Tuesday, October 1, 2024

 *అంతఃకరణం.....*

ఒక గృహస్థుడు రోజూ బుద్ధునికి భిక్ష పెట్టేవాడట. ఆ సమయంలో, "స్వామీ! నాకు ఉపదేశం ఇవ్వండి! దీక్ష ఇవ్వండి" అంటూ గౌతమబుద్ధుని ప్రార్ధించేవాడు. బుద్ధుడు ఒకరోజు భిక్షా పాత్రలో దుమ్ము, ధూళి పెట్టుకొని భిక్షకు వచ్చాడు. ఆ గృహస్థుడు బిక్ష వేసేందుకు వచ్చి పాత్రను చూచాడు. "అయ్యా ! పాత్రను శుద్ధి చేయకుండా భిక్ష భిక్ష అంటావేమయ్యా ! ఆ మురికి పాత్రలో భిక్ష వేస్తే వ్యర్ధమై పోదా?" అన్నాడట. 

అప్పుడు బుద్ధుడు "అయ్యా ! నా పాత్ర సంగతి అలా ఉండనీ, నీ అంతఃకరణమనే పాత్ర సంగతి ఏమిటి ? నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా ఉపదేశం అంటే ఎలా ? కల్మషమైన అంతఃకరణంలో చేసిన ఉపదేశం వ్యర్ధమే కదా ! " అన్నాడట. 


"ఆసురీ సంపద పరమాత్మప్రాప్తికి ప్రతి బంధకం. దైవీసంపద కలిగి ఉంటేనే పరమాత్మ ప్రాప్తి".

రాష్ట్రపతికో, ప్రధానమంత్రికో, గవర్నరుకో, ముఖ్యమంత్రికో, మంత్రికో, ప్రజాప్రతినిధికో స్వాగతం ఇవ్వాలంటే ఎంత హంగామా చేస్తాం.. రోడ్లన్నీ ఊడ్పించి, కాలువల్లో మందు చల్లించి, మురికి కూపాలను శుభ్రం చేయించి, స్వాగత ద్వారాలను కట్టించి, రంగురంగుల తోరణాలతో, పూల దండలతో అలంకారాలు చేసి, అబ్బో ఎంతో హడావుడి చేస్తాం? ఎంత ఖర్చయినా వెనుకాడం. మరి బ్రహ్మాండాధిపతిని నీ హృదయంలోకి ఆహ్వానించాలంటే ఆయన స్వాగతానికి ఏం సన్నాహాలు చేస్తున్నావు? ఏం త్యాగం చేస్తున్నావు? ఆయన కూర్చొనే నీ హృదయ సింహాసనాన్ని శుభ్రం చేయ వద్దా? దాని మీద ఉన్న ఈ లౌకిక ధూళిని దులిపి వేయవద్దా? నీలోని ఆసురీగుణాలను దూరం చేసుకోవద్దా? దైవీగుణాలకు స్వాగతం పలకవద్దా? అలా చేస్తేనే భగవంతుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. నీ హృదయ సింహాసనంపై ఆశీనుడౌతాడు. 

No comments:

Post a Comment