Friday, October 4, 2024

 శ్లోకానికి మంత్రానికీ తేడా ఏమిటి?
మననాత్ త్రాయతే ఇతి మంత్రః. గురుముఖంగా పొందేది మంత్రం.

కొన్ని లక్షల జపం చేసి శిష్యుడి శక్తికి తగినదైతేనే మంత్రాన్ని ఇస్తాడు గురువు. మంత్రం కొన్ని బీజాక్షరాల సంపుటీకరణం. దాని అర్ధం తెలియవలసిన అగత్యం లేదు.

అర్ధం లేని చదువు వ్యర్థం —అనేది మంత్రానికి పట్టదు.

మంత్రాధీనం తు దైవతం

డాక్టర్ సిఫార్సు చేసిన మందు వేసుకుంటాం.. అందులో ఏ కెమికల్సు ఉన్నాయో మనకు తెలియక పోయినా అది పనిచేస్తుంది గదా! పేషెంట్ బలాన్ని బట్టి మందు ఇచ్చినట్టే -శిష్యుడి సామర్థ్యం, ధరించగలిగిన శక్తిని బట్టీ గురువు మంత్రం ఇస్తాడు.

శ్లోకం చెప్పడానికి ఛందస్సులో పరిజ్ఞానం ఉంటే చాలు.

ఎవరైనా చెప్పవచ్చు.

మంత్రం ఊహాశక్తితో చెప్పేది కాదు.

అంతర్ముఖులైన ఋషులకైన దర్శనాలవి .

మంత్రాలు కొన్ని కుటుంబాలలో ఉంటాయి. సేవించుకుంటూ ఉంటే కొన్ని తరాలపాటు ఆ మంత్రాధిష్ఠాన దేవత అనుగ్రహిస్తూ ఉంటుంది. పూర్వులు చేసిన ఉపాసన బలం అది. కుటుంబంలో ఉండాలి గాబట్టి తండ్రి కొడుక్కు ఆ ఇంటి విద్యను తప్పక ఇవ్వాలి. భరించే యోగ్యత లేనప్పుడు ఇవ్వకూడదు.

యోగ్యులకెంతమందికైనా ఇవ్వచ్చు . ఉపదేశకుడి ఉపాసనాబలం శిష్యుడి మంత్రసిద్ధికి మూలమౌతుంది. అందుచేత —జపానికి ముందు మంత్రమిచ్చిన గురువును, ఆ మంత్రద్రష్టయైన ఋషినీ స్మరించడం తప్పనిసరి..

కామ్యకర్మలకు నియమాలెక్కువ.

సమయమూ, జపసంఖ్య, ఆహారాది నియమాలూ పాటించాలి.

నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి—--మంచి పని చేసేవాడికెన్నడూ అమంగళం జరగదు నాయనా! అని భగవద్గీత.. కాబట్టి భయపడబనిలేదు గానీ త్వరగా సిద్ధి కలగాలంటే నియమాలు తప్పక పాటించాలి. మంత్రార్థం తెలియాలంటే కష్టం. లౌకిక సంస్కృత భాషకూ, మంత్రభాషకూ చాలా వ్యత్యాసం.

శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము —అనే షడంగాలు అధ్యయనం చేసినపుడే కొంతైనా మంత్రార్థం తెలుస్తుంది.

మంత్రం బీజాక్షరాల సంపుటి. అది శ్లోక రూపంలోగూడా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం 108 శ్లోకాలున్న మహా మంత్రం. శివుడు పార్వతికి ఉపదేశించింది గాబట్టి మంత్రం అయింది.

పుస్తకాలలో మంత్రాలు చూచి నేర్చుకోవడం కష్టంతో కూడిన ప్రయత్నం.

బాగా తెలిసిన దారిలో పోవడం చాలా తేలిక.

కొత్తదారిలో అడుగడుగునా జంకు కొంకూ తప్పవు.

నమ్మకంగా ఎవరైనా తీసుకుపోగలరనుకొంటే —కళ్ళు మూసుకొనైనా నడిచిపోవచ్చు.

No comments:

Post a Comment