Tuesday, October 29, 2024

 *నిజమైన గురువు అంటే ఎవరు?*     
              
 *అనుకరించదగిన జీవనశైలి* 

```
నేను నా పోస్ట్‌ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఉపాధ్యాయునిగా పనిచేయడానికి బెంగాల్‌ లోని ‘ఆస్‌ గ్రామ్’‌ కు తిరిగి వెళ్లాను. 
పెద్ద పట్టణాల్లోని పాఠశాలలలో ఎక్కువ జీతంతో అవకాశాలు ఉన్నా, నాకు మాత్రం, మా గ్రామంలోని పాఠశాల ఇచ్చే 169 రూపాయలు చాలా విలువైనవి. మా గ్రామంలోని విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుని అవసరం చాలా ఉంది. అందుకే వారికి బోధించాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను.

మా స్కూల్లో నేను 39 ఏళ్లు పాఠాలు చెప్పి 60 ఏళ్లకు రిటైరయ్యాను.. కానీ నా మనసు చాలా వ్యాకులతతో ఉంది, రిటైరవ్వడం ఇష్టం లేక, ‘ఇప్పుడేం చేయాలి?’ అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. 
కొన్ని రోజుల తర్వాత నా ప్రశ్నకు సమాధానం దొరికింది..

ఒకరోజు ఉదయం, 6:30 గంటల ప్రాంతంలో, ముగ్గురు యువతులు మా ఇంటికి వచ్చారు. పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడిని చూడటానికి వారు 23 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చారని వారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను! వారు ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉన్న గిరిజన యువతులు. ముకుళిత హస్తాలతో, "మాస్టర్ గారూ, మీరు మాకు చదువు నేర్పిస్తారా?" అని అడిగిన వెంటనే నేను అంగీకరించి, "నేను మీకు నేర్పించగలను, కానీ మీరు సంవత్సరం మొత్తం నా పాఠశాల ఫీజు చెల్లించాలి - చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అనడిగాను.
దానికి వాళ్ళు, “అలాగే మాస్టార్ గారు, డబ్బు ఎలాగోలా సర్దుబాటు చేస్తాం” అన్నారు.

అప్పుడు నేను, “సరే, నా ఫీజు సంవత్సరానికి 1 రూపాయి” అన్నాను. వారు చాలా సంతోషించారు, వారు నన్ను కౌగిలించుకొని, “మేము మీకు 
1 రూపాయి, 4 చాక్లెట్లు కూడా చెల్లిస్తాం", అన్నారు.

నేను ఉప్పొంగిపోయాను... జీవించడానికి నాకు కొత్త కారణం దొరికినట్లు అనిపించింది! వారు వెళ్లిపోయిన తర్వాత, బట్టలు మార్చుకుని నేరుగా నా పాఠశాలకు  వెళ్లి ఆ గిరిజన బాలికలకు బోధించడానికి నాకు ఒక తరగతి గదిని ఇవ్వమని ప్రిన్సిపాల్‌ ని అభ్యర్థించాను. కానీ ప్రిన్సిపాల్ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు. 
అయితే, నేను ఇప్పుడు ఆగడానికి తయారుగా లేను. 39 ఏళ్ల బోధన తర్వాత కూడా, ఇంకా బోధించడానికి నాకు చాలా శక్తి మిగిలిఉంది. కాబట్టి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నేను నా ఇంటి వరండాను శుభ్రం చేసి, అక్కడే బోధన ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను.

అది 2004లో జరిగింది ... 
నా పాఠశాల ఆ ముగ్గురు బాలికలతో ప్రారంభమైంది. నేడు సంవత్సరానికి 350 మంది విద్యార్థులు ఉంటున్నారు, వారిలో ఎక్కువ మంది గిరిజన యువతులే. నా విద్యార్థుల అభ్యర్థన మేరకు, నా ఫీజుకు ఇంకో రూపాయి కలిపాను.

నా ఉదయం ఇప్పటికీ 6 గంటలకు గ్రామం చుట్టూ నడవడం ద్వారా ప్రారంభమవుతుంది, ఆపై నా వద్దకు వచ్చే  విద్యార్థులకు తలుపులు తెరుస్తాను - కొంతమంది అమ్మాయిలు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడచి వస్తారు. ఆ గిరిజన బాలికల నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉందని నేను ఎప్పుడూ భావిస్తాను.

గడిచిన సంవత్సరాలలో, నా విద్యార్థులు ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు, IT నిపుణులు అయ్యారు– వారు ఎల్లప్పుడూ నాకు ఫోన్ చేసి, వారి విజయానికి సంబంధించిన శుభవార్తలను అందిస్తారు. ఎప్పటిలాగే, నాకు కొన్ని చాక్లెట్లు తీసుకురమ్మని నేను వారిని అడుగుతాను. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు, నా ఫోన్ మోగడం ఆగలేదు; గ్రామం మొత్తం ఆ ఆనందాన్ని నాతో జరుపుకుంది - చాలా సంతోషకరమైన రోజు అయినా కానీ నేను నా విద్యార్థులను ఆ రోజు కూడా చదువు మానడానికి అనుమతించలేదు.

నా పాఠశాల తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి. నా పాఠశాలను సందర్శించడానికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మాగ్రామం చాలా అందంగా ఉంటుంది, నా విద్యార్థులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది – మనమందరం వారి నుండి చాలా నేర్చుకోగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఇది నా కథ- 
నేను బెంగాల్‌కు చెందిన ఒక సాధారణ ఉపాధ్యాయుడిని. నేను టీ, సాయంత్రపు కునుకులను ఆస్వాదిస్తాను. నా జీవితంలోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. నన్ను అందరూ, "మాస్టార్ మోషాయ్' అని పిలుస్తారు.  నా చివరి శ్వాస వరకు నేను బోధించాలనుకుంటున్నాను. నేను అందుకోసమే ఈ లోకానికి పంపబడ్డాను.


ప్రతిబింబం:

ఇది ఒక ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన, నిస్వార్థ గురువైన శ్రీ సుజిత్ చటోపాధ్యాయ కథ. 
77 ఏళ్ల ఈ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు 'మాస్టర్ మోషాయ్' గా ప్రసిద్ధి చెందారు, ముఖ్యంగా గిరిజన విద్యార్థులలో విద్యను వ్యాప్తి చేయడానికి దశాబ్దాలుగా, అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2021 నవంబర్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదర్శ పౌరులను తయారు చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అసాధారణమైన సమగ్రత, సహానుభూతి దేశం యొక్క హృదయపూర్వక వందనానికి అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందటానికి అర్హతపొందే విధంగా కృషి చేసిన ఆయన భారతదేశపు అజ్ఞాత వీరులలో ఒకరు.
ఎలాంటి స్వార్థం, ఆశలు లేకుండా తమ జీవితాన్ని ఇతరులకు అంకితం చేసి, సమాజానికి సేవ చేసిన మహోన్నత వీరులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచాన్ని మరింత దయతో, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయనలాంటి వ్యక్తులు నేడు అవసరం. మనం
చేయవలసిందల్లా వారిని గుర్తించడమే! అంతేకాదు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వెతికితే, మన కళ్లెదురుగానే వాళ్ళు కనిపిస్తారు.```

          ♾️♾️ ♾️ ♾️♾️

 *నిజమైన గురువు తన శిష్యుడిని ఎప్పుడూ ఏమీ అడగడు. నిజానికి, గురువులు మానవాళికి సేవ చేయడం కోసమే ఉన్నారు. వారు తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి మాత్రమే ఉంటారు.* 
 *-దాజీ*.          

No comments:

Post a Comment