Tuesday, October 8, 2024

 "ఆత్రేయగీత"

మొదటి భాగం

అధ్యాయము - 5

“అహం - అహంకారం"

అహం అనేది శుద్ధ చైతన్యం! దానికి రూపం లేదు! అది ఒక శరీరాన్ని ఆవహించినప్పుడు అహంకారంగా మారుతుంది! అహం అనేది పరమాత్మ యొక్క తొలి స్పందన!

అహం అనేది ఆత్మ యొక్క మొదటి నామము!

ఆత్మే ప్రతి జీవుని హృదయం నుండి “నేను, నేను” అంటూ నిరంతరం స్పందిస్తుంది!

ఆత్మతో ఏకత్వం పొందిన “నేను” =  అహం!

దేహంతో ఏకత్వం పొందిన “నేను” = అహంకారం!

నేను, నేను అనేది “ఆత్మ”.

నేనిది, నేనది అని అనుకునేది “అహంకారం",

అహం అనేది ఎప్పుడూ వుండేది, ఎప్పటికీ మారనిది! అహంకారం అనేది శరీరంతో పాటూ వచ్చేది, శరీరంతో పాటూ పోయేది!

అహంకారం లేకుండా అహం వుండగలదు గానీ అహం లేకుండా అహంకారం వుండలేదు!

సంకల్ప, వికల్ప వికారాలతో కూడినది అహంకారం, ఎటువంటి వికారాలు లేనిది అహం! అహంకారం అసత్యమైనది, అహం సత్యమైనది!

జ్ఞానంగా అగుపిస్తూ అజ్ఞానంలోకి నెట్టివేస్తుంది అహంకారం! అజ్ఞానమైన అహంకారంతో సత్యమైన ఆత్మసాక్షాత్కారం పొందలేము!

అహంకారముయొక్క నిజస్థితిని గుర్తిస్తే, అది “అహం”గా మారిపోతుంది! అంటే అహంకారం లేని అహం బయటపడుతుంది! ఆత్మ “అహం, అహం” అంటూ అనుభవం లోకి వస్తుంది! అదే ఆత్మానుభూతి!

అహంకారమును విడచుటయే కర్మయోగికి ఆఖరిపాఠము, జ్ఞానయోగికి మొదటిపాఠము! అహంకారంతో చేసే కర్మలన్నీ ప్రతిబంధకములే!

నేను, నాది అన్నవాటిని జీవుడు మనసావాచా కర్మణా ఎప్పుడైతే త్యజిస్తాడో, అప్పుడే ఆత్మజ్ఞానం ఉదయించినట్లు లెక్క అంతవరకూ సంశయం, జంఝాటము తప్పదు!            

No comments:

Post a Comment