Sunday, July 21, 2024

 *గురుపూర్ణిమ సందర్భంగా.

*వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తైః పౌత్రమకల్మషమ్ |*
*పరాశరాత్మ త్జం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |*
*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll*

మహాభారత గ్రంధకర్త అయిన *"వేదవ్యాస మహర్షి"* జన్మించినది... *ఆషాడ పౌర్ణమి* నాడు. 

ఈ వ్యాసుడు, పరాశరముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును *"వ్యాసపౌర్ణమి"* మరియు *"గురుపౌర్ణమి"* అని కూడా అంటారు.

మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు. ( *ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం* )

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. 

ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో *ధర్మం*... కృతయుగంలో 4 పాదాలతో, 
త్రేతాయుగంలో 3 పాదాలతో, 
ద్వాపరయుగంలో2 పాదాలతో, 
ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది.

కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే, మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. 

వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి --- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగం లోనూ, వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు. మందబుద్దుల కోసం,  వేదాధ్యాయానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు.

శ్రీమద్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ, వేదవ్యాసుని 17 వ అవతారంగా చెబుతుంది.

వ్యాసుడు నల్లగా ఉండేవాడట... అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు.  కృష్ణుడు అని అనేవారు. ఈయన నివాసస్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం... కనుక,  *కృష్ణ ద్వైపాయనుడు* అని అంటారు.

వేదాలను విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక -- *వేదవ్యాసుడు* అని, పరాశర మహర్షి కుమారుడు గనుక -- *పరాశరాత్మజుడు* అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక -- *బాదరాయణుడు* అని అంటారు.

 సర్వభూతములయందు దయ కలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట - ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ *దేవరుణము, ఋషిరుణము, పితృఋణము* - అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు *మనుష్య ఋణము* కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్యఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.

*మహాభారత రచన*

మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు.  తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారా!! అని విచారంలో ఉండగా..... బ్రహ్మ,  వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమై,  "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అదృశ్యమయ్యాడు. 

అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడివి కావాలి.... అని తెలుపగా..... గణేశుడు అనుమతించాడు•. వేదవ్యాసుడు చెబుతూఉంటే.... గణాధీశుడు రచన సాగించాడు.

*గురుశిష్య సాంప్రదాయం*

ఏనాటిదో ఐనా, వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను నాల్గింటిని తన నలుగురి శిష్యులకు బోధించి, భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులకు పరంపరగా బోధించమని కోరాడు.

మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి, లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. 

ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన _*ఆషాఢశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి)*_ నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి... పూజించాలి. ఆ గురువుకు పాదపూజ చేసి, కానుకలు సమర్పించి, అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

*"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః*
*గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః*

అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి•.

*"గు"* శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. *"రు"* శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, మనకు జ్ఞాన్నాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.

*"గురువునూ, గోవిందుడిని పక్కపక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా"* అంటాడు భక్తకబీర్ దాస్. 

అదీ మన భరతీయసంస్కృతి. ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి, గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

*గురు సందేశము*

వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే - 

*'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.'*

పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామం అవుతుంది•.

*అస్మత్ గురుభ్యో నమః*

No comments:

Post a Comment