హరి ఓం , - -
ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎల్లప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది. భూమి మీద పడ్డ నీరు అంతా అన్ని దిక్కులనుండి వచ్చి నదులలోకి చేరుతుంటుంది. ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కాని సముద్రం ఎప్పటికీ పొంగి పొరలిపోదు. నిశ్చలంగా ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞుడి చుట్టు ప్రాపంచిక విషయాలు, విషయభోగాలు ఎన్ని ఉన్నా, అవన్నీ అతడిని వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నా, అతడు మాత్రం సముద్రము మాదిరి నిశ్చలంగా ఉంటాడు. అటువంటి స్థితప్రజ్ఞుడు పరమ శాంతిని పొందుతాడు.
వివరణ:
ఈ శ్లోకంలో శాంతిని ఎవరు పొందుతారు, ఎవరు పొందరు అనే విషయాన్ని చిన్న ఉదాహరణతో వివరించాడు పరమాత్మ. ఇంకా 'ఆపూర్యమాణమ్' (అన్ని దిశల నుండి నిండిన) అన్న పదాన్ని వాడాడు, అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు అని. జ్ఞానిని సముద్రముతో పోల్చారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో తేలియాడేవాడు చిన్న నది వంటి వాడు. ఏ మాత్రం ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ నది
పొంగి పొరలుతుంది. గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది. అలాగే సాధారణ మానవునిలో ఈ ప్రాపంచిక విషయాలు అలజడిని క్షోభను కలిగిస్తాయి. అతని శాంతిని హరించివేస్తాయి.
ఎండాకాలంలో నదులలోనుండి జలం రాదు. పైగా సూర్యరశ్మికి సముద్రము నీరు ఆవిరయి పైకి పోతుంది. మేఘాల రూపంలో ఉంటుంది. వర్షాకాలంలో వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. ఆ వర్షం నీరంతా నదులలోకి, నదులలో నుండి సముద్రములోకి వచ్చి చేరుతుంది. అటు ఎండా కాలంలో కానీ, ఇటు వానాకాలంలో కానీ, సముద్రము నిశ్చలంగా ఉంటుంది. పొంగదు, కుంగదు. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాని అయిన వాడు ఇంద్రియములు, మనసు, బయట
విషయములను నిరంతరము గ్రహిస్తున్నా, ఎటువంటి వికారములకు లోనుకాడు. జ్ఞాని మనసు అత్యంత తేలికగా దూది పింజమాదిరి ఉంటుంది. సుఖ దు:ఖములను అతడు పట్టించుకోడు. అన్ని భోగములు కోరికలు అతనిలో ప్రవేశించగానే అతనిలో లీనమై పోతాయి. శాంతంగా ఉంటాయి. ఎటువంటి అలజడి ఉండదు. ఎలాగైతే సముద్రంలో కలవగానే నదుల అస్తిత్వం పోతుందో, యోగిలో చేరగానే కోరికల అస్తిత్వం కూడా పోతుంది. అటువంటి స్థితిలో యోగి పరమ శాంతిని పొందుతాడు. ఎల్లప్పుడూ ఇంద్రియ విషయముల మీద, రాగద్వేషముల మీద ఆధారపడే వాడికి, కోరికలతో సతమతమయ్యే వాడికి ఎప్పుడూ శాంతి ఉండదు అని బోధించాడు పరమాత్మ...................
జై శ్రీ కృష్ణ - జై జై శ్రీ కృష్ణ . - - 🙏🙏 ...... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ .... - 98660 35557 ..... - HYD. 08.11.2024 .
No comments:
Post a Comment