Sunday, November 24, 2024

 🌹 *సర్వ శక్తి స్వరూపుడవు నీవే - సర్వ జ్ఞాన స్వరూపుడవు నీవే*.🌹
✍ సద్గురు శ్రీ విద్యా సాగర్

ఒక చిన్న పిల్లవాడు కింద పడ్డాడే అనుకోండి, అప్పుడు మనం ఏమిచేస్తాము? వాడి దుఃఖాన్ని ఏమన్నా తగ్గించేస్తామా? తగ్గించలేము. వాడి బాధను మనం ఏమన్నా తీసుకోగలమా? తీసుకోలేము. కాకపొతే వాడిని ఏమారుస్తాము. వేరే వైపు దృష్టిని మారుస్తాము. దృష్టిని మార్చడం కోసం, ఏం చెబితే వీడు దుఃఖాన్ని మరిచిపోతాడో, అట్లా ఏమార్చుతాము.

మనల్ని కూడా ఈ రత్నాలు అమ్మే వర్తకులు అలాగే ఏమరుస్తున్నారు. మరి యద్భావం తద్భవతి అంటారు కదా, ఈ రత్నాలు పెట్టుకుంటే నిజంగా జీవితం మారిపోతుందేమో అని కొందరి నమ్మకం.

అయితే యద్భావం తద్భవతి అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించినది. అంతేగాని, మనం కెంపు రాయి పెట్టుకున్నంత మాత్రాన ‘యద్భావం తద్భవతి’ ఏమౌతుంది? ఏమి అవ్వదు.

సర్వశక్తి స్వరూపుడవు నీవే. సర్వజ్ఞాన స్వరూపుడవు నీవే. పరమాత్మతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలతో పరమాత్మ మానవుడిని సృజిస్తే, మానవులు ఏమో రాయి, రప్పనీనూ, మూలికలను పట్టుకుని, తాయిత్తులను పట్టుకుని వేళాడడం ఎంత అజ్ఞానమే ఆలోచించండి. భ్రాంతా ఇది. నీవు పరమాత్మతో సమానమైనటువంటి వాడవయ్యా. అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీయందే వున్నాయయ్యా అని పరమాత్ముడు చెబుతూ ఉంటే, మనం వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాము. రాళ్ళూ తాయత్తులు లాంటివి మనల్ని ఏమార్చడానికి చేసేటటువంటి పనులన్నమాట.

బాల్యంలో మీ పిల్లలకు దుఃఖం కలిగితే, మీరు పిల్లవాడిని ఎలా ఏమార్చారు? ఆటబొమ్మల వైపో, పుస్తకాల వైపో, వాడిని ఏది ఆకర్షింపచేస్తే అది చూపి దుఃఖాన్ని మరిచిపోయేలా చేసారు కదా. అలా మనల్ని ఏమార్చే ప్రయత్నం అన్నమాట ఈ రాళ్ళూ, తాయత్తులు లాంటివి.  తాత్కాలికం, కాసేపు ఆ విషయాన్ని మరచిపోతాము. మళ్ళా దుఃఖం వస్తుంది. మళ్ళా మామూలే. ఈసారి కెంపు కాకపోతే ఇంకొకటి పెట్టు. ఇప్పుడు అదీ ఇదీ మార్చుకోకుండా, తొమ్మిదీ వున్నవి ఒకేసారి పెట్టుకో అంటారు. గొడవే లేదని. ఇది మరీ బాగుంది. అర్థమున్నదా అండీ ఏమైనా? 

ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేని నుంచీ ఏమీ ఉపయోగము లేదు. సర్వశక్తిమంతుడవు నీవే. నీకు నీవు ఉపయోగపడనంత కాలం, నిన్ను నీవు తెలుసుకోనంత కాలం, అన్నీ వృధానే.

No comments:

Post a Comment