విశ్వసృష్టి, స్థితి, లయ కారణమైన శక్తిని పలువిధాలుగా ఆరాధించే వైవిధ్యమైన సంప్రదాయాలు మన సంస్కృతిలో ఉన్నాయి. ఈ శక్తినే ప్రకృతి అని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. చేయబడినది కృతి, కాబట్టి కృతి అనగా సృష్టి. ఈ కృతికి ప్రధానమైనది ప్రకృతి. ప్రకృతి శక్తి నిజానికి ఎకమే అయినా, అది అనేక విధాలుగా ఈ సృష్టిలో గోచరిస్తుంది. ఆ విభిన్న శక్తులే విభిన్న దేవతాకృతులు.
ప్రకృతి శక్తి అయిన జగదంబను మంత్రతంత్రాలతో, యజ్ఞయాగాదులతో, ఆరాధించే పద్ధతులే కాక, అమాయకమైన నిష్కపట భక్తితో తమకు తెలిసిన భాషతో స్వచ్ఛంగా ఆరాధించే జానపద సంప్రదాయాలు మన మతంలో ఉన్నాయి. జీవులలోని వైవిధ్యానికి తగినట్లుగా ప్రకృతి శక్తిని ఆరాధించి తమకు అనువుగా అనుకూలపరచుకునే రీతులలో ఇంతటి ‘అందుబాటుతనాన్ని’ మన పూర్వీకులు పరంపరగా అందించారు.
జ్ఞానం, శక్తి, సంపద – ఈ మూడూ ప్రతి వారికీ కావలసినవి. జ్ఞాన స్వరూపిణి సరస్వతి, శక్తి స్వరూపిణి దుర్గ(కాళి), సంపద రూపం లక్ష్మి. ఈ మూడూ ఒకే శక్తికి మూడు వ్యక్తీకరణలు. వీటిని పొందడానికి అమ్మవారిని ముగురమ్మల మూలపుటమ్మగా ఆరాధించే పండుగలలో ‘బోనాలమ్మ పండుగ’ ఒకటి. జగదంబను వారి పలుకుల్లో వారి తీరులలో వారు కొలుచుకునే సౌఖ్యం మన ధర్మంలో ఉంది. కేవలం అర్థం కాని మంత్రతంత్రాలతోనే కాక, తమ హృదయఘోషను, తమ జీవనశైలిని మేళవించి దేవతలను ఆరాధించే విశాల దృక్పథం ఈ సనాతన ధర్మంలో సహజంగా ఉందని ఈ పండుగలు స్పష్టం చేస్తాయి. ప్రకృతి శక్తి ఇలవేల్పుగా, ఇంటి వేల్పుగా, కులదేవతగా, గ్రామదేవతగా అందరికీ అనువుగా ఆరాధింపబడడం ఒక ఉదాత్త వైఖరి. ఏ కొందరికో పరిమితం కాకుండా, భగవచ్ఛక్తి అందరిదీ అని ఋజువు చేసే ఈ పండుగలు సామాజికంగా కూడా సమైక్య సమన్వయ సౌందర్యానికి నిలువెత్తు దర్పణాలు. ఆషాఢ మాసంలో ప్రకృతిలో కలిగే పరిణామాలను తమ ఆయురారోగ్య సౌభాగ్యాలకు అనుగుణంగా మలచమని ఆ తల్లిని ఆరాధించడం ఈ పూజల ఆంతర్యం.
జగజ్జనని తన కళాస్వరూపాలతో గ్రామదేవతలుగా వెలసి, ఏలుకుంటున్నదని పురాణాలు చెబుతున్నాయి. ఏ తల్లి త్రిశక్తి స్వరూపిణియో, ఆ తల్లే ఈ గ్రామదేవతల రూపంలో ఉంది. అందుకే ఉజ్జయిని మహంకాళి, రేణుక లాంటి నామాలతో అమ్మను ఆరాధిస్తారు.
ఆషాఢమాసంలో ఈ శక్తి దేవతలను ఇంచుమించు అన్ని మంత్రాలతోనూ అర్చిస్తారు. ఇళ్ళలో కూడా ‘ఉపాహారాలు’ పెట్టడం అనే పేరుతో గ్రామ దేవతలను ఉద్దేశించి బోనాలను సమర్పించడం ఆనవాయితీ.
యాయాశ్చ గ్రామదేవ్యః స్యుస్తాః సర్వాః ప్రకృతి కళాః!
ప్రకృతి శక్తి కళలె గ్రామదేవతలంతా అని దేవీ భాగవత వచనం. వీరి అనుగ్రహం వల్ల గ్రామాలలో అరిష్టాలు కలుగకుండా సమస్త సౌభాగ్యాలూ లభిస్తాయి. ఎల్లమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ మొదలైనవన్నీ వైదిక సంస్కృతినుంచి విస్తరించిన రూపాలే. ఏళ్ల, పొలిమేర, అంకం (గుర్తు – ఊరి హద్దులను తెలిపేది) – ఇవి గ్రామాల సరిహద్దులను తెలియజేస్తాయి. ఆ హద్దులలో నెలకొని, గ్రామాలను కాపాడే తల్లులు వీరు. పొలాలమ్మ వంటి నామాలు సస్యాధిదేవతకు జానపద పదాలే.
అడిమాసం పేరుతో తమిళనాడులో శక్తి ఆరాధనను సామాన్యులంతా అసామాన్యంగా చేస్తారు. యజ్ఞద్రవ్యమైన అన్న సమర్పణ ప్రకృతి శక్తుల ఆనందానికి కారణం. ప్రకృతి శక్తి వల్లనే మనకి అన్నాదులు లభిస్తున్నాయి. సస్యోత్పత్తి, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిపై ఆధారపడి ఉన్నాయి. వాటి వలన లభించే అన్నాదులను సభక్తికంగా సమర్పించడం ద్వారా ఆ నివేదన (నీ కృపయే ఇది అని తెలియజేసుకోవడం), ప్రసాదం(అనుగ్రహం)గా మారి మనలను తరింపజేస్తుంది. దేవతలు ‘దృష్టిమాత్ర సంత్రుప్తులు’. వారి చూసినంత మాత్రానే ఆనందిస్తారు. వారి చూపు పదార్ధాన్ని శక్తిమంతమైన ప్రసాదంగా మారుస్తుంది. అన్ని స్తాయిల వారికీ అందివచ్చిన పరాశక్తి కృపకు ప్రబల నిదర్శనం ఈ పండుగ.
పూజ్యగురువులు సమన్వయ సరస్వతీ వాగ్దేవీవరపుత్ర డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాసం శ్రీపీఠం మాసపత్రిక.
No comments:
Post a Comment