
వద్దు మాస్టారు . మీ పిల్లల పాలిట మీరే సమస్య కావొద్దు .
సమస్యల్ని పరిష్కరించగలిగిన తెలివితేటలు శక్తియుక్తులు వారికివ్వండి . అంతే కానీ సమస్యలేని జీవితం కాదు
మీ ఇల్లు బొమ్మరిల్లు కావాలి .
కానీ మీరు బొమ్మరిల్లు ఫాదర్ కావొద్దు .
అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత.....
No comments:
Post a Comment