Vedantha panchadasi:
విక్షిప్యతే కదాచిద్ధీః కర్మణా భోగయినా ౹
పునః సమమాహితా సాస్యాత్తదైవాభ్యాస పాటవాత్ ౹౹66౹౹
66.ప్రారబ్ధ కర్మము వలన సుఖదుఃఖములు కలుగుచు ఎప్పుడైన బుద్ధి విక్షేపము చెందినను అభ్యాసపాటవముచే దార్ఢ్యముచే మరల యథా పూర్వముగ సమూహితమగును.
విక్షేపో యస్య నాస్తి అస్య బ్రహ్మవిత్త్వం న మన్యతే ౹
బ్రహ్మైవాయమితి ప్రాహుర్మునయః పారదర్శినః ౹౹67౹౹
67.అట్టి విక్షేపములు లేని మానవుడు కేవలము బ్రహ్మవిదుడే కాదు సాక్షాత్తు బ్రహ్మమే అని వేదశాస్త్ర పారంగతులగు మునులు చెప్పుదురు.
ఆత్మ దేహమునందున్నను దేహ ధర్మములతో సంబంధము లేకయే యున్నది.అజ్ఞాని మాత్రమే దేహము తానని భావించి బాధపడుచుండును.
విడువబడిన బాణము తన లక్ష్యమును భేదించకుండ విడిచి పెట్టదు.జ్ఞానోదయమునకు పూర్వము ప్రారంభమైన ప్రారబ్ధకర్మ అనుభవించవలసినదే.జ్ఞానముతో నశించదు.ప్రారబ్ధకర్మను అనుభవించక తప్పదు.
అజరుడును,అమరుడను అను స్థిరబుద్ధి ఆత్మలో కలవానికి ప్రారబ్ధం సత్యమగునా?బ్రహ్మనిష్ఠుడగు యతికి ప్రారబ్ధభోగానుభవము సత్యముకాదు.
జీవాత్మ పరమాత్మల ఏకత్వరూప జ్ఞానమే ఆకారముగానున్న ప్రజ్ఞ గలవాడే జీవన్ముక్తుడు అని బ్రహ్మవేత్తల నిర్ణయము.
తనకంటే పరబ్రహ్మము వేరుగా లేదనియు,మాయాకల్పిత జగన్నిర్మాణము పరబ్రహ్మముకంటే వేరుగా లేదనియు,ప్రజ్ఞతతో ఎవడు తెలిసికొనునో అతడే జీవన్ముక్తుడు.
బ్రహ్మతత్త్వమును దెలిసిన వ్యక్తి అందరివలెనే సంసారమునందున్నను రాగద్వేషాదులకు వశమైయుండడు.ప్రారబ్ధానుసారము వచ్చిన సుఖదుఃఖములను జ్ఞాని కూడా అనుభవించుచున్నాడు.
దేహత్రయము తాను కాదని నిశ్చయముగానుండిన ఆత్మజ్ఞానికి మాయాకల్పితమగు యీదేహమునకు
ప్రారబ్ధ కల్పనము భ్రాంతియే యగును.
ప్రారబ్ధము వ్యావహారిక సత్యమేగాని పారమార్థ సత్యముకాదు అని పరమ సిద్ధాంతము.
ప్రారబ్ధకర్మము వలన సుఖదుఃఖములు కలుగుచు ఎప్పుడైన బుద్ధి విక్షేపము చెందిన విచారణతో అభ్యాసబలముచే మరల ఆత్మనిష్ఠుడగును.
కాని ఎట్టి విక్షేపములులేక వున్న బ్రహ్మజ్ఞాని ఏమియు దర్శించుటలేదు,శ్రవణముచేయుటలేదు,ఏమియు తెలిసికొనుటలేదు. సదానందరూపముతో,స్వాత్మతో,స్వలక్షణముతో నిర్వికల్ప సమాధి నిష్ఠను అనుభవించుచుచూ ఆనందించుచుండును.
అట్టి బ్రహ్మవిదుడు సాక్షాత్తు బ్రహ్మమే అని వేదశాస్త్ర పారంగతులు మునులు చెప్పుదురు.
పరబ్రహ్మము పరిపూర్ణము,అనాది,అనంతము,నిత్యము.
No comments:
Post a Comment