Tuesday, October 8, 2024

 మూల గ్రంథం : కపాల మోక్షం


 అనుభవం & రచన : శ్రీ పరమహంస పవనానంద


శీర్షిక : సూక్ష్మ శరీరంలో గల చక్ర స్థితుల వివరణ



... పన్నెండు యోగ చక్రాలు మొదట జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం జరగాలి. ఇందులో "విభేదనం" స్థితి అనేది సాధకుడు తన జీవ సమాధి స్థితిలోకి వెళ్లేముందు చేసుకుంటాడు. తర్వాత అతను జీవ సమాధి సిద్ధి పొందుతాడు. కానీ 13 యోగ చక్రాల జాగృతికి మూడు నెలల నుండి 12 సంవత్సరాలు ఒక్కొక్క చక్రం జాగృతి పడుతుంది. ఇది చక్రాల జాగృతి అయిన తర్వాతే  చక్రాల శుద్ధి ఆరంభమవుతుంది. మళ్లీ ఇది ఆరు నెలల నుండి 12 సంవత్సరముల వరకు ఒక్కొక్క చక్రం శుద్ధి అవ్వడానికి సమయం పడుతుంది.  చక్రాల శుద్ధి అయిన తర్వాతనే యోగ చక్రాలు ఆధీనం లోకి వస్తాయి. ఆధీనం అవ్వాలంటే పన్నెండు చక్రాలు 12 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత నాలుగవ స్థితి అనేది కేవలం తీవ్ర ధ్యాన స్థితిలో  సాధకుడు ఉంటే 48 నిమిషాల్లో విభేదనం చెంది సమాధి స్థితి పొందుతాడు. లేదంటే 21 రోజుల సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత జరిగే విభేదనం విధానానికి శరీరము తట్టుకోలేక అకాల శరీరత్యాగం అనగా సమాధి స్థితి పొంద కుండా మరణం పొంద వలసి వస్తుందని రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. అంటే ఈ లెక్కన చూస్తే యోగ చక్రాలు జాగృతి,శుద్ధి, ఆధీనముకు వరుసగా 36 నెలలు (12X3), 72 నెలలు(12X6),12సంవత్సరాలు పడుతుంది. మొత్తం కలిపి 36 నెలలు అంటే మూడు సంవత్సరములు, 72 నెలలు అంటే ఆరు సంవత్సరములు మరియు 12 సంవత్సరములు అనగా 3+6+ 12 = 21 సంవత్సరాలు పడుతుంది. అదే మీరు చక్రాల జాగృతి మరియు సిద్ది అలాగే ఆధీనానికి ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటే 36 సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరంలో ఒక చక్రం జాగృతి కాకుండా ఎక్కువ సంవత్సరాలు పడితే ఆ లెక్కన చూస్తే ఈ మానవ జన్మ సరిపోదు.ఒకవేళ మీ అదృష్టం బాగుండి గత జన్మలో మీరు ఈ సాధన స్థాయిలో ఒక దానిని పూర్తి చేసి తర్వాత స్థాయికి వస్తే అక్కడ నుండి చక్రాల స్థితి ప్రారంభం అవుతుందని తెలుసుకోండి. ఉదాహరణకు మీరు క్రింద జన్మలోనే చక్రాలు జాగృతి చేసుకుంటే ఈ జన్మలో చక్రాల శుద్ధి నుండి ప్రారంభం అవుతుంది. మీరు ఒక వేళ క్రిందటి జన్మ లోచక్రాల జాగృతి, చక్రాల శుద్ధి చేసుకుని ఉంటే ఈ జన్మలో మీ పరిస్థితి చక్ర ఆధీనంతో మీ సాధన స్థితి ఆరంభమవుతుంది. గత జన్మలో కేవలం కుండలినీ శక్తిని జాగృతం చేసుకుంటే ఈ జన్మలో చక్రాల జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం దాకా మీ ఈ సాధన స్థితి కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఈ స్థితిలో ఎక్కడైనా యోగ మాయాలో పడి వ్యామోహం చెందితే అంతటితో ఆ సాధన స్థితి వద్ద ఈ సాధన ఆగిపోయి మరుసటి జన్మలో ఎక్కడైతే ఆగిపోయారో అక్కడనుండి మీ సాధన స్థితి ఆరంభం అవుతుందని గ్రహించండి.
ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. అసలు మనం చక్ర జాగృతి లేదా చక్రశుద్ధి  లేదా చక్ర ఆధీనం లేదా చక్ర విభేదనంలో... ఎందులో ఉన్నామో ఎలా తెలుసుకోగలము ? ఇది తెలియాలంటే మీకు వచ్చే గురువులు బట్టి మీరు ఏ చక్ర స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ మీకు మంత్ర శాస్త్రానికి చెందిన గురువు వస్తే  మీరు తత్సంబంధ చక్ర జాగృతి లో ఉన్నట్లుగా, అదే మీకు ఏదైనా పుణ్యక్షేత్రంలో మీకు దీక్ష గురువుగా వస్తే మీరు చక్ర శుద్ధిలో ఉన్నట్లుగా,అదే మీకు మోక్ష క్షేత్రాలలో పరమ గురువు వస్తే మీరు చక్ర విభేదనంలో ఉన్నట్లుగా  భావించుకోవాలి. అలాగే మీకున్న నాలుగు రకాల గ్రంధులు అనగా బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి, హృదయ గ్రంధుల జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం కు ఒక్కొక్క దానికి మళ్లీ ఒక నెల నుండి ఆరు నెలలు పడుతుంది.వీటి కోసం విశ్వ గురు దత్తాత్రేయ స్వామి అలాగే జగద్గురువులు శ్రీకృష్ణుడు వస్తారు. ఒకవేళ మీకు తాము వచ్చినట్లుగా ప్రత్యక్ష దైవం అనుభవాలు ఇస్తే మీరు చక్ర గ్రంధులలో ఏదో ఒక గ్రంధిని జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం  చేసుకోటానికి ఈ జన్మలో ఉన్నారని గ్రహించండి.
అలాగే మనము అసలు ఏ చక్రం లో ఉన్నామో అని ఎలా తెలుస్తుంది అని  సందేహం రావచ్చు. దీనికి చిన్న పరిష్కార విధానం ఉన్నది. అదేమిటంటే మన శ్వాస సహాయంతో సాధకుడు తను ఏ చక్రానికి సంబంధించిన వ్యక్తో తెలుసుకోవచ్చు.ఇందుకు మనము సాధకుడు ముక్కు దగ్గర ప్రతిబింబం కనిపించే విధముగా పరిశుభ్రంగా చూసుకునే మంచి అద్దం ఉంచి అద్దం పైన సాధకుడు శ్వాసను గట్టిగా పీల్చి అద్దం మీద వదిలితే ఆ శ్వాస ఆవిరి అద్దం మీద పడి ఒక క్షణం పాటు ఒక ఆకారము ఏర్పడుతుంది.ఆకారాన్ని బట్టి సాధకుడు ఏక్కడ ఉన్నాడో తప్పకుండా  తెలుస్తోంది. చక్ర తత్వంలో అనగా మన శ్వాస ఆకారాలు వరుసగా 1. నాలుగు పలకల ఆకారం అయితే మూలాధార చక్రము 2.అర్థచంద్రాకారము ఐతే స్వాధిష్ఠాన చక్రము3.త్రికోణాకారం అయితే మణిపూరక చక్రము 4. వృత్తాకారం అయితే అనాహత చక్రము5. చుక్కలు చుక్కలు అయితే విశుద్ధి చక్రము 6. ఏ ఆకారం ఏర్పడకపోతే  ఆజ్ఞా చక్రము మనం ఇలా మూలాధారం నుండి  ఆజ్ఞా చక్రం వరకు ఏచక్ర తత్వంలో ఉన్నామో తెలుస్తుంది. ఇక పైన ఉండే సహస్ర, హృదయ చక్రాలు మనం తెలుసుకోలేం.

ఆయా గురువులు వస్తేగానీ మనకు వచ్చే గురువులు బట్టి జాగృతి, శుద్ధి, ఆధీనం విధానము తెలుసుకొని ఈ స్థితిలో మనలో ఏ చక్రమునకు తత్వంలో ఉన్నాయో మన శ్వాస ఆవిరిపట్టి మన శ్వాస కలిపి చూస్తే ఇట్టే అర్థం అవుతుంది కదా! కానీ ఈ రెండు రకాల విధి విధానాలు నేను కనిపెట్టి తెలుసుకునేసరికి మూడు సంవత్సరాల పైన పెట్టినది. నేను నా జిఙ్ఞాసి సాధన చేస్తున్నప్పుడు అసలే చక్రంలో ఉన్నామో తెలిసేది కాదు. అలాగే ఏ చక్ర స్థితి లో ఉన్నామో అర్థమయ్యేది కాదు. చెప్పటానికి వివరించడానికి ఎవరూ కూడా అందుబాటులో ఉండేవారు కాదు.
కేవలం యోగ శాస్త్రాలు వాటిమీద అవగాహన ఇచ్చేవిగానీ అనుభవం లో ఇవి పనికి వచ్చేవి కావు. మేమిద్దరం చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. అసలు సాధన ముందుకు వెళుతుందో లేదో అని తెలిసేది కాదు. ఏది యోగ మాయో లేదా ఏది సాధన శక్తియో ,ఏది ఏ దేవతకు చెందినదో...  అలాగే మాకు కనిపించే యంత్రాలు వాటి బీజాక్షరాలు మాకు అర్థమయ్యేవి కావు. అలా అయోమయ స్థితిలో మేము 12 సంవత్సరాలు మా కాలం వృధా చేసుకున్నాము. అలాంటి పొరపాటు మాలాంటి వారు చేయకూడదని యోగ శాస్త్ర గ్రంధాలు మరియు వివిధ రకాల యోగులు అనుభవాలు మరియు మా సాధన అనుభవాలు కలిపి ఏయే చక్రాలు, ఏ ఏ చక్రస్థితిలో ఏ ఏ యోగమాయలు,ఈ చక్ర దేవతలు, వాటి యోగ శక్తులు, యోగసిద్ధులు ,వాటి బీజాక్షర మంత్రాలు తెలుసుకొని చాలా స్పష్టమైన అవగాహనను నేనే స్వయంగా అనుభవించి వాటన్నిటినీ క్రోడీకరించి మా డైరీలలో  నింపి వేశాము. వాటి సారాంశం ఈ గ్రంథ రచన అన్నమాట. సాధన ఆరంభం నుండి అంతం వరకు అసలు ఏ ఏ స్థితులు వస్తాయి, ఏమాయా మర్మాలు వస్తాయి, వాటిని ఎలా దాటుకోవాలి వివరించడానికి ఈ గ్రంథ రచన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మేము ఇచ్చిన ఆయా చక్రాల అనుభవాల సమాచారాన్ని బట్టి   మీరు ఏ చక్రంలో అలాగే ఏ చక్ర స్థితిలో చక్ర యోగసిద్ధులు,ఏ  యోగ మాయా లో ఉన్నారో మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఈ గ్రంథము ఒకరకంగా మీకు మంత్ర, దీక్ష, సద్గురువువు, విశ్వ గురువు ,జగద్గురువు, పరమ గురువులు గా ఉండి మీరు ఏ ఏ గురువుల స్థితిలో అలాగే ఏ చక్ర స్థితిలో ఉన్నారో మీకు అన్ని విధాలుగా ఖచ్చితంగా నమ్మకంగా చెబుతుంది. ఎందుకంటే ఈ గ్రంథము ముగ్గురు  యోగులు అనగా పురాణపురుష లాహిరి మహాశయ, పరమహంస పవనానంద, వాసుదేవానంద యొక్క సాధనానుభవాల ఆధారముగా ఈ గ్రంథ రచన చేయడం జరిగినది. ఒక రకంగా చూస్తే ఈ గ్రంథం జ్ఞానగురువుగా ఉంటుందని గ్రహించండి.అంటే ఈ గ్రంథంలో యోగసాధనలో మోక్ష ప్రాప్తి సంబంధించి అన్ని విషయాలు ఇందులో చర్చించడం జరిగినది. గురువుల ప్రకారం చూస్తే మంత్ర గురువు నుండి చివరకు వచ్చే  ఆదిగురువు దాకా, అలాగే చక్రాలలో చూస్తే మొదటిది మూలాధారం నుండి హృదయ చక్రం దాకా, అలాగే చక్రాల్లో వచ్చే జాగృతి నుండి ఆధీనం దాకా మరియు ఈ చక్రం లో వచ్చే దేవతలలో ప్రారంభ దేవత అయిన గణపతి నుండి చివరి దేవత అయిన దీప దుర్గ వరకూ, చక్రం లో వచ్చే ప్రారంభం అయిన యోగమాయ అయిన కామమాయ నుండి చివరిదైన ఇష్టకోరిక మాయ దాకా అలాగే చక్రంలో వచ్చే యోగ శక్తులు ప్రారంభమైన ఖేచరి సిద్ది నుండి కపాలమోక్ష  సిద్ది వరకు ఇలా అన్ని విషయాలు సంపూర్తిగా ఇందులో చర్చించడం విశ్లేషించటం దానికి తగ్గ అనుభవాలు అనుభూతులు సాక్ష్యాధారాలతో చెప్పడం జరిగినది.
మాకు అలాగే మా చక్ర దేవతలు అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడినది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అనిమేము అనుకుంటుండగా మా 280 సంవత్సరముల సజీవ సమాధి చెందిన సద్గురువువైన కాశీ వాసి త్రైలింగ స్వామి వారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనమిచ్చి మీ ఈ సాధన అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్షజ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని ఆదేశం ఇవ్వటం,   మేము అప్పటిదాకా వ్రాసి ఉన్న 36 పుస్తక డైరీలు యొక్క సారాంశంగా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. అలాగే ఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్ట లింగము ధరించి అది ఇచ్చే ఇష్ట కామ్య సిద్ధితో ఎవరి యోగసాధన దేనివలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమై మోక్ష జ్ఞాన గ్రంథం వ్రాయాలని సంకల్పించుకుని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల మహాశక్తులు ఆపాదించటం జరిగినది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వడంతో మంత్ర శక్తి, చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వడంతో యంత్ర శక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతా శక్తులు, దైవిక వస్తువులు ఫోటోలు ఇవ్వటంతో దైవికశక్తి, గురువును గూర్చి చెప్పడంతో శక్తి పాతం, యోగుల అనుభవ వివరాలు చెప్పటంతో యోగశక్తి ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది .అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటో కి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీ తోడు ఉంటుంది.

మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.మీకు గురువు లభించకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మీకు ఇది మంత్ర గురువు నుండి  ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి ,మధుర భక్తి,,నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథము మీకు భోగ కోరిక తీర్చదు. కేవలం మోక్ష కాంక్షమాత్రమే తీర్చును.  అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండే వారికి మాత్రమే. వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకుని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది.అది ఏమిటంటే ఇక్కడ ఇచ్చిన దేవతలలో ఏదో ఒక దేవతను మీ ఇష్టదైవంగా భావించుకుని వారిని  అలాగే మీ ఇష్ట  గురువుగా భావించికోండి.వారి దగ్గర ఉన్న బీజాక్షర మంత్రము గురు మంత్రంగా భావించి, మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజూ క్రమం తప్పకుండా వేళతప్పకుండా వాయిదాలు వేసుకోకుండా 108 నుండి 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకుని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానంనందు స్థిరపడి  విశ్లేషణ శక్తి పెంపొందించుకుని వివేకబుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కార కర్తగా మారుతుంది. అంతెందుకు ఎలాంటి గురువులు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన  శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అందువలన గురువులు వచ్చినను రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు లేదా మీ ఇష్ట దేవతను గురువు గావించుకుని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవము గురువుగా గురువే దైవము గానుమారుతుంది .కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తాపడి తమ యోగసాధనను ముందుకి కొనసాగించలేక ఎలా ఆ మాయాను చేధించాలో అర్థం కాక నానా అవస్థలు పడటం నేను కళ్ళారా చూసాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చేయకూడదు. అది ఏమిటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్టభర్త/ఇష్ట భార్య గా భావించకూడదు. ఇది నా మనవి. ఈ వివరాలు మీకు మా ఆజ్ఞా చక్రానుభవాలలో తెలుస్తుంది!
ఇప్పుడు మన యోగ చక్రాలు ఉండే శరీర స్ధానాలు:

1. మూలాధార చక్రము - వెన్నుపూస క్రింద

2. స్వాధిష్ఠాన చక్రము - వెన్నుపూస అంతమయ్యే చోట

3. మణిపూరక చక్రము - బొడ్డు వెనుక భాగములో

4. అనాహత చక్రం - హృదయం వెనుక భాగములో

5. విశుద్ధ చక్రము -   కంఠము వెనుక

6. ఆజ్ఞా చక్రము - భ్రూమధ్యము

7. గుణ చక్రం -   భ్రూమధ్య చతుర్ధ గుహ

8. కర్మచక్రం -  భ్రూమధ్య చతుర్ధ గుహ

9. కాలచక్రం-  భ్రూమధ్య చతుర్ధ గుహ

10. బ్రహ్మ చక్రం- భ్రూమధ్య చతుర్ధ గుహ

11. సహస్రార చక్రం – మెదడు వెనుక భాగం

12. హృదయ చక్రం- హృదయము

13. బ్రహ్మరంధ్రము- మాడు పై మధ్యభాగము

...ఇప్పుడు మన యోగ చక్రాల ధాతువులు:

1. మూలాధార చక్రము -   ఎముక

2.స్వాధిష్ఠాన చక్రము - కొవ్వు

3.మణిపూరక చక్రము - కండరాలు

4.అనాహత చక్రం - రక్తం

5.విశుద్ధి చక్రము -   చర్మం

6.ఆజ్ఞా చక్రము - మజ్జ

7. గుణ చక్రం -   మూలుగు

8. కర్మచక్రం - మూలుగు

9. కాలచక్రం- మూలుగు

10. బ్రహ్మ చక్రం- మూలుగు

11. సహస్రార చక్రం – శుక్రం

12. హృదయ చక్రం- రక్త ప్రసరణ

13. బ్రహ్మరంధ్రము- జుట్టు

...ఇప్పుడు మన యోగ చక్రాల లక్షణాలు:

1. మూలాధార చక్రము -   జీవన పోరాటం

2.స్వాధిష్ఠాన చక్రము - విషయలోలత్వం

3.మణిపూరక చక్రము - అధికారం కోసం పాటుపడటం

4.అనాహత చక్రం - ఇతరుల కోసం పాటుపడటం

5.విశుద్ధి చక్రము -   ఇతరులపై ఆధారపడటం

6.ఆజ్ఞా చక్రము - పనులు అమలు చెయ్యడములో తొందరపాటు

7. గుణ చక్రం -   గుణాల మార్పులలో తొందరపాటు

8. కర్మచక్రం - కర్మలు చెయ్యడములో తొందరపాటు

9.కాలచక్రం - అనుకోవడములో తొందరపాటు

10. బ్రహ్మ చక్రం- ఆలోచనలలో తొందరపాటు

11.సహస్రార చక్రం – ఆధ్యాత్మికం

12.హృదయ చక్రం- ఇష్ట కోరిక

13.బ్రహ్మరంధ్రము- సహన శక్తి

...ఇప్పుడు మన యోగ చక్రాల శరీరాలు:

1. మూలాధార చక్రము -   స్థూల శరీరం

2.స్వాధిష్ఠాన చక్రము - స్థూలశరీరం

3.మణిపూరక చక్రము - స్థూల శరీరం

4.అనాహత చక్రం - స్థూల శరీరం

5.విశుద్ధి చక్రము -   స్థూల శరీరం

6.ఆజ్ఞా చక్రము - సూక్ష్మ శరీరం

7. గుణ చక్రం -   సూక్ష్మ శరీరం

8. కర్మచక్రం - సూక్ష్మ శరీరం

9.కాలచక్రం- సూక్ష్మ శరీరం

10. బ్రహ్మ చక్రం- సూక్ష్మ శరీరం

11.సహస్రార చక్రం – కారణ శరీరం

12.హృదయ చక్రం- సంకల్ప శరీరం

13.బ్రహ్మరంధ్రము- ఆకాశ శరీరం.          

No comments:

Post a Comment