Friday, October 25, 2024

 ఒక  ఇంటిని పూర్తిగా పర్యావరణ హితం గా నడపడం కుదురుతుందా? కష్టం అనిపిస్తోందా ? అయితే మీరు డాక్టర్ జనక్ పాల్టా మెక్‌గిల్లిగన్ గురించి తెలుసుకోవాలి.

 74 సంవత్సరాల జనక్ పల్టా గత 13 సంవత్సరాలుగా తన ఇంటిని పూర్తిగా పర్యావరణ హితంగా నడిపిస్తున్నారు, జీరో వేస్ట్, జీరో ఎనర్జీ కాస్ట్ , కాన్సెప్ట్ తో. వంటకి సోలార్ కుక్కర్లు వాడటం నుంచి నీటిని వేడి చేయటానికి సోలార్ పవర్ వాడటం దాకా అంతా పర్యావరణ హితమే. అలాగే పాత వార్తా పత్రికల్ని రీసైకిల్ చేసి బయోఫ్యూయెల్ జెనెరేట్ చేసి ఇంట్లో దీపాలు వెలిగిస్తున్నారు. అంతే కాదు ఇంట్లో ఒక విండ్ మిల్ కూడా వుంది. సోలార్ ఎనర్జీ, బయోఫ్యూయల్ తో పాటు విండ్ మిల్ నుంచి వచ్చే కరంట్ కూడా ఆవిడ ఇంటి అవసరాలకి ఉపయోగిస్తారు. 
 
ఆవిడ తన ఇంటికి అవసరం అయిన కూరగాయలు, పళ్ళు , బియ్యం ని తన ఇంటికి ఆనుకుని వున్న పొలం లో  పండిస్తూ, ఏ ఆహార పదార్థానికి మార్కెట్ మీద ఆధార పడాల్సిన అవసరం లేకుండా వున్నారు. ప్రతి రోజు వాడే పేస్ట్ నుంచి సబ్బులు, షాంపూ లు ని కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటూ సింపుల్ గా జీవించటం చాలా సులువు అని నిరూపిస్తున్నారు జనక్. 

 మన అవసరాలకి భవిష్యత్ తరాలు ఇబ్బంది పడేలా చేయకుండా, అందరం మన ఇళ్ళని సోలార్ పవర్ తో నడిచేలా చేయగలిగితే, మన ఆహారాన్ని మనం పండించుకునే ప్రయత్నం చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం అని చెబుతున్న జనక్, సురక్షితమైన, స్వచ్ఛమైన శక్తి వనరులు, తో పాటు  మహిళల సాధికారత కోసం గత 30 ఏళ్లగా పాటుపడుతున్న వ్యక్తి . గత 30 సంవత్సరాల గా భారతదేశంలోని గ్రామీణ మరియు గిరిజన మహిళల సాధికారత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 500 కుగ్రామాల నుండి 6000 పైగా గిరిజన మహిళలకు సోలార్ కుకింగ్ , ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి  సాంకేతికతలు నేర్పించారు. ఆమె  ఎన్నో సోలార్ కుక్కర్లు ను మారు మూల పల్లెలలో ఏర్పాటు చేయించారు. అలాగే  40,000 మంది విద్యార్థులకు సుస్థిర అభివృద్ధి లో శిక్షణ అందించారు. 
 డాక్టర్ జనక్ సూర్యశక్తిని ఉపయోగించి ఆహార ఉత్పత్తులను తయారుచేయడం లో   విప్లవాత్మక మార్గాలు అనుసరించి, నేర్పించినందుకు గాను ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. అలాగే అంతర్జాతీయ సదస్సుల్లో  సోలార్ కుకింగ్ పై అవగాహన కల్పిస్తూ ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. ఆమె సోలార్ టీ స్టాల్  ను కూడా  ఏర్పాటు చేయించి  పర్యావరణ హానిని తగ్గించడంతో పాటు వ్యాపార అవకాశాలను సృష్టించే  ఈ తరహా సుస్థిర ఆవిష్కరణల ద్వారా  ప్రపంచం మొత్తం మీద  మార్పు తీసుకు రావచ్చు అని నిరూపించారు. 

ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా పూనుకుంటే, ఒక లక్ష్యం  కోసం కట్టుబడి పనిచేస్తే,  ఎంతటి ప్రభావం చూపగలరో డాక్టర్ జనక్ పాల్టా మెక్‌గిల్లిగన్  నిరూపించారు.

No comments:

Post a Comment