*ఆత్రేయగీత*
మూడవ భాగం
"జ్ఞాన మంజరి" (వేదవిజ్ఞాన వీచికలు)
2వ భాగము.
పరిశోధన - శ్రీ శాస్త్రి ఆత్రేయ
అనేక జన్మలనుండి వెంటాడుతున్న పాపములను పరిహారంచేసుకొనే మార్గాన్ని కర్మయోగము ద్వారా మనకు బోధించేయి వేదములు. జ్ఞానయోగము ద్వారా ఆత్మజ్ఞానమును మానవాళికి పరిచయం చేసాయి ఉపనిషత్తులు.
పరబ్రహ్మమే శుద్ధచైతన్య పదార్థమని దానినుండే ఈ విశ్వమంతా ఆవిర్భవించిందన్న విజ్ఞానాన్ని మానవాళికి అందించేయి వేదములు. ఈ శుద్ధచైతన్య పదార్థము శాశ్వతమైనదని, సనాతనమైనదని, నిత్యసత్యమైనదని, కాలానికి అతీతమైనది నిర్ధారించి మనకు జ్ఞానబోధ చేసాయి వేదాంతములు.
ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా, పరావిద్య మరియు అపరావిద్య అనే రెండు విద్యలను అవగతం చేసుకోవాలని బ్రహ్మవిదులు పేర్కొన్నారు.
అపరావిద్యలో వేదాల్లోని మొదటి రెండు భాగాలైన సంహిత, బ్రాహ్మణాలు, వేదాంగములైన శిక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిషం వస్తాయి. వీటి సంవిధానమును బట్టీ అనేకానేక కర్మల ఆచరణ జరుగుతుంది. ఇవి వివిధ దేవతలను స్తుతించు ఋక్కులను (ఋగ్వేదము), యజ్ఞయాగాది కర్మలను (యజుర్వేదము), ఋగ్వేదంలోని ఋక్కులను సుస్వరంతో గానం చేయడం (సామవేదము), యజ్ఞ పద్ధతులు, ఆయురారోగ్య పద్ధతులు, అస్త్రశస్త్ర విషయములు (అధర్వవేదము) పేర్కొంటాయి. ఇవన్నీ అపరావిద్యను భోదిస్తాయి.
శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించేదే పరావిద్య. ఇది సనాతనమైన ఆత్మను గురించి తెలియజేస్తుంది. వేదాంతములైన (వేదముల చివరి భాగములు) అన్ని ఉపనిషత్తులు పరావిద్యను బోధిస్తాయి. దీనినే “ఉపనిషద్విద్య” అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తుల సారాంశాన్ని జిజ్ఞాసువులు, ముముక్షులు సులభంగా గ్రహించడానికి కేవలం నాలుగు మహావాక్యములుగా రూపకల్పనజేసి మనకు అందించాయి.
ఆ మహావాక్యాలు :
ప్రజ్ఞానం బ్రహ్మ (Supreme Knowledge is Brahma)
ఆహం బ్రహ్మాస్మి (I am Brahma)
తత్ త్వం అసి (That thou art)
అయం ఆత్మా బ్రహ్మ (This Atman is Brahma)
ప్రజ్ఞానం బ్రహ్మ:
ఋగ్వేద మహావాక్యముగా 'ప్రజ్ఞానం బ్రహ్మ'.
అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించింది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్యమండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు, ఆ తరువాత కూడా వుండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.
అహంబ్రహ్మాస్మి :
యజుర్వేద మహావాక్యముగా 'అహంబ్రహ్మస్మి'.
అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును చేకూర్చుకొని 'నేనే ఆత్మస్వరూపుడను' అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.
'తత్వమసి'
సామవేద మహావాక్యముగా 'తత్వమసి'.
చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము, ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినదని నిరూపణ చేయడం మనకు తెలిసినదే. 'ఏక మేవ అద్వితీయం', ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించిది. ఆత్మ, పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించింది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే “ఆత్మవు” అని వర్ణించింది.
అయమాత్మాబ్రహ్మ : నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యముగా 'అయమాత్మాబ్రహ్మ'. ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. గ్రహముల భ్రమణ శబ్దము ఓంకారమేనని ఇటీవల విజ్ఞాన ప్రయోగాలు ధ్రువపరిచాయి.
No comments:
Post a Comment