రామాయణమ్ ..5
.
నారదుని వలన నీకు ఏవిధముగా రామ కధ చెప్పబడెనో ఆ విధముగనే నీవు రామ కధ చెప్పు.
.
రాముడు ధర్మాత్ముడు,లోకములో శ్రేష్ఠమైన గుణములు అని మనము చెప్పుకొనేవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి!
రాముని గూర్చిన అన్నివిషయములు నీకు తేటతెల్లము కాగలవు!
.
" కురు రామకధాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్"
.
మనస్సును రమింపచేసేది,పుణ్యప్రదము అయిన రామకధను అక్షర బద్ధం చేయి నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షరసత్యము కాగలదు!.
.
యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే
తావద్రామయణకధా లోకేషు ప్రచరిష్యతి!
.
....ఎప్పటి వరకైతే భూమిమీద పర్వతాలు నిలచి ఉంటాయో!
ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో
అప్పటివరకు భూమి మీద రామకధ ప్రాచుర్యంలో ఉంటుంది!.
.
అప్పటివరకు నీవుపుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు!
అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు.
.
బ్రహ్మ వరంచేత మహర్షి మనోఫలకం మీద ( మనసు తెర మీద)రామచరిత మొత్తం కనపడజొచ్చింది! .
.
రామకధను అక్షరబద్ధం చేయటానికి మహర్షి సంకల్పం గావించుకొన్నారు! .
.
పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశముండేది! వారు కోసలదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు.
అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొన్నారు.
.
విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య! ఉన్నతమైన కోట బురుజులు,వందలకొద్దీ శతఘ్నులు మొహరించి ఉండేవి ! రాజ్య రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది.
ప్రజలంతా ధనధాన్యసమృద్ధితో,సుఖసంతోషాలతో, ఆనందంగా ఏ లోటులేకుండా జీవనం సాగించేవారు .
.
ఆ సమయంలో దశరధుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు.
ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవారాయన!.
.
దశరధమహారాజు వద్ద ఎనమండుగురు మంత్రులుండేవారు!
వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు! ఎదుటివ్యక్తి ముఖకవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు!
రాజుకు మేలుకలిగించేవి,హితకరంగా ఉండేవి,మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్ధులు.
.
వారు వరుసగా, ధృష్టి,జయంతుడు,విజయుడు,సిద్ధార్దుడు, అర్ధసాధకుడు,అశోకుడు,మంత్రపాలుడు,సుమంత్రుడు .
.
వసిష్ఠ, వామదేవులు ప్రధాన ఋత్విక్కులు.
.
మంత్రులందరూ అత్యంత నిబద్ధతో మెలిగేవారు ,పటిష్ఠమైన గూడచార వ్యవస్థ కలిగి ,రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకొన్నారు.
.
ఆ మంత్రులు, స్వయముగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనుకాడేవారుకాదు!
వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు! ..
.
బలవంతుడయిన వ్యక్తి,బలహీనుడయిన వ్యక్తి ఒకే తప్పు చేస్తే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది! ( సరిగ్గా నేటి వ్యవహారానికి పూర్తి వ్యతిరేకము).
.
రాజ్యము,రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు!
.
రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్రవైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరధమహారాజు!.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
No comments:
Post a Comment