Sunday, October 6, 2024

****కుండలిని సిద్ధ మహా యోగము🌹: స్వరశాస్త్రం - అర్థనారీశ్వర తత్వం - మానవ జీవన విధానం - వైజ్ఞానిక విశ్లేషణ :

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
స్వరశాస్త్రం - అర్థనారీశ్వర తత్వం - మానవ జీవన విధానం - వైజ్ఞానిక విశ్లేషణ :


📚✍️ సంకలనం : భట్టాచార్య



  మన భారతీయ శాస్త్రాలలో స్వర శాస్త్రం అనే శాస్త్రం ఉంది. చాలా మందికి స్వరశాస్త్రం అంటే సంగీత శాస్త్రం అనే అపోహ కూడా ఉంది. స్వర శాస్త్రం అంటే మనం పీల్చే గాలి మన శరీరంలో ఏఏ నాడుల మీద ఎలా పని చేస్తుందో తెలిపే శాస్త్రం. ఈ శాస్త్రం అంతా సాంకేతిక పదాలతో నిగూఢంగా ఉంటుంది. స్వర సాధన అనుభవాల పుట్ట. తంత్ర సాధనలో స్వరసాధన చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. తంత్ర  సాధకులు నిగూఢమైన పేర్లతో అవయవాలను పోల్చారు. మనం పీల్చేగాలిని బట్టి పేర్లు పెట్టారు. కుడి వైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శివ, సూర్య, పగలు, యమున, పింగళ అని, ఎడమవైపు నాడి యందు శ్వాస ప్రవహిస్తుంటే శక్తి, చంద్ర, రాత్రి, గంగ అనే పేర్లు పెట్టారు. వీటిలో గాక ముక్కు రెండు రంద్రాలనుండి సమానంగా శ్వాస నడుస్తుంటే అగ్ని, సంధ్య, సరస్వతి, సుషుమ్న అని పెర్లు పెట్టారు. ఇది అతి ప్రాచీన రహస్య విజ్ఞానం. గురువు ద్వారా శిష్యులు నేర్చుకునే విజ్ఞానం. ఈ సాధనద్వారా సాధకులు అనేక అతీత శక్తులను పొందుతారని శాస్త్ర వచనం మరియూ ఆప్త వాక్యం. ఈ శాస్త్రాన్ని అభ్యసించిన వారు మన తెలుగు నేలలో ముఖ్యంగా వేమన, పోతులూరి వీరబ్రహ్మం గారు, ఇంకా అనేక మంది పేరు సిద్ధులు. ఇంకా చాలామంది ఈ స్వరశాస్త్రాన్ని అభ్యసించిన మహానుభావులు తెలుగునాట ఉన్నారు. అనేక గ్రంథాలు తెలుగులో ఈ శాస్త్రం మీద వెలువడ్డాయి. కానీ మన దురదృష్టం కొద్ది అవి నేడు అలభ్యాలు. కొన్ని దుర్మార్గుల దండయాత్రలలో కాలి బూడిదయ్యాయి. కొన్ని ప్రజల నిర్లక్ష్యం వలన పోయాయి.

   ఈ శాస్త్రానికి మూల పురుషుడు అర్థనారీశ్వరుడు. నేటి సైన్సు పరిభాషలో చెప్పాలంటే బ్రెయిన్ లో కుడి ఎడమ మెదడులు (Hemispheres) ఉన్నాయి. మస్తిష్కం మెదడులోని అన్నిభాగాలకన్నా పెద్దది. పుర్రెలో పైభాగమంతటినీ ఆక్రమించి ఉంటుంది. దీన్ని దైర్ఘ్య విదరము
(Superior Longitudinal fissure) అనే రెండు అర్థచంద్రాకార భాగాలుగా విభాజితమై ఉంటుంది. ఈ భాగాలను మెదడు గోళార్థాలు (Cerebral hemispheres) అంటారు. యోగులు ఈ భాగాలను సూర్య చంద్రులని అంటారు. న్యూరాలజిస్టులు ఆడ, మగ చర్యలకు ఎడమ, కుడి బ్రెయిన్ కు గల సమ సంబంధాన్ని తెలుసుకున్నారు. ఆడవారు ఎక్కువ ఎడమ గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు. మగవారు ఎక్కువ కుడివైపు గోళార్థం పై ప్రభావం కలిగి ఉంటారు. బ్రెయిన్లో గల సెక్స్ హార్మోన్లు తమ తమ తేడాకు కారణంగా సైన్స్ నిర్థారణ చేస్తుంది. దేహ ధర్మాలలో ఏ తేడా ఉన్నప్పటికీ, ఇడా తత్వం స్త్రీ ప్రధానంగాను, పింగళా తత్వం పురుష ప్రధానంగాను ఉన్నవి. ఈ తత్వమే అర్థనారీశ్వర తత్వం. ఒక మనిషిలో ఉండే ధనాత్మక ఋణాత్మక తత్వాల కలయికే అర్థనారీశ్వర తత్వం. ఈ ప్రాతిపదికనే అర్థనారీశ్వర తత్వం ప్రతిపాదింప బడింది. పరమేశ్వరుడు కుడివైపు పురుషతత్వానికి (పింగళ), ఎడమవైపు పార్వతి, స్త్రీతత్త్వానికి (ఇడా)ప్రతిబింబాలు.

       పతంజలి మహర్షి "యోగః చిత్త వృత్తి నిరోధకః" అంటాడు. "స్వర యోగం", పై దానికి భిన్నమైన ఉచ్ఛ్వాస-నిశ్వాసల సంయమం ద్వారా సాధ్య పడుతుంది. స్వర యోగంలో "నాడీ ప్రసారం" ప్రాధాన్యత వహిస్తుంది. మనస్సును,శరీరాన్ని అదుపు చేయడానికి, రోగం నుండి విముక్తి పొందడానికి , నాడీ మండలాన్ని క్రమ బద్ధం చెయ్యాలి. మూలాధారం నుండి సహస్రారం దాకా కుండలినీ శక్తిని నడిపించే ప్రక్రియ స్వర యోగంలో కూడా ఉన్నదే........

ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి .....అనేది యోగశాస్త్రం నిర్ధేశించింది.     ఆయుర్వేదంలో వ్యతిరిక్త ఆహార పదార్థాల పట్టిక చెప్పబడింది.  వ్యతిరిక్తమైన ఆహార వస్తువులు తీసుకుంటే ఆహారం విషంగా మారుతుంది.  స్వర శాస్త్రం, ఆహారాన్ని రెండు భాగాలుగా వర్గీకరించింది.  అది స్వరం నడకను బట్టి చెప్పబడింది.  

సూర్య స్వరం(అంటే కుడి ముక్కు రంధ్రంలో శ్వాస నడిచేటపుడు) నడిచేటప్పుడు వేడి పదార్దాలు, నూనె పదార్థాలు, మసాలా పదార్దాలు తినకూడదు. ఈ పదార్దాలు చంద్రస్వరం నడిచేటప్పుడు తినాలి.  అలాగే చంద్రస్వరం నడిచేటప్పుడు (ఎడమ ముక్కు రంధ్రంలో శ్వాస నడిచే టపుడు), చల్లని పదార్దాలైన చల్ల,  మజ్జిగ ఇలా చలువచేసే పదార్దాలు తినకూడదు.  ఇవి సూర్యస్వరం తీవ్రంగా ఉన్నప్పుడు తినాలి.  మన శారీరక మానసిక స్థితి స్వరచలనాలపై ఆధారపడి ఉంటుంది.  ఎక్కువ సమయం ఒకే నాడి నడిస్తే అది స్వచ్చంద నాడీ మండలంలోని ఒక శాఖ ఎక్కువ వత్తిడికి గురి అవుతుంది.  దీనివలన బ్రెయిన్ లోని ఒక గోళార్థం ఎక్కువ పనిచేస్తుంది.  దీని వలన డిప్రెషన్ కు లోనుకావడం,  మానసిక ఆలసట, చికాకులు కనిపిస్తాయి.  

స్వరశాస్త్ర గ్రంథాల ప్రకారం పగలు చంద్రస్వరం ఎక్కువ పనిచేయాలి, రాత్రి సమయంలో సూర్యస్వరం ఎక్కువ పనిచేయాలని చెప్పబడింది.  అది మంచి ఆరోగ్యలక్షణంగా వివరించారు.

స్వరోదయం అంటే స్వరం మారే సమయం, లేదా స్వరం పుట్టే సమయం అని అర్థం.  ఒక్కొక్క స్వరం నడిచే టప్పుడు ఒక్కొక్క పని చేయడం యుక్తం అని స్వరశాస్త్ర చెబుతుంది.  ఇలా చేయడం వలన శుభం కలుగుతుంది. 
 
చంద్ర స్వరం నడిచేటప్పుడు నీరు త్రాగడం, మూత్రవిసర్జన, పడకమీదనుండి లేవడం ప్రశాంతమైన పనులు అంటే మానసికంగా చేసేవి, యోగసాధన, నగలు కొనడం, వితరణ, ఇతరులకు సహాయపడడం, వ్యాజ్యాలు సర్దుబాటు చేసుకోవడం, ఉన్నతాధికారులను కలవడం, తమ ధర్మానికి సంబంధించిన విధులు అంటే పూజ, దైవ దర్శనం, మంత్రసాధన, యోగ సాధన, వివాహం, సంస్కారాలు మొదలైనవి, గురువును కలుసుకోవడం, దూర ప్రయాణాలు, విత్తనాలు చల్లడం, ఔషధ సేవన మరియు చికిత్స, పాటలు పాడటం, ఆటలు ఆడటం,  స్త్రీలు మైథున కార్యంలో పాల్గొనటం మొదలైన పనులు చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్ర వాఖ్యం.

సంగీత స్వరం వేరు. యోగ స్వరం వేరు. వినేవాళ్ళ మనస్సును రంజింపజేసేది "సంగీత స్వరం". మనుజులలో ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఒక వైపు నుండి మరొక వైపుకు వివిధ పరిమాణాలలో సంచరించే వాయువు "యోగ స్వరం". ముక్కు ద్వారా పీల్చి వదలే గాలి కొలమానాన్ని క్రమబద్ధం చేయడం వలన శారీరకంగా, మానసికంగా కలిగే గొప్ప మార్పులను విప్పి చెప్పేదే "స్వర శాస్త్రం.    

No comments:

Post a Comment