Tuesday, November 26, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

26. ఉదబుద్ధ్యధ్యం సమనసః

ఓ సహృదయులారా! లెండి, మేల్కొనండి (ఋగ్వేదం)

ఒకే విధమైన మనస్సు గలవారు 'సమనస్సులు' (సహృదయులు). అటువంటి వారందరినీ మేల్కొలుపుతోంది పై మంత్రం. ఇదే నిజమైన నినాదం. అసలైన
మేల్కొలుపు.

ఒకేలా ఆలోచించడం, ఒకేలా స్పందించడం - అనే సమాన భావాలు కలిగినవారంతా ఒక్కటి కావాలి. ఎవరిమానాన వారు 'మనకేంలే' అనుకోకుండా, తమ ఆలోచనల్నీ,
భావనల్నీ విస్తరింపజేసేందుకు, వాటి ద్వారా లోకక్షేమాన్ని సాధించేందుకు కృషి చేయాలి.

ఒక సమాజ నిర్మాణం, సంఘశక్తి పై మంత్రంలో ద్యోతకమవుతోంది.

ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే అదే హృదయం కలిగిన కొంతమంది
సంఘీభావంతో కలసి ఉద్యమించవలసినదే. ఆ ఉద్యమస్ఫూర్తి వైదికభావనలో
ప్రస్ఫుటమవుతోంది.

అయితే లోకానికి క్షోభ కలిగించాలనే భావంతో ఉన్నవారంతా కూడా ఒకటిగా మారి, సంఘశక్తిగా బలపడి ఉద్యమిస్తే... వారిది కూడా 'సమనస్సు' కదా! పై మంత్రభావం వారికీ వర్తిస్తుందా? - అంటే 'స' అనే శబ్దం సమానాన్నే కాక, 'మంచి'ని కూడా సంకేతిస్తుంది. సమానమైన, మంచి మనస్సే 'సమనస్సు' -అనే భావాన్ని మనం గ్రహిద్దాం. అంతేకాక - మనఃపూర్వకంగా కృషి చేసేవారు -'సమనస్సులు’. చేసే పనిని మనసారా చేయగలిగేవాళ్ల వల్లనే ఏదైనా సాధ్యం అని మనచుట్టూ జరుగుతున్న ఘటనలు ఋజువు చేస్తున్నాయి.

సమాన హృదయులు మనసా కృషి చేస్తే... మంచైనా, చెడైనా అసాధ్యాన్ని సాధ్యం చేస్తారు.

లోకసంక్షోభకారకులు కూడా ఈ 'సమనః' శక్తి వల్ల ఎలాంటి కార్యాలు సాధిస్తున్నారో మనకు తెలుసు. అయితే వాళ్ల కార్యాలు విధ్వంసపూరితాలనడంలో సందేహం లేదు.కానీ వాటి సాఫల్యానికి మాత్రం సమాన మనస్సుల సంఘటిత జాగృతే అత్యావశ్యకం.

ఇప్పటి మన ధార్మిక పరంపర విజయవంతంగా వ్యాప్తి చెందాలన్నా - ఈ మంత్రమే మన నినాదం కావాలి. అది 'సుమనస్సూ -సమనస్సూ' అవుతుంది. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ, మన సనాతనధర్మం సముద్ధరింపబడాలనే తపన ఉన్న
సమనస్కులు అంతా ఉపేక్ష, ఉదాసీనత విడిచి పెట్టాలి. వాటిని విడువమనే ప్రబోధమే 'ఉదబుద్ధ్యధ్యం' (లెండి - మేల్కొనండి) అనే పిలుపులో ఉంది.

ప్రస్తుత తరుణంలో మంచి లక్ష్యాలు, ఆలోచనలు (Positive Attitudes) కలిగిన వారంతా చిత్తశుద్ధితో మనసారా - ఒక సంఘటిత శక్తిగా కలిసి జాగృతమై ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆ ఉద్యమం ఆవేశమో, ఆవేగమో, ఉద్రేకమో
కానక్కర్లేదు.

లక్ష్యంలో ఉండే శుద్ధత లక్షణంలోనూ ఉండాలి. వినాశనానికీ, విభవానికీ కూడా కారణమైన “సమనస్కుల ఐక్యత" అనే శక్తిని మంచి మార్గంలో, నిర్మాణాత్మకమైన సత్కార్యాచరణలో వినియోగించడమే - ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కర్తవ్యం.

ప్రతివారికీ కొంతమేరకు “చేయగలిగిన శక్తి” ఉంటుంది. వారధి నిర్మాణంలో
ఉడుత పాత్ర ఉడుతదే. కానీ తమకున్న చిన్న శక్తిని చిన్నబుచ్చుకొని కప్పిపుచ్చుకోకుండా, తమ వంతు ధారపోస్తే ఉద్యమసిద్ధి తప్పక లభిస్తుంది.

పైగా - మన ధర్మం ప్రకారం - స్వధర్మాచరణమే సర్వశ్రేష్ఠం. ఎవరి ధర్మం వారికి గొప్పది. కానీ తమ ధర్మమే గొప్పదనీ, ఇదే ప్రపంచమంతా వ్యాపించాలనే పైశాచిక దృష్టి కలిగి 'పవిత్ర పోరాటాల' పేరుతో కొందరు, 'మార్పిడుల' పేరుతో ఇంకొందరు
ఏకీకృతమౌతున్న తరుణంలో -

మన ధర్మం నుండి మనవారిని దూరీకృతం చేయకుండా ఉండేందుకు మాత్రమే మనం ఏకీకృతం కావాలి. మనలో ఉండే గొప్పతనాన్ని మన వాళ్లకి చెప్పుకొని, మనవాళ్లల్లో మన ధర్మాన్ని కాపాడుకోవడానికే - 'సమాన హృదయంగల మనమంతా మేల్కొనాలి.” ఈ సిద్ధాంతాన్నే ప్రతి ధర్మం వారూ పాటిస్తూ ఉన్నట్లయితే ప్రపంచమంతా ఈ వినాశనాలే జరిగి ఉండేవి కావు.

శాంతికరమైన ఆలోచనలున్న వారంతా సంఘటిత శక్తిగా రూపొందుగాక!   

No comments:

Post a Comment