గురువుగారు, నాదొక ధర్మ సందేహం.
గురువు:
అడుగు నాయనా....
శిష్య:
భార్య, లేదా భర్త చనిపోయినవారు, ఆ చనిపోయినవారికి శ్రాద్ధాలు పెడుతారు కదా? అప్పటికి ఈ బతికున్నవారు రెండో పెళ్ళి చేసుకొని ఉంటే, శ్రాద్ధం స్వీకరించటానికి వచ్చిన ఆత్మలు, తమ స్థానం లో ఇంకోరిని చూసి, బాధకు, కోపానికి లోను కావా?
గురువు:
పిచ్చివాడా, సమాధానం నీకు తెలీదా?
శిష్య:
నాకా? తెలీకే కదా అడిగాను, గురువుగారు..
గురువు:
నీకు తెలుసు, సమాధానం నీతోనే చెప్పిస్తాను చూడు.
నేనడిగే చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిస్తావా?..
శిష్య:
సరే, గురువుగారు..
గురువు:
నువ్వు శ్రాద్ధాలు పెట్టించడం చూశావా?
శిష్య:
మా నాన్నగారు పెట్టించేవారు.
గురువు:
అందులో ఏమేమి చేస్తారో అర్థం అయిందా?
శిష్య:
అంటే, పోయినవారిని బ్రాహ్మణులలో ఆహ్వానించి, ఆ పోయిన ఆత్మకు ఈ బ్రాహ్మణుని ద్వారా కవ్యం.. అంటే పూజ, ఆహారం, తర్పణాలు వంటివి అందజేసి సంతృప్తి పరుస్తారు.
గురువు:
అంటే శ్రాద్ధాల గురించి నీకు ప్రాథమిక అవగాహన ఉంది?
శిష్య:
అవును గురువుగారు, అందుకే నా సందేహం అడిగాను.
గురువు:
శ్రాద్ధము స్వీకరించేది ఎవరన్నావు?
శిష్య:
చనిపోయినవారి ఆత్మ
గురువు:
ఆత్మ మాత్రమే కదా, ఆ చనిపోయినవారే వచ్చి తీసుకోలేదు కదా?
శిష్య:
చనిపోయాక ఎలా వస్తారు గురువుగారు, వచ్చేది వారి ఆత్మ మాత్రమే కదా..
గురువు:
అంటే ఆత్మ చనిపోలేదు అంటున్నావు, అంతే కదా..
శిష్య:
అవును గురువుగారు, ఆత్మలకు చావు లేదు కదా
గురువు:
సరిగ్గా చెప్పావు, ఆత్మకు చావు లేదు. పుట్టుక ఉందా?
శిష్య:
పుట్టుక కూడా లేదు గురువుగారు
గురువు:
నిజమే, చావుపుట్టుకలు లేనివే ఆత్మలు.. మరి ఆ ఆత్మలు చేసే పనులేమిటి?
శిష్య:
[ తలగోక్కుంటూ...] అంటే ఆత్మలు మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయి అని చదివాను...
గురువు:
ఔను, ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. ఒక జన్మలో చేసింది ఇంకో జన్మలో గుర్తుంటుందా?
శిష్య:
కోట్లలో ఒకరికి తప్ప, ఎవరికీ గుర్తుండదు.
గురువు:
కదా, అంటే శరీరం పోగానే, దానికి సంబంధించిన అన్ని గుర్తులూ, జ్ఞాపకాలూ సమసిపోతాయి, కాదా?
శిష్య:
ఔననుకుంటాను గురువుగారు..
గురువు:
కాబట్టి, ఒకసారి చనిపోయాక, ఆ పాత జీవితముతో ఆ ఆత్మకు ఎటువంటి సంబంధం ఉంటుంది?
శిష్య:
ఏ సంబంధమూ ఉండదు..అనిపిస్తుంది.. అయితే, పాత జీవితములోని వారు ఇచ్చే శ్రాద్ధాలు తీసుకుంటాయి కదా?
గురువు:
గొప్ప ప్రశ్న వేశావు. వచ్చి శ్రాద్ధం తీసుకుంటాయి. ఏ రూపంతో వస్తాయి, అంటే ఎలా వస్తాయి?
శిష్య:
శ్రాద్ధం జరిపించే పద్దతి చూస్తే, వసు, రుద్ర లేక ఆదిత్య రూపం లో వచ్చి తీసుకుంటాయి.
గురువు:
అంటే ఏమిటి? ఆ రూపాలు ఎలా వస్తాయి?
శిష్య:
నాకు తెలిసినంతవరకూ, చనిపోయి సంవత్సరం దాటాక, సపిండీకరణం అయ్యాక, ఆ ఆత్మకు వసు రూపం వస్తుంది,
గురువు:
నిజం... మరి ఆత్మలు చాలా జన్మలు తీసుకుంటాయి అన్నావు కదా, అంటే ఆయా జన్మలలోని ఎందరో ఒకే ఆత్మకు శ్రాద్ధం పెడుతుండవచ్చు. అప్పుడు ఆ ఆత్మ యే శ్రాద్ధం తీసుకుంటుంది? అంటే, ఎవరు ఇచ్చేది తీసుకుంటుంది?
శిష్య:
అన్ని జన్మలలోనూ ఒకే తిథినాడు చనిపోవాలని లేదు కదా, వీరు శ్రాద్ధం ఇస్తున్న తిథిని బట్టి, యే జన్మలో ఆ తిథిలో చనిపోయారో, ఆ జన్మలోని వారు ఇచ్చే శ్రాద్ధం తీసుకుంటుంది.. అని తార్కికంగా అనిపిస్తున్నది.
గురువు:
సరిగ్గా చెప్పావు. అంటే వేర్వేరు తిథులలో ఒకే ఆత్మకు వేర్వేరు శ్రాద్ధాలు జరిగితే, ఆయా తిథులలో, ఆయా జన్మల వారు ఇచ్చిన శ్రాద్ధం తీసుకుంటుంది అంటావు?
శిష్య:
అవును,గురువుగారు, అదే తర్కానికి అందుతున్నది.
గురువు:
మరి, వేర్వేరు జన్మలవారు శ్రాద్ధాలు పెడుతుంటే వచ్చి తీసుకొనే ఆత్మ, యే జన్మలోని వారితో ఎక్కువ సంబంధము కలిగి ఉంటుంది?
శిష్య:
ఆత్మకు బంధాలు ఉండవు కదా, ఎవరితోనూ ఎక్కువ సంబంధము ఉండదు, లేదా, అందరితోనూ ఒకే రకమైన సంబంధము ఉంటుంది.
గురువు:
నువ్వు చెప్పినట్టు కాక, ఉదాహరణకు, అన్ని జన్మలలోనూ ఒకే ఆత్మ ఒకే తిథి నాడు పోయింది అనుకుందాము. అప్పుడు అందరూ ఇచ్చే శ్రాద్ధాలలో ఎవరి శ్రాద్ధం తీసుకుంటుంది?
గురువు: శిష్య:
అన్ని శ్రాద్ధాలూ తీసుకుంటుంది అని వివేకం, తర్కం చెబుతున్నాయి, కాని ఎలా తీసుకుంటుందో అర్థం కాలేదు గురువుగారు.
గురువు:
అంటే ఒకే రోజు, ఒకే సమయంలో అన్ని చోట్లకు ఎలా వెళుతుంది అని కదా?
శిష్య:
అవును గురువుగారు, ఒకే ఆత్మ అన్ని చోట్లకూ ఒకే తిథినాడు వెళ్ళి తీసుకుంటుంది అంటే ఎలా నమ్మడం?
గురువు:
ఇందాక, వసు,రుద్ర,ఆదిత్య రూపాలు అన్నావు కదా? అంటే వేర్వేరు రూపాలలో ఉంటుంది అని అర్థం కదా?
అవును కానీ, ఒకే కుటుంబము వారిచ్చే శ్రాద్ధాల్లో కూడా ఆయా రూపాల్లో వచ్చే అవకాశం ఉంది కదా?
అదెలా, ఉదాహరణలతో చెప్పగలవా?
శిష్య:
ఉదాహరణకు, తండ్రిపోతే , కొడుకు పెట్టే శ్రాద్ధం లో వసురూపంలో వచ్చి తీసుకుంటుంది. ఆ కొడుకు కూడా పోతే, మనవడు ఇచ్చే శ్రాద్ధం లో ఆ తండ్రితో పాటు వచ్చి, రుద్ర రూపం లో తీసుకుంటుంది.. అంటే, వసురూపం తప్పి రుద్ర రూపం వచ్చి ఉంటుంది. అప్పుడు పోయిన ఆ కొడుకు వసురూపంతో వచ్చి తీసుకుంటాడు..
అవును, ఒక్కొక్క తరం వారు మరణిస్తుంటే, ఆ మొదట వసురూపం లో ఉన్న ఆత్మ, పైస్థాయికి వెళ్ళి వేరే రూపం సంతరించుకుంటుంది... ఇప్పుడు ఆ మనవడు కూడా పోయాడనుకో, అప్పుడు మొదట పోయిన తండ్రికి ఏ రూపం వస్తుంది?
ఆ మనవడు కూడా పోతే, తండ్రి ఆత్మకు ఆదిత్య రూపం వస్తుంది. మునిమనవడు ఇచ్చే శ్రాద్ధాన్ని ఆదిత్య రూపంలో వచ్చి తీసుకుంటుంది . అప్పుడు ఆ కొడుక్కు రుద్రరూపము, మనవడికి వసు రూపమూ వచ్చి ఉంటాయి.
గురువు:
అన్నీ సరిగ్గా చెప్పినావు. అంటే ఆత్మకు రూపాలు మారుతాయి అని కదా?
శిష్య:
అవును, ఆత్మకు కాలం గడిచేకొద్దీ, తమ వంశపు తర్వాతి తరాల వారు శ్రాద్ధాలు పెట్టే కొద్దీ వేర్వేరు రూపాలు వస్తుంటాయి. అట్లా, ఎన్నెన్నో కుటుంబాలలో వేర్వేరు జన్మలలో పుట్టిన ఒకే ఆత్మకు ఎందరెందరో శ్రాద్ధాలు పెడుతుంటారు. ఆ శ్రాద్ధాలు పెట్టేవారిలో ఎవరితో అనుబంధం కాని, ప్రేమానురాగాలు కాని ఎక్కువగా ఉంటాయి?
ముందే చెప్పినట్టు, ఎవరితోనూ సంబంధాలు ఉండకపోవచ్చు, లేదా, అందరితోనూ సమాన సంబంధం ఉండచ్చు. కాబట్టి, ఒక ఆత్మ శరీరాన్ని ఎప్పుడెప్పుడు, ఎన్నెన్నిసార్లు వదలినా, ఎవరితోనూ ప్రత్యేక సంబంధం కాని, అనుబంధం కాని ఉండదు అంటావు?
శిష్య:
అవును గురువుగారు.
గురువు:
ఎందుకలా?
శిష్య:
ఎందుకంటే, మనిషిగా ఉన్నపుడు శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ ఉంటాయి. పోయాక అవేవీ ఉండవు. మనోబుద్ధులు, శరీరమూ ఉంటేనే కదా బంధాలు?
గురువు:
సరిగ్గా చెప్పినావు. శరీరమూ, మనసు, బుద్ధి ఇవేవీ లేని ఆత్మ కు, ఎవరితోనూ ప్రత్యేకమైన బంధం లేని ఆత్మకు, ప్రపంచంలో మానవులు ఎవరెవరితో ఏయే బంధాలు పెట్టుకుంటే సమ్మతము?
ఆత్మకు ఈ బంధాలతోనే పని లేనప్పుడు, ఎవరు, ఎవరితో ఏ సంబంధము పెట్టుకుంటే ఏమి? అవి నిర్వికారంగా ఉంటాయి కదా, శ్రాద్ధం తీసుకోడానికి వచ్చే ఆత్మ, గత జన్మలో తన భార్య, లేదా భర్త ఇంకోవివాహం చేసుకుంటే నిర్వికారంగా ఉంటుంది కదా?
శిష్య:
అవును గురువుగారు. నిర్వికారంగా, అరిషడ్వర్గాలు అంటకుండా ఉండేదే కదా ఆత్మ?
గురువు:
తెలీదన్నావు మరి? నీ మొదటి ప్రశ్నకు నీవే సమాధానం ఇచ్చావు కదా? ఇలా ప్రశ్నలు తరచి తరచి వేసుకుంటే ప్రతిదానికీ సరైన సమాధానం దొరుకుతుంది.
శిష్య:
ఆ సమాధానం సరైనదేనా కాదా అనే అనుమానం వస్తే?
గురువు:
వస్తే ఏమి? ఇంకా తరచి తరచి ప్రశ్నలు వేసుకుంటే సరి.
శిష్య:
ధన్యవాదాలు గురువుగారు..
// శుభం //
No comments:
Post a Comment