*‘ఆత్మజ్ఞానం’*
(కేన మరియు కఠోపనిషత్తుల అంతరార్ధము)
జీవుని విషయానికొస్తే, దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే "ఆత్మ". సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సే. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలని ఇక్కడ భావము. "తద్వనం" (అది ఆనందకరమైనది) అనే నామంతో "బ్రహ్మము" ఉపాసింపబడుతుంది. ఆనందమే పరబ్రహ్మమని అర్ధము. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి. ఈ విధంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన ఈ ఉపనిషత్తు గురువు ద్వారా శిష్యునికి బోధింపబడింది. ఈ ఉపనిషత్తునకు తపస్సు, దమము, కర్మ పునాదులవంటివి. వేదములే దాని యొక్క అంగములు. సత్యమే దాని నివాసస్థానము. ఈ ఉపనిషత్తు సారాంశమును గ్రహించినవాడు "బ్రహ్మము" నందు ప్రతిష్ఠితుడగుతాడు. ఇందులో సంశయం లేదు. జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య మార్గాలనికూడా అంటారు. జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు. అవిద్యలో పడి కొంతమంది తామే ధీరులమని, పండితులమని ప్రకటించుకుంటారు. వారు పరలోక విషయాన్ని లేక ఆత్మవస్తువుని ఏ మాత్రము గ్రహించక పలుమార్లు ఇచ్చటికే (మృత్యులోకం) వచ్చి పోతుంటారు. వారిని అనుసరిస్తున్న వారిది కూడా ఇదే పరిస్థితి.
ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము, విన్నవారు దానిని తెలుసుకొనుట కష్టం, దానిగురించి చెప్పే గురువు దొరకటం ఇంకా కష్టం, ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది. కానీ శిష్యుడు సత్యశోధకుడై వుండాలి. కర్మలను నిష్కామంతో ఆచరించి, తద్వారా చిత్తశుద్ధిపొంది, జ్ఞానంతో సత్యశోధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుట సులువైన మార్గము. ఆ పరమాత్మ వస్తువు కంటికి కనబడదు. ప్రతి జీవిలో నిఘాడంగా అది నెలకొనివుంది. దానిని జ్ఞాననేత్రం(ఆత్మనిష్ఠ)తో గ్రహించవచ్చు.
ఆత్మ, అణువుకన్నా అణువైనది మరియు మహత్తుకన్నా మహీయమైనది, ఎటువంటి శరీరంలేకుండా అది ప్రతిజీవి శరీరంలో నెలకొనివుటుంది. అక్కడే వుంటూ అన్నిచోట్లకు వెళ్లగలదు. జీవుని సుఖదుఃఖములతో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. జీవి శరీరము నశిస్తుంది గాని ఆత్మ ఎల్లప్పుడూ చిదాభాసమై వుంటుంది.
No comments:
Post a Comment