Tuesday, October 1, 2024

 *నారాయణీయము* 
                   

*విష్ణు భక్తులందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకం నారాయణీయము. ఇది భాగవతంలో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనము. ఇందులో ఉన్న శ్లోకాలలో  బీజాక్షరాలూ, తత్వ సంబంధమైన రహస్యాలూ  కోకొల్లలుగా ఉన్నాయి.  ఈ పుస్తక పఠనం ఆధ్యాత్మిక ఉన్నతికే కాక ఆయురారోగ్యాలను శారీరక సౌఖ్యాన్ని కలుగజేస్తుందని  నమ్మి చాలామంది ఈ పుస్తక పఠనాన్ని నియమ పూర్వకంగా చేస్తుంటారు.* 

*ఈ పుస్తక రచన జరగడానికి పూర్వ రంగమైన  కథ ఒకటున్నది…*

*కేరళ దేశంలో గురువాయుర్ దగ్గర ‘నారాయణ భట్టతిరి (భట్టాత్రి)’ అనే విద్వాంసుడుండేవాడు. ఆయన నంబూద్రి బ్రాహ్మణులు. పురాణాలు వేద వేదాంగాలు సంస్కృత వ్యాకరణము బాగా చదువు కున్నారు.*

*ఒకసారి ఆయన గురువు గారికి వాత రోగం వచ్చింది. గురువు గారు చాలా తీవ్రంగా బాధ పడేవారు. ‘నారాయణ భట్టతిరి’ గారు గురువుగారి బాధను చూసి తల్లడిల్లి పోయాడు. తన యోగబలంతోను సంకల్పబలంతోను ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరంనుంచి తన శరీరంలోనికి మార్పు చేసుకున్నారు.* 

*తర్వాత తనకున్న యోగబలంతో ఆ వ్యాధిని నియంత్రిద్దామని  చూసారు. కాని అది వీలు పడలేదు. పైగా ఆ అనారోగ్యం తిరగబెట్టి ఈయనను పూర్తిగా మంచాన పడేసేటట్లు చేసింది. ఊరికే మంచాన పడ్డా పర్వాలేదు శరీరమంతా ఓర్చుకోలేనంతగా బాధ పెట్టడం మొదలు పెట్టింది.*

*వైద్యశాస్త్రంలో ఉన్న  ఔషధాలన్నీ ప్రయోగించినా ఆ బాధ తగ్గలేదు. బాధ భరించలేని స్థితికి వచ్చింది.*

*’తుంజత్ ఎళుతచ్చన్’ అనే మహా యోగి విష్ణు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చారట. భట్ట తిరిగారు తన కథంతా ఆయనకు చెప్పుకొని ‘ఈ వ్యాధిని గురువుగారి శరీరంనుంచి తన శరీరం లోకి తెచ్చుకునే దాకా యోగశక్తి బాగానే పనిచేసింది. తర్వాత నుంచి పని చేయడం మానేసింది.  ఎందుకు ఇలా జరిగింది, ప్రస్తుతం ఈ జబ్బు నాకు ఎలా తగ్గుతుంది. నేనేం పుచ్చుకోవాలి?’ అని అడిగారట.* 

*ఆయన నవ్వి… “భగవంతుని లీలలు అలాగే ఉంటాయి.  ఏదో ప్రయోజనం లేకుండా ఇలా జరగదు.  నీకు ఈ జబ్బు తగ్గాలంటే మొదట ‘చేప తో మొదలు పెట్టు తర్వాత తాబేలు!’ ఇలా చేస్తే గుణం ఇస్తుంది అక్కడి నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళు!” అన్నారట.* 

*ఆ సంభాషణ మొత్తమూ సంస్కృత భాషలోనే జరిగింది. ఆ ఉపదేశాన్ని ఇచ్చినాయన చాలా మితభాషి. మౌనంగా ఉండేవాడు. ఆ మాత్రం చెప్పడం కూడా ఎక్కువ. భట్టతిరిగారికి ముందు అర్ధం కాలేదు. చేపలు  కోడిగుడ్లు తినడం భట్టతిరి గారి ఆచార ప్రకారం నిషేధము. గురువు గారికి భట్టతిరి గారి ఆచారాలన్ని బాగా తెలుసు. మరి ఎందుకు ఇలా చెప్పారు. చాలా రోజులు అర్థం కాలేదట.*

*పాండిత్యం ఉంది కానీ ‘మాయ - వ్యామోహము’ మనసుని కప్పి ఉన్నందువల్ల ‘స్పష్టంగా చెప్పిన మాటలకు’ కూడా "మందు, పథ్యము, అనుపానము" మొదలైన అర్థాలనే భట్ట తిరిగారు అన్వయించుకున్నారు.* 

*తర్వాత చాలా రోజులు ఆలోచిస్తూ కూర్చున్నారట.  ఆయనకు తెలియని శ్లోకం కాదు. కానీ కొంతకాలానికి ఆయనకే  తట్టింది….*
*ఆ శ్లోకం ఇది….*

*శరీరే జర్జరీ భూతే*
*వ్యాధి గ్రేస్తే కళేబరే* 
*ఔషధం జాహ్నవీ తోయం*
*వైద్యో నారాయణో హరిః*

 *మనకు ఏదైనా జబ్బు రాగానే ‘అల్లోపతి,’ ‘హోమియోపతి’ చప్పున గుర్తొస్తాయి. మూడోది పై శ్లోకంలో చెప్పినట్టు ‘అల్లోపతి’ ‘హోమియోపతి’ వాటి కంటే ముఖ్య మైనది  ‘తిరుపతి’ ( దైవానుగ్రహం) అనేది కూడా ఒకటుంది.*

*ఎందుకో అది ఎవరికి అంతగా గుర్తు రాదు. భట్టతిరి గారి అదృష్టం కొద్దీ మన అదృష్టం కొద్దీ ఆయనకది ఎట్టకేలకు గుర్తు కొచ్చింది.* 

*ఆ గురువు గారు మత్స్యము తో ఆరంభించు  అన్న మాటకు "జబ్బు తగ్గడానికి, మందుగా  చేపలు తినమనే" అర్థం కాదని,       నీ పాండిత్యాన్ని ఉపయోగించి ‘మత్స్యావతారం’ దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణనను చెయ్యమని అంటే నారాయణ స్తుతి చెయ్యమని గురువుల అసలు సూచన అని అర్థమైంది.* 

*విషయం అర్థం అయిన తర్వాత హమ్మయ్య అనుకున్నారట. అప్పటినుంచి వైద్యుల దగ్గరికి పోకుండా భగవంతుడి వైపుకు తిరిగిపోయాడు.*

*భట్ట తిరిగారు తన 27వ ఏట కావ్యాన్ని మొదలుపెట్టి నూరు రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేసి నారాయణునికి అంకిత ఇచ్చారు. *

*కావ్యం మాత్రం కేవలం దశావతారాలు మాత్రమే కాకుండా వ్యాస భాగవత సారాన్నీ అందులోని  ఘట్టాలనీ క్లుప్తంగా  రాశారు.     కావ్యం చేపతో మొదలు కాదు కానీ దశావతారాల వర్ణన కూడా అందులో భాగవతంలో ఉన్నట్టుగానే వస్తుంది.*

*అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించి యోగమార్గంలో సిద్ధులు కూడా సంపాదించి మోక్ష మార్గాన్ని చూసుకోకుండా ఇంకా సంసారంలో ఉంటూ గురువుల కష్టాలు; తన శారీరక కష్టాలు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్న భట్ట తిరిగారికి భగవంతుడు మార్గాన్ని, లక్ష్యాన్ని నిర్ణయించడానికే తన లీలను చూపించాడు.* 

*పైన భగవంతుని నిర్ణయము ఇక్కడ గురువు గారి సూచన రెండూ పనిచేసి పండితుడు భక్తుడయ్యాడు.* 

*పాండిత్యం అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కవిత్వం గా పరిణమించింది. భక్తుల కష్టాలు తీర్చడానికి ‘నారాయణీయము’ అనే కావ్యం రూపు దిద్దుకున్నది.*

*ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివర్లో ‘నా వ్యాధిని తగ్గించు’ అనే మాట తప్పకుండా ఉంటుంది.* 

*కావ్యం మొదలుపెట్టగానే భట్టతిరి గారి శారీరక బాధ కొద్దికొద్దిగా తగ్గుతూ కావ్యం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా ఉపశమించింది.*

*తర్వాత ఆయన దాదాపు 96 సంవత్సరాల వయసు వరకు జీవించి చాలా గ్రంథాలు రాసి భగవంతునిలో లీనమైనారు.*

*’భట్టతిరి వంటి జ్ఞాని, మహా భక్తుడు మోక్షాన్ని కోరకుండా ప్రధానంగా ఆరోగ్యాన్ని ఎందుకు కోరుకున్నాడు’ అనే ప్రశ్నకు జవాబు నాలుగో దశకంలో లభిస్తుంది… ‘శారీరకమైన ఆరోగ్యాన్ని మానవులు ఎందుకు కోరుకోవాలో పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో కూడా అవే కారణాలను చూపిస్తారు.’* 

*’మోక్ష పురుషార్ధంతో పాటు మిగతా ఏ పురుషార్ధం సాధించుకోవాలన్నా శరీరం ఉండాలి.’     మోక్షం కోసం ప్రయత్నించడానికి కూడా శరీరమే ప్రధానము. అది పోతే మళ్లీ ఇంకో జన్మ ఎత్తాలి. అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాను అంటాడు.*
.        

No comments:

Post a Comment