Monday, October 21, 2024

 *నేడు మానవుని అశాంతికి కారణం మితి మీరిన కోరికలు, ఆశలే!!* మానవుని కోరికలకు అంతులేదు. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. కనుక కోరికలలో కెల్లా ఉత్తమమైన కోరికను అంటే కోరికలు లేని స్థితిని కోరుకోవాలి. అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది. భగవంతుడే కావాలి అని మనము కోరుకుంటే మరి దేనినీ కోరుకోవలసిన అవసరము లేదు. దైవాన్ని కోరుకున్నప్పుడు ఇంక కోరేందుకు ఏమీ ఉండదు. ఆ పరమాత్మ మనతో ఉంటే ప్రపంచమంతా మనతో ఉంటుంది. లేకపోతే యావత్ప్రపంచాన్ని మనం జయించగలిగినా జీవితం శూన్యంగా, నిరర్థకంగానే ఉంటుంది. శాంతి ఉండదు. ఆనందం ఉండదు. 

సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలను గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. 

ధన కనక వస్తు వాహనాదులకు లోటులేని వారెందరో మన చుట్టూ ఉన్నారు. కానీ నిరంతరం ఏదో ఒక వెలితితో బాధ పడుతూనే ఉన్నారు. కారణం మనశ్శాంతి లేకయే!  

భగవంతుని విడచి బాహ్య ప్రపంచానికి ఆకర్షితులయ్యే వారికి మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? నిత్యమైన సత్యమును వదిలేసి అనిత్యములు, అసత్యముల వెంటపడితే ఆనంద, సంతోషములు వచ్చునా!!?              అలాగే,
దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవడం, క్రోధంగా ఉండక పోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనం, పూజాదులు కొనసాగించడం ఇవన్నీ మానవుడు ఆచరించవలసిన ధర్మములని శాస్త్రాలు చెబుతున్నాయి.

తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే. కానీ కలియుగంలో ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అయితే వీటన్నింటికంటే సర్వాధిక ధర్మమేమంటే అర్థించక పోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనీయడం... ఇటువంటివి సర్వాధికమైన ధర్మములు. వీటిని అందరూ ఆచరించవచ్చును.

పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోక నాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడు.

అందుకే పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు. కనుకనే మనకు ఉన్నంతలో పరోపకారము, సేవలు చేస్తూ ఉండాలి.             

No comments:

Post a Comment