చలాచల బోధ:--
సమాదానము:--
సమాదానము (సమాధానము కాదు) అనగా సమ+ఆదానము.దానము అంటే ఇచ్చుట,ఆదానము అంటే స్వీకరించుట లేక గ్రహించుట అని అర్థం.కావున సమ ఆదానము అంటే గురువు చెప్పినది చెప్పినట్లు గ్రహించుట.తామసిక శ్రద్ధ గలవారికి అసలు గ్రహించే సామర్ధ్యం ఉండదు.బాహ్య విషయాలను గ్రహించగలడు గాని ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేడు.రాజసిక శ్రద్ధ గలవాడు ఒకటి చేప్తే మరొకలాగా అర్థం చేసుకుంటాడు మరియు అపార్థం చేసుకుంటాడు.ఆధ్యాత్మిక విషయమును లౌకిక విషయం వలె గ్రహిస్తాడు.సాత్విక శ్రద్ధ గలవాడు మాత్రమే చెప్పినది చెప్పినట్లు గ్రహిస్తాడు.ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అంటే వేదాలలోని పదాలకు మూడు విధాలైన అర్థాలు ఉంటాయి.అవి యేమనగా ఆధి భౌతిక,ఆధి దైవిక, ఆధ్యాత్మిక అర్థాలు.ఉదాహరణకు ఆదిత్యోపాసనను (సూర్యోపాసన)తీసుకుందాము.భౌతకమైన అర్థములో సూర్యుని ఆరోగ్య ప్రదాతగా ఆరాధించడము.దైవిక పద్ధతిలో సూర్యభగవానునిగా ఉపాసించడము.ఆధ్యాత్మికముగా అంతర్యామి అయిన సూర్యనారాయణుని ఉపాసన చేసి అంతర్యామిత్వమును పొందడము.ఈ మూడవది బ్రహ్మోపాసనతో సమానము.సాధకుడు ఈ ఉపాసన వలన ఉపాస్య రూపమైన బ్రహ్మమే అవుతాడు.
భగవద్గీతలో చెప్పినట్లు సాత్విక శ్రద్ధ గలవాడు మాత్రమే గురు బోధలోని ప్రతి పదమును,ప్రతి వాక్యమును ఆధ్యాత్మిక అర్థంలో గ్రహిస్తాడు.భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో తమోగుణము, రజోగుణము, సత్త్వగుణముల గురించి వివరంగా చెప్పబడింది.కావున శిష్యుని స్వభావము తమోరజోగుణములను విడచినదై శుద్ధ సత్వగుణంతో ఉండాలి.అప్పుడు మాత్రమే సమాదానము కలిగిన శిష్యుడు గురు బోధను యథాతథముగా గ్రహించగలుగుతాడు.
సశేషం!
No comments:
Post a Comment