Monday, October 21, 2024

 *ధేనుకాసుర వధ*
                 ➖
   …చాగంటి గారి ప్రవచనం నుండి. 

*ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావనం లోకి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజూ ఆ ఆవులను, దూడలను తీసుకువెళ్ళి కాపాడే ప్రయత్నంలో ఉన్నారు.* 

మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగేరోజున     కథను బలరామునితో అనుసంధానం చేశారు.

కృష్ణభగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. ‘అన్నయ్యా, ఈవేళ చెట్లన్నీ వంగి వున్నాయి. మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్యా, మీరు మహాపురుషులు’ అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే, బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు.*

*ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొన్ని ఆవులు కనపడలేదు.* 

*వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు.* 

*ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది?   పిల్లలందరూ పరుగుపరుగున వచ్చి ఒకమాట చెప్పారు. ‘బలరామా, ఇక్కడకు దగ్గరలో తాటి తోట ఒకటి ఉన్నది. అక్కడి తాటిచెట్లకు పెద్దపెద్ద తాటిపళ్ళు ఉన్నాయి. అవి ముగ్గి చెట్టునుండి క్రిందపడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. కానీ అక్కడ ధేనుకాసురుడని పిలువబడే గార్దభాసురుడు ఉండేవాడు. అతడు గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. కానీ అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు. ఎవ్వరినీ ఆ తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరయినా ఆ తాటిపండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే యిది గబగబా వెళ్ళి వెనకకాళ్ళు ఎత్తి అవతల వాడి గుండెల మీద తన్ని       వాడు మరణించేటట్లు చేస్తుంది.* 

*కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈమాట చెప్పి గోపబాలలు  అన్నారు  మాకు ఎప్పటినుంచో ఆ తాటిపళ్ళు తినాలని ఉంది. బలరామా, మాకు ఆ తాటిపళ్ళు తినే అదృష్టమును కల్పించవా’ అని అడిగారు.*

*అపుడు బలరాముడు ‘మీకేమీ భయం లేదు. నా వెంట రండి’ అన్నాడు.* 

*బలరాముడు అపారమయిన బలశాలి. గోపబాలురనందరినీ ఆ తాటి వనంలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల క్రింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు.* 

*దానిని గార్దాభాసురుడు చూశాడు. ‘ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు’ అని వాడు వెంటనే గాడిదరూపంలో వచ్చి బలరాముడి గుండెలమీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు.* 

*అపుడు బలరాముడు గార్దభాసురుని రెండుకాళ్ళు ఒడిసిపట్టుకుని వాడిని గిరగిర త్రిప్పి ఒక తాటిచెట్టు మీదికి విసిరాడు.* 

*అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటిచెట్టు వెళ్ళి ఇంకొక తాటిచెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటిచెట్టు వెళ్ళి మరొక తాటిచెట్టు మీద పడింది. పెద్దగాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడి తాటిచెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు.* 

*గాడిద రూపంలో ఉన్న  రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలు ఉన్నాయి. ‘మా నాన్నగారిని ఎవరో సంహరించారు’ అని పిల్ల గాడిదలు అన్నీ కృష్ణుడు మీదకి, బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలీలగా చంపివేశాడు.*

*పుట్టుకతో మీ అంతటమీరు ప్రయత్నం చేయకుండా అలవడే గుణం ఒకటి ఉంటుంది.* 

*దాని పేరే లోభము. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. కానీ తను కాయించిన కాయలలో ఒక్క కాయనయినా మామిడి చెట్టు తినదు.* 

*నది రాత్రనక, పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తోందని నది తన నీళ్ళు తాను ఒక్క చుక్క త్రాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారుచేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవుదగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు.* 

*ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుష్యుడు ఒక్కడే.*

*పశువులు, పక్షులు, చెట్లు అన్నీ యితరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటికి దాచుకోవడం చేతకాదు.* 

*కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మీరు ప్రయత్నపూర్వకంగా  నిరసించకపోతే దానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనస్సులో కలగాలి.*

*చితి ఒక్కసారి కాలుస్తుంది. చింత నిరంతరం కాలుస్తుంది. అది ఎక్కువయిపోకుండా ఉంటాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి. *

*అలా తిరగకపోతే మనస్సుకి ఆలంబనమును మనస్సు వెతికేసుకుంటుంది. ఎప్పుడూ ఐశ్వర్యం గురించో, పిల్ల గురించో, మరియొక దాని గురించో ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. దానివలన ఎప్పుడూ బాదే. ఇటువంటి లోభ గుణం చేత నరకము వస్తుంది.*
*భార్యా బిడ్డలని పోషించడానికి ధనార్జన చెయ్యాలి. దానిలో కొంత నిలవ చేయాలి.   దానిని శాస్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు.* 

*మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య, పిల్లలు అందరూ పంచుకుంటారు. కానీ పాప ఫలమును మాత్రం ఎవరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి.* 

*అటువంటి పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్య కార్యములను చేయాలి.* 

*ప్రయత్నపూర్వకంగా అర్హులయిన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారముగా దానం చేయాలి. ఈ లోభ గుణమును విరుచుకోవడం మీ అంతటా మీకు రాదు. మహా పురుషుల జీవితములను ప్రయత్నపూర్వకంగా చూడాలి. పదిమందికి సేవచేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనుకంజ వేయకూడదు.* 

*అందుకే కృష్ణ భగవానుడు బలరాముడిని స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితములను తెలుసుకుంటే మీలోవున్న లోభగుణము విరిగిపోతుంది. పదిమంది కోసం బ్రతకడం అలవాటవుతుంది 

No comments:

Post a Comment