_*“విష్ణు సహస్రనామ స్తోత్రము” (పరమాత్మ స్వరూపము) - 25వ శ్లోకము.*_
*_సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః।_*
*_నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః॥_*
*_అర్ధము :_*
_సుభుజః - దివ్యమైన భుజములు గలవాడు, జగద్రక్షకుడు, భక్తవరదుడు._
_దుర్ధరః - ఒకపట్ఠాన అర్ధంకానివాడు, ఊహకు అందనివాడు._
_వాగ్మీ - మధురమైన, శక్తివంతమైన వాక్కుతో వేదములను అందించినవాడు._
_మహేంద్రః - మహాశక్తిశాలి, మహాతేజశ్శాలి._
_వసుదః - షడ్గుణైశ్వర్య సంపదలను ప్రసాదించువాడు._
_వసుః - షడ్గుణైశ్వర్య సంపదలూ తానైనవాడు._
_నైకరూపః - అన్ని రూపములు తానైనవాడు._
_బృహద్రూపః - బ్రహ్మాండరూపము గలవాడు, విశ్వరూపుడు._
_శిపివిష్టః - కిరణరూపమున (తేజోరూపమున) అంతటా వ్యాపించియున్నవాడు._
_ప్రకాశనః - సమస్తమును ప్రకాశింపజేయువాడు._
*_విశ్లేషణ :_*
_సత్యమనే బంగారు తెరతో కప్పబడి వుంటాడు పరమాత్మ. అంటే సత్యాన్ని తెలుసుకుంటే గాని పరమాత్మ అవగతం కాడు. ఆ సత్యాన్ని దర్శించడానికి జీవుడు అజ్ఞానమనే తెరను తొలగించుకోవాలి. అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి ప్రయాణించాలి._
_అయితే సత్యం వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది. అంటే ఆ తేజస్సును కూడా దాటిపోవాలి. జీవుడు ఆ నిర్గుణనిరాకార సత్యాన్ని అనుభూతి పొందడానికి తేజోరూపుడైన సూర్యుణ్ణి, సర్వజీవులను పోషించే సూర్యదేవా! నీ తేజస్సును కుదించుకో, కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని చూపించమని ప్రార్ధించేడు._
_సూర్యుని కృపతో మంగళకరమైన అతని స్వరూపాన్ని దర్శించిన జీవుడు ఆ సత్యపదార్థం “ఆత్మ” అని కనుగొన్నాడు. జీవునిలో ఆత్మగా, అన్నింటిలో పరమాత్మగా అది వ్యక్తమౌతుంది. అన్నింటికీ కర్త ఆ పరమాత్మే! కర్మ, జ్ఞాన, వైరాగ్యాలను ప్రేరేపించేది, చేయించేది, వ్యక్తపరిచేది పరమాత్మే! జీవుని శరీరం కేవలం ఒక ఉపాధి మాత్రమే! ఆత్మే జీవుని యజమాని!_
_దివ్యమైన ఎన్నో భుజములతో (కర్మజీవులుగా), విశ్వరూపుడై (జీవులన్నింటి సమిష్టిరూపంతో), తేజోరూపుడై (జ్ఞానప్రదాతగా), మహాశక్తిశాలిగా (శక్తిప్రదాతగా), షడ్గుణైశ్వర్య సంపన్నుడై (సమస్తమును ప్రకాశింపజేస్తూ), అన్నీతానై (ఆత్మ స్వరూపుడై), ఊహకందని విధంగా సర్వత్రా వెలుగొందే జగన్నాధుడు శ్రీ మహావిష్ణువు._
_తనలోనే వున్న ఆ విష్ణుస్వరూపాన్ని అనుభూతి పొందడమే జీవుని అంతిమ లక్ష్యం!!_
_తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము_
_~శాస్త్రి ఆత్రేయ_
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment