Friday, October 4, 2024

 ఆత్మజ్ఞానం:
*ఆత్రేయగీత*

మొదటి భాగం 

అధ్యాయము - 2

“ఆత్మ - పరమాత్మ”

ఆత్మ వస్తువును ఇదియని వర్ణించుట దుర్లభము ఎందుకంటే అంతా అదే, అన్నీ అదే.

అదితిగా ఆరాధింపబడుతున్నది, ప్రాణశక్తిగా
విరాజిల్లుతున్నది, అన్ని భూతములయందు నెలకొనియున్నది ఆత్మ.

చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కునకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్నదే ఆత్మ.

దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే "ఆత్మ". ఈ ఆత్మనే బ్రహ్మము అని అంటారు.

స్వప్న(నిద్ర), సుషుప్తి(గాఢనిద్ర) అవస్థలలో ఏ చైతన్యం మన వెన్నంటివుండి, మరలా మనలను జాగృత్ (మెలుకువ) అవస్థలోకి గొనివస్తుందో, అదే “ఆత్మ”. ప్రతిరోజూ ప్రతిజీవుడు తనకు తెలియకుండానే సుషుప్తిలో ఆత్మానందాన్ని పొందుతూ వుంటాడు!

ఎలాగైతే నీరు, వాయువు ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతములను ఆవహించి, ఆయా రూపములను ధరిస్తుంది.

ఎలాగైతే సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందో, అలాగే ఆత్మ ఒక ఉపాధిని ఆవహించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది.

పాలలో నెయ్యి వున్నట్లు, గింజలో నూనె వున్నట్లు, కట్టెలో నిప్పు వున్నట్లు, ఈ సృష్టిలోని ప్రతి వస్తువులో చైతన్యం వుంటుంది. ఆ చైతన్యమే పరమాత్మ. దానిని వర్ణించడం అసాధ్యం, అనుభూతి ద్వారా మాత్రమే గ్రహించగలము.

ఆత్మ/బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది. ఈ ఏకత్వాన్ని జీవించియుండగానే అనుభూతి పొందినవాడు జ్ఞాని! అతడే యోగి.

స్వప్న, జాగ్రదావస్థలో కూడా ఏది విశ్వంతో
ముడిపడివుంటుందో అదే పరమాత్మ! అన్ని జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది! జీవభావాన్ని పొందినవాడు, జీవభావాన్ని కలిగించువాడు, కూడా పరమాత్మే!

జీవాత్మకి, పరమాత్మకి ఉపాధి (BODY) విషయంలో బేధం వున్నప్పటికీ, ఇరువురిలో చైతన్యాంశ (ఆత్మస్వరూపము) మాత్రం ఒక్కటే!

జీవుని శరీరం మెల్లగా క్షీణించిపోతూ, కొన్నాళ్ళకు నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా వుండి అవసరాన్ని ఇంకో శరీరాన్ని దాలుస్తుంది.

జీవాత్మకు ఈ దేహమే ఉపాధి! పరమాత్మకు ఈ
విశ్వమంతా ఉపాధే! జీవాత్మల ఏకమే పరమాత్మ!

తల్లి నిజం, తండ్రి నమ్మకం! ఆత్మ నిజం, జీవితం
నమ్మకం! ఆత్మే దేహరూపంలో జీవిస్తుంది! ఆత్మే ఆత్మను గ్రహిస్తుంది! వున్నది ఒక్కటే! అదే ఆత్మ!

స్వప్న, జాగ్రదావస్థలలో కూడా ఏదీ విశ్వంతో
ముడిపడివుంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవభావాన్ని పొందినవాడు, దానిని కలిగించువాడు కూడా పరమాత్మే.

ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఆకాశమున ఒక నిర్ణీతకక్ష్యలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. నిజానికి ఈ జగత్తు యొక్క తత్వమే పరమాత్మ.

ధనం, పరపతితో బయట వస్తువులను కొనగలము! కానీ ఆత్మవస్తువును కొనలేము! అది కేవలం ఆత్మజ్ఞానంతోనే సాధ్యపడుతుంది!

జీవుడు కష్టాల్లో వున్నప్పుడు ఆధ్యాత్మికం, సుఖాల్లో వున్నప్పుడు అహంకారాన్ని ఆశ్రయిస్తాడు! అదే మాయ! దీనికి విరుగుడే ఆత్మశోధన!

ప్రాపంచిక విషయములపై నీకు వైరాగ్యం
పెరుగుతున్నకొద్దీ నీ ఆత్మ నీకు దగ్గరవుతూ వుంటుంది! వైరాగ్యమే అసలైన రాజయోగం! క్షణికమైనవి కోల్పోతావు! శాశ్వతమైనవి పొందుతావు!

ఆత్మానుభూతి పొందడానికి వేషభాషలు,
కులమతవర్ణాలు, పాండిత్యము, ఆడంబరత, విశేష శాస్త్రపరిజ్ఞానంతో పనిలేదు! పరమాత్మ ప్రసాదించిన సహజజ్ఞానం సరిపోతుంది! కావలసిందల్లా విశ్వాసంతో కూడిన సాధన!

పరమాత్మే జీవాత్మగా ఒక ఉపాధిని కల్పించుకొని వ్యక్తమయ్యాడు. ఉపాధితో కూడిన జీవభావము నశించినపుడు జీవాత్మ పరమాత్మగా బాసిస్తాడు.

పరమాత్మ స్వరూపం సత్యం, శివం, సుందరం. అందుకే, సత్యమును తెలుసుకొనుటకు భక్తి, శివమును గ్రహించుటకు జ్ఞానము, సుందరమును అనుభవించుటకు వైరాగ్యము అవసరం!

ఆత్మానుభూతి పొందాలంటే, మధ్వాచార్యులంత భక్తిభావం! రామానుజాచార్యులంత నిష్కామకర్మభావం! | శంకరాచార్యులంత జ్ఞానభావం పొందాలి! సాధనతో ప్రతివ్యక్తికి ఇవి సాధ్యమే!

స్వప్న(నిద్ర), సుషుప్తి(గాఢనిద్ర) అవస్థలలో ఏ చైతన్యం మన వెన్నంటివుండి, మరల మనలను జాగృత్ (మెలుకువ) అవస్థలోకి గొనివస్తుందో, అదే “ఆత్మ”. ప్రతిరోజూ, ప్రతిజీవుడు తనకు తెలియకుండానే సుషుప్తిలో ఆత్మానందాన్ని పొందుతూ వుంటాడు!

అయమాత్మా బ్రహ్మ! జీవో బ్రహ్మైవ నా పరః! అహం బ్రహ్మాస్మి! అన్న ఉపనిషత్తుల వాక్యాలకు అర్ధమిదే!

ఎచ్చటనుండి జీవుడు వచ్చేడో, అక్కడికి తప్పక
| చేరుకోవలసిందే. పరమాత్మనుండి వ్యక్తమైన జీవాత్మ (జీవుడు) మళ్ళీ పరమాత్మను చేరుకోవాలి. అదే జీవాత్మ అసలు స్వరూపము. దానినే యోగము అన్నారు పెద్దలు.

పరమాత్మ మాయకి, మాటకి, మంత్రానికి, మర్మానికి లొంగడు! కేవలం సత్యానికి మాత్రమే లొంగుతాడు!

జీవాత్మ, పరమాత్మతో యోగం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు. జీవుని పరమాత్మతో చేర్చునదియే జ్ఞానము. ఇది నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే సిద్ధిస్తుంది.

జీవుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే “ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము, భగవద్దర్శనము”.

ఆత్మసాధనలో -

మొదటి దశ - నేను పరమాత్మ వేరు!

రెండవ దశ - అంతా పరమాత్మే!

మూడవ దశ - పరమాత్మ నాలోనే వున్నాడు!

నాల్గొవ దశ - నేనే పరమాత్మ!

ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మవస్తువును అనుభూతిపొంది బ్రహ్మానందాన్ని పొందుతాడు.    

No comments:

Post a Comment