Tuesday, November 26, 2024

 *అసలైన విజయం*
               

 *ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి అదే విజయమనుకుంటాడు. తనకు వచ్చిన ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలను పొందిన ఆటగాడికి విజయమంటే అదే.*

*నిద్రాహారాలకు దూరమై ప్రయోగాలు చేస్తూ ప్రజలకు అనేక ఆవిష్కరణలు అందించే శాస్త్రవేత్తకు తాను సాధించిందే విజయం.*

*చిక్కక పాదరసంలా జారిపోయే భావాలను ఒడిసిపట్టి చక్కని భాషలో వ్యక్తీకరించిన వేళ రచయితకు ఎనలేని సంతోషం. అతడి భావనలో అదే విజయం.*

*విజయం అనే మాట సాపేక్షమైనది. జీవితంలో విజయం సాధించడమంటే కొందరు వారి భావనలో ఉండే గొప్ప కార్యాలను చేయడమని వాదిస్తారు. వాస్తవానికి వారు చేసిన పనులు విజయాలే కాని విజయమంటే అదేకాదు. మనిషి ఆర్థిక, సామాజిక, మానసిక, ఆలోచనా తీరులతోపాటు అతడి జీవిత నేపథ్యంమీద ఆధారపడి విజయభావన వ్యక్తమవుతూ ఉంటుంది. జీవితంలో ఉండే అనేక అంశాలు, వాటి ప్రాధాన్యాన్ని బట్టి, వ్యక్తుల అభిరుచిని బట్టి వారి ప్రతిభా వ్యుత్పత్తుల ఆధారంగా వారు సాధించే ఘనకార్యాలే విజయాలు.*

*నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆ బిడ్డ ఎదుగుదల ముఖ్యం. మెడ నిలబెట్టవలసిన సమయంలో నిలబెట్టడం, నడవాల్సినప్పుడు నడవడం, మనుషుల్ని గుర్తుపట్టడం... ఇలా                ఏ తరుణంలో చేయవలసిన పనులు అప్పుడు చేస్తూ ఆరోగ్యంగా ఎదిగే బిడ్డను చూస్తే తల్లికి పట్టరాని ఆనందం.  ఆ ఆనందమే ఆమెకు విజయమంటే.*

*రైతు పొలాన్ని దున్ని, విత్తనాలు చల్లి, నీటి వసతి ఏర్పరచి బిడ్డలా సంరక్షిస్తూ పోషణ చేస్తాడు. పంట చేతికి చిక్కినవేళ రైతుకది ఓ ఘనవిజయమే.*

*వైద్యుడు దేవునితో సమానం. రోగులకు వైద్యం అందించి వారిని స్వస్థులను చేస్తాడు. ఒక్కొక్కసారి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఎంతో క్లిష్టతతో కూడినదై, రోగి ప్రాణానికి ముప్పు తేవచ్చన్న సందర్భంలో సాహసించి              ఆ శస్త్రచికిత్సను వైద్యుడు చేస్తాడు. కృతకృత్యుడైన వేళ అది ఓ అద్భుత విజయమే!*

*రెక్కాడితేగాని డొక్కాడని శ్రమజీవులెందరో ఉన్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని వచ్చిన ఆ కూలి డబ్బుతో బిడ్డ నోటికి ముద్దనందించిన వేళ ఆ తల్లికది గొప్ప విజయమే.*

*దేనిలోనైనా ఒక నైపుణ్యం, పరిణతి పొందడానికి సాధన అవసరం. నిర్ణీత సమయంలో చదువు పూర్తిచేసుకోవాలి, ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆర్థిక భద్రతకు దారిని ఏర్పరచుకోవాలి. గృహస్థాశ్రమ జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. ఇవీ విజయాలే.*

*నైతిక ప్రవర్తనతో, ధర్మబద్ధతతో, నిజాయతీ నిబద్ధతలతో జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక విలువ, గౌరవం ఒనగూడుతాయి. ఈ రకమైన ప్రవర్తన మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అనేకమంది మనమంటే అభిమానించేటట్లు చేస్తుంది. ఇదీ విజయమే!*

*మనిషి ఒక ఉపాధ్యాయుడో, వైద్యుడో, శాస్త్రవేత్తో, రచయితో, సంగీతకారుడో... ఎవరైనా కావచ్ఛు కాని తాను మానవుడినన్న విషయం మరువకూడదు. తనలోని ప్రేమ, జాలి, కరుణ, నిజాయతీ, ధైర్యస్థైర్యాలు మొదలైన మానవీయ లక్షణాలను వికసింపజేయాలి. అప్పుడే మహనీయుడవుతాడు. అది అన్నింటికంటే అద్భుత విజయం, అసలైన విజయం!*. 

No comments:

Post a Comment