Friday, August 9, 2024

 ఆత్మానాత్మ వివేకము ( ఆదిశంకరుల విరచితం -- శ్లోకం 6.)

రాగాదయ:   కస్మాత్  …    భవన్తీతి  చేత్  / 

రాగం మొదలయినవి దేనివల్ల పుడతాయి అనే ప్రశ్నకి, అభిమానం వల్ల పుడతాయి అని సమాధానం.

రాగం మొదలయినవి  అంటే ఏమిటో తెలిసినతర్వాత,  ఈ ప్రవ్రుత్తులన్నీ,  అభిమానం వల్ల పుడుతున్నాయి అని తెలుసుకోవాలి .   ఏ వస్తువైనా ముందుగా మన ఇంద్రియాలకు గోచరిస్తుంది.  ఆతర్వాత మనస్సులో ఆలోచన  మొదలవుతుంది.  ఇది నాది, దీని మీద అధికారం నాది. ఇది నా కోసమే !  అంతా నా కోసమే ! . అనేది అభిమానం.  ఈ అభిమానం ప్రాణులన్నిటికీ సహజమే.   ఈ అభిమానం అనేదే అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారమౌతుంది .

దీనిని అనుసరించే బుద్ధి అనేది ఏ పనిచేయాలో నిర్ణయిస్తుంది.  అహంకారమనేది చాలా జటిలమయినది.  దీనినుండి విముక్తి  అనేది కష్టసాధ్యం. పూర్తిగా అసాధ్యం కాదు .

నిష్కాపట్యాన్ని, సరళ స్వభావాన్ని  ( డంబాచారం, మిధ్యాభిమానం లేకుండా వుండటం ) అలవాటు చేసుకుంటే, అహంకారాన్ని చాలావరకు అదుపులో పెట్టవచ్చు .  అహంకారం అంటే  తాను ఏదో పొందాలనీ.   ఆ పదవికీ, ఆ భోగభాగ్యాలకీ తాను మాత్రమే అర్హుడననే భావం .

ఈ అహంకారం తగ్గినకొద్దీ రాగాదిభావాలు వాటంత అవే తగ్గుముఖం పడతాయి .  రాగమనేది సాధనకు భంగకారి.   లోపల అహంకారమున్నప్పుడే బయట రాగమనేది కనిపిస్తుంది.  లోపల అహంకారం లేకపోతె బయట రాగమనేది వుండదు.

అహంకారమే రాగానికి మూలకారణం . అంతేగానీ, రాగం వల్ల అహంకారం పుడుతుందని అనుకోకూడదు.  వీటి మధ్యనుండే అంతరం చాలా సూక్ష్మమైనది .  కాబట్టి అటువంటి భ్రమకు అవకాశం వుంది .  

స్వస్తి .

No comments:

Post a Comment