☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
24. యో దేవానాం నామధా ఏక ఏవ
ఏ పరమాత్మ ఒక్కడో, అతడే అనేక దేవతల నామాలను ధరించాడు (ఋగ్వేదం)
అనేకాన్ని ఏకంలో, ఏకాన్ని అనేకంలో దర్శించి చెప్పిన మతం మనది.
"దేవుడు ఒక్కడే. మీ మతంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు" అని మనల్ని విమర్శించే ఇతరులకు సమాధానం మన మతంలోనే ఉంది.
దేవుడొక్కడేనని మనకి ఎవరూ కొత్తగా చెప్పనక్కర్లేదు.
దేవుడొక్కడే అయినా జీవులెందరో! జీవ లక్షణాలెన్నో!
వాళ్ళని తరింపజేసేందుకే పరబ్రహ్మ అనేక దేవతలుగా వ్యక్తమయ్యాడని అత్యంత సుస్పష్టంగా వేదమతం వ్యాఖ్యానించింది.ఈ ధర్మాన్నే ప్రతి దేవతా స్తోత్రాలలో ప్రతిపాదించారు.
విష్ణుసహస్రంలోశివనామాలు,శివసహస్రంలో విష్ణునామాలు..... అన్నీ ఈ తత్త్వాన్నే చెప్తున్నాయి.
ఇంద్ర, యమ, వరుణాది దేవతలంతా మన కల్పితాలు కాదు. అనంతసృష్టి
నిర్వహణలో దైవశక్తి వివిధ విధాలుగా ప్రదర్శించిన అభివ్యక్తులు. వాటి లక్షణాలను, శక్తినీ, దివ్యాకృతిని దర్శించిన ఋషులు వాటిని ప్రసన్నం చేసుకొనేవిధానాలనందిస్తూనే-వాటన్నిటి ఏకత్వాన్ని ప్రతిపాదించారు.
మనలో చాలామందికి సుపరిచితమైన వేదవాక్యం.
'ఏకం సత్ విప్రా బహుధా వదన్తి' ఇదే సత్యాన్ని ఆవిష్కరిస్తోంది.
ఇంకా లోతుగా వెళ్ళి ఆ ఏక దైవం ఎక్కడో లేడనీ, మన గుండెలోనే ఉన్న మహాచైతన్యమనీ -
'ఈశ్వరస్సర్వభూతేషు హృద్దే . ర్జున తిష్ఠతి - "ఓ అర్జునా! ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయంలో ఉన్నాడు" అని గీతాచార్యుని వచనం.
‘ఆత్మా ఏకో దేవః', 'ఏకో దేవః సర్వభూతేషు గూఢః' అని ఉపనిషత్తులు అదే మాటను తెలుపుతున్నాయి.
'స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహా! - 'ఆత్మయే దేవత అయిన లలిత
-అదే విశ్వవిగ్రహం' - అని బ్రహ్మాండపురాణ వచనం.
ఆర్షసంస్కృతి అంతా బహుముఖాలుగా ఈ ఏకత్వాన్నే ప్రతిపాదిస్తోంది. దీనిని
దృష్టిలో ఉంచుకొని అభీష్టదైవంగా ఎంచుకొనే - చక్కని వీలుని కల్పించింది వేదమతం.
మానవీయ లక్షణాలనీ, విశ్వచైతన్యశక్తినీ సమగ్రంగా అధ్యయనం చేసిన దృష్టికి
మాత్రమే ఇంత స్పష్టమైన ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.
'దేవత' అంటే మనం కల్పించుకున్నదీ, “పదుగురాడుమాట పాడియై ధర చెల్లు” నన్నట్లుగా 'చెల్లుబాటయ్యేదీ' కాదు.
“మంత్రస్తుత్యాచ” - “మంత్రవాచ్యార్ణోదేవః” అని వైదిక మంత్రాలకు వాచ్యమైన
దివ్యశక్తి స్వరూపాలే దేవతలు. అవి కల్పితాలు కావు. ఆ మంత్ర సాధనవల్ల గోచరించేవీ, ఆ మంత్రానికి వాచ్యమైనవి అవే ఋషులు వర్ణించిన దేవతా స్వరూపాలు.
దేవతలు పంచభూతాలకు అతీతమైన జ్యోతిః స్వరూపులు. ఒకే జ్యోతి యొక్క విభిన్న స్వరూపాలు.
“ఏ దైవాన్ని చూసినా అతడే సర్వశ్రేష్ఠుడూ, లోకేశ్వరుడూ, పరబ్రహ్మ అంటారు.నిజానికి ఎవరు శ్రేష్ఠుడు?" అని సందేహపడేవారూ ఉంటారు.
శ్రేష్ఠుడూ, పరబ్రహ్మ అయిన లోకేశ్వరుడు ఒక్కడే. అతడే ఇన్ని దైవాలయ్యాడు
కనుక, ఏ దైవాన్ని చూసినా ఆ పరబ్రహ్మయనే వర్ణించారు.
ఇదీ మన దేవతల విషయంలో అవగాహన చేసుకోవలసిన విధానం. ప్రతి దేవతా సహస్రనామాలలోనూ ఇతర దేవతల నామాలు స్మరింపబడడంలో ఆంతర్యమిదే.
సర్వ దేవతలనూ మన అభీష్టదేవతలోనే దర్శించాలి.
ఆ ఏకత్వాన్ని విస్మరించకుండా, మన అభీష్టాన్ని ప్రధానంగా ఉపాసిస్తూ, ఇతర దేవతల్ని యథావిధి ఆరాధించడమే వేదమతం. దీనివలన ఏనాడూ మతవిభేదాలు వచ్చే అవకాశముండదు.
No comments:
Post a Comment