Wednesday, October 23, 2024

 సంక్లిప్త రామాయణ గాథ-శ్రీ విష్ణు పురాణము

Part 24

దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయగా, శ్రీహరి తన అంశాన రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులనే నలుగురు రూపులుగా పుత్రత్వమందాడు.

విశ్వామిత్రుని కోరికపై యాగ సంరక్షణకు వెళ్లి, తాటకి అనే రాక్షసిని కూల్చాడు. అలాగే యజ్ఞానికి విఘాతం కలిగిస్తున్న మారీచుని పారద్రోలాడు. సుబాహుడు మొదలైన గొప్ప రాక్షసులను అణచివేశాడు. అహల్యకు శాపవిమోచనం కలిగించాడు. జనకమహారాజు ఇంట మహేశ్వర చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ శివధనుర్భంగాన్ని గావించి సీతమ్మను పెండ్లాడాడు.

పితృవాక్యాపరిపాలకుడై అడవులకు సతీసమేతుడై సాగి, లక్ష్మణుడు కూడా వెంటరాగా అరణ్యవాస దీక్ష బూని ఉండగా - భూభారాన్ని తగ్గించేందుకే అవతరించిన ఆ హరి కబంధ, విరాధ, ఖర, దూషణాదులను (రాక్షసులను) సంహరించాడు.

మాయలేడిగా మారి ఒకప్పుడు తనను పారద్రోలిన రాముడిని, సీతమ్మకు దూరంగా పారద్రోలడం ద్వారా తన కక్ష తీర్చుకున్నాడు మారీచుడు. అదే అదునుగా భావించి, సీతమ్మను అపహరించాడు రావణుడు.

ఋష్యమూక పర్వతంపై వానరులకు సుగ్రీవుని రాజుగా నిలిపి, అతడి మంత్రి హనుమంతుని సహాయంతో సీతమ్మ జాడ తెలుసుకుని, ఆ వానరవీరుల సహాయంతోనే రావణుని నివాసమైన లంకకు సేతువు గట్టి, ఆవలి తీరానికి చేరి రావణునితో పోరాడి, అశేష రాక్షస సమూహాన్ని సంహరించాడు. అగ్నిపునీత అయిన సీతతో గూడి, అరణ్యవాసకాలం ముగియడంతో తిరిగి రాజధాని అయోధ్యకు వచ్చి ఘనంగా పట్టాభిషేకం జరగ్గా ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించాడు శ్రీరామచంద్రుడు.

ఇలా శ్రీరాముని పరిపాలన 11 వేల ఏళ్లపాటు జరిగింది. ఇతడి తమ్ముడైన భరతుడు గంధర్వరాజ్య సాధనకు వెళ్లాడు. శత్రుఘ్నుడు అతి పరాక్రమం కలవాడే! మధువు పుత్రుడైన లవణ రాక్షసుని చంపాడు. మధురానగరాన్ని నిర్మింపజేశాడు. దుష్టశిక్షణకై అవతరించిన ఈ హరి అంశలు అవతార పరిసమాప్తినందగా, రామపుత్రులైన కుశలవులు రాజ్యానికి వచ్చారు.

క్రమంగా రఘువంశం విస్తరించింది. వీరిలోని ప్రముఖులలో 'మరువు' అన్నవాడొకడు. ఇతడు యోగసంథానుడు. యోగవిద్యలో అగ్రగణ్యుడు. ఇప్పటికీ చిరంజీవిగా 'కలాప' గ్రామ మందు అదృశ్యరూపుడై ఉన్నాడు.

(యో సౌ యోగ మాస్థాయా ద్యాపి కలాప గ్రామా మాశ్రిత్యతిష్ఠతి 4-4-109) రాబోయే యుగంలో సూర్యవంశ ప్రవర్తకుడు ఇతడే! వీరిలో మరి ప్రముఖుడు బృహద్సలుడు. భారతయుద్ధంలో అభిమన్యుని చేత హతుడైనాడు. ఇక్ష్వాకు వంశ ముఖ్య రాజులు వీరు.

జనకరాజ వంశవృక్షం

ఇక్ష్వాకుని తనయుడు 'నిమి' అనేవాడు వెయ్యేళ్ల కాలపరిమితిగల సత్రయాగం ఆరంభించాడు. వశిష్ఠుడు హోతగా ఉండాలని కోరుకున్నాడు. కాని అప్పటికే దేవేంద్రుడు తలపెట్టిన ఐదువందల ఏళ్ల పరిమితిగల సత్రయాగాన్ని నిర్వహించేందుకు ఒప్పుకున్నందున వశిష్ఠుడు నిమిని ఆగమన్నాడు. నిమి మౌనం వహించడంతో, అది అంగీకార సూచకంగా భావించి వశిష్ఠమహర్షి దేవేంద్రుని సత్రయాగానికి వెళ్లిపోయాడు.

గౌతమ మహర్షిచేత ఈ లోగా నిమి యజ్ఞం నిర్వర్తించే సన్నహాలు చేశాడు. ఇంద్రునివద్ద వున్న వశిష్ఠుని కీ విషయం తెలిసే అవకాశం లేదు. అక్కడ యాగం పూర్తి కాగానే, నిమి నిమిత్తం వచ్చాడు వశిష్ఠుడు. తనను కాదని మరొకర్ని హోతగా నియమించినందుకు కోపం పూనాడు వశిష్ఠుడు.

వశిష్ఠుడు నేరుగా రాజసౌధానికి చేరుకున్నాడు. మనస్సు ఏదో కీడునే శంకిస్తోంది. ఆలోచనలు పరిపరివిధాలుగా పోతున్నాయి. అనుమానాలు పీడిస్తున్నాయి.

మార్గమధ్యంలో పౌరులూ, రాజసౌథంలో సేవకులూ తనను చూసి వంగి వంగి దండం పెడుతున్నా ఆలోచనలలో మునిగిన మహర్షి అంతగా పట్టించుకోలేదు. తను వచ్చిన సంగతిని రాజుకు తెలియజేయమని సేవకుని ఆ ఋషి ఆదేశించాడు. సేవకుడు తిరిగివచ్చి వినయంతో నమస్కరించి 'ప్రభువులు నిద్రపోతున్నారు' అన్నాడు. ఆ మాట వశిష్ఠునికి ఆశ్చర్యంతో పాటు విపరీతమైన ఆగ్రహము కలిగించింది. ఏమిటీ? సదాచారవంతుడైన రాజు పట్టపగలు నిద్రపోవడమా? వశిష్ఠుని కోపం తాచుపాములా బుసకొడుతోంది. ఇంతలో మంత్రి కనిపించి చెప్పిన వార్తతో అతడు మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. యజ్ఞం ముగిసి మూడురోజులైందనీ - గౌతమమహర్షి యజ్ఞానికి సారథ్యం వహించారనీ - ఈ వార్తతో ఋషికి మిన్ను విరిగి మీదపడినట్లయింది. "కులగురువైన తాను లేకుండా, తాను వచ్చేవరకు ఆగమని చెప్పినా, లెక్కచేయకుండా నిమి యజ్ఞం జరిపించాడు. ఇది తన హోదాను, తన స్థాయిని, చివరకు తన తపస్సును కూడా చిన్నబుచ్చడం! ఈ రాజుకీ, రాజ్యానికీ ఏదో వినాశకాలం దాపురించింది" అన్నాడు.

వశిష్ఠుని నేత్రాలు నిప్పులు కురిశాయి. ఇక ఈ రాజు బతికి ఉండడానికి వీలులేదనుకున్నాడు. విగత జీవుడివి కమ్మని అప్పటికప్పుడు, అక్కడికక్కడ శాపమిచ్చాడు. వెంటనే వెనుదిరగబోయాడు.

అంతలో నిమి అక్కడికి రానేవచ్చాడు. ఆగ్రహవశుడై నిలువునా చలించిపోతున్న ఋషిని చూశాడు. సమీపించి నమస్కరించడానికి కూడా జంకాడు. కులగురువు దగ్గర లేకుండా గౌతమమహర్షి చేత తాను యజ్ఞం జరిపించాడు. చేసింది ధర్మకార్యం కనుక వేదవిహిత కర్మ కనుక, కులగురువు తనను మన్నిస్తాడనుకున్నాడు. ఇలా ఆగ్రహిస్తాడనుకోలేదు. రాజులో కూడా అహం దెబ్బతింది.

"రాజా! నువ్వు రెండు తప్పులు చేశావు. మొదటిది, నేను లేకుండా, నేను వచ్చే వరకు ఆగమన్నా, ఆదేశాన్ని లెక్కచేయకుండా వేరొకరి సహాయంతో యజ్ఞం చేయించడం. రెండోది, నేను రాగానే నన్ను కలుసుకోకుండా పట్టపగలు నిద్రపోతూ ఉండడం! ఈ రెండు నేరాలకూ ఫలితంగా తక్షణం విగతజీవుడి వవుతావు. ఇది నాశాపం" అన్నాడు ఋషి.

రాజు నిశ్చేష్టుడయ్యాడు. అతడిలో కూడా ఆగ్రహం పెల్లుబికింది. "మీరంత ఘోరంగా శపించవలసినంత తప్పేమీ నేను చేయలేదు. యజ్ఞం చేయడం ద్వారా వేదవిహితకర్మనే ఆచరించాను. ఇక అలసిసొలసి నిద్రిస్తున్న నేను మిమ్మల్ని వెంటనే దర్శించకపోవడం ఇంతటి శాపానికి గురిచేయదగినంత నేరమా? అన్యాయంగా నన్నిలా శపించారు కనుక మీకూ ప్రతిశాపమిస్తున్నాను. నాలాగే మీరు కూడా విగతజీవులవుతారు" అన్నాడు.

తర్కం ప్రకారం సరైనదేగాని, దైవర్షికి ఒక క్షత్రియుడు శాపం ఇవ్వడం దేవతలు హర్షించలేదు. అలా శాపం ఇస్తూనే నిమిచక్రవర్తి విదేహుడయ్యాడు. మహర్షికూడా దేహం లేనివాడైనప్పటికీ, ఆత్మ మాత్రం మిత్రావరణుల తేజస్సులో ప్రవేశించింది. నిమి చేసిన యాగ ఫలితంగా, అతడికి నరులకళ్లలో నివశించగల వరం ఇవ్వబడింది. అయితే, ఈతడు పుత్ర సంతానం లేకుండానే, మరణించినందున మహర్షులు ఈతని దేహాన్ని భావిస్తూ అరణిని మథించగా, అందులోంచి జనకుడు పుట్టాడు. మథనం వల్ల జనించినందున ఈతడికి మిథి అనే పేరుకూడా ఉంది. ఇతడు దేహం లేనివానికి జన్మించడం చేత వైదేహుడనీ పేరుగాంచాడు. జనకుని కొడుకు ఉదావసువు. ఉదావసుని కొడుకు నందివర్ధనుడు. అతను బహు ధర్మాత్ముడు. నందివర్ధనుని కొడుకు సుకేతుడు. సుకేతుని కొడుకు దేవరాతుడు. అతను గొప్పధార్మికుడూ గొప్ప బలశాలీని. అతను రాజర్షి కూడాను. దేవరాతుని కొడుకు బృహద్రథుడు. బృహద్రథుని కొడుకు మహావీరుడు. అతను శూరుడూ ప్రతాపవంతుడూను. మహావీరుని కొడుకు సత్యపరాక్రముడైన సధృతి. సధృతి కొడుకు ధర్మాత్ముడైన దృష్టకేతుడు. రాజర్షి అయిన దృష్టకేతుని కొడుకు హర్యశ్వుడు. హర్యశ్వుని కొడుకు మరుడు. మరునికి ప్రతింధకుడు. ప్రతింధకుని కొడుకు ధర్మాత్ముడైన కీర్తిరథుడు. కీర్తిరథుని కొడుకు దేవమీఢుడు. దేవమీఢుని కొడుకు విబుధుడు. విబుధుని కొడుకు మహీధ్రకుడు. మహీంధ్రకుని కొడుకు కీర్తిరాతుడు. మహాబలశాలీ, రాజర్షిన్నీ అయిన కీర్తిరాతుని కొడుకు మహారోముడు. మహారోముని కొడుకు ధర్మాత్ముడైన స్వర్ణరోముడు. స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. ధర్మజ్ఞుడూ మహాత్ముడూ అయిన హ్రస్వరోమున కిద్దరు కొడుకులు. వారిలో మొదటివాడు జనకుడు. రెండోవాడు కుశధ్వజుడు. జనకునికి దొరికిన పుత్రిక సీతమ్మ. మిథి నిర్మీంచిన నగరమే మిథిలానగరం. (ఈ నగర వాసిని) మిథి పుత్రిక కనుక మైథిలి అంటారు.

ఈ 'నిమి' కి, ఋషిని శపించిన కారణంగా కీర్తి రావలసినంత రాకపోవడంతో మిథినే ప్రథానంగా పరిగణిస్తూ ఈ వంశాన్ని 'మైథిలు' లని, జనక రాజ వంశీయులు అనీ పేర్కొంటారు. ఈ వంశంలోని వారంతా రాజర్షులు.

No comments:

Post a Comment