*జ్ఞానయోగ వ్యవస్థితిః.....*
శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొనే నిష్ఠయే జ్ఞానయోగ వ్యవస్థితి. నీ స్వరూపాన్ని తెలుసుకోవటం 'జ్ఞానం'. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతోఅనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే 'యోగం'.
అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే స్థితిని కలిగి ఉండటమే 'జ్ఞానయోగ వ్యవస్థితి' అంటారు. ఇక్కడ స్థితి అనక వ్యవస్థితి అంటున్నారు. అంటే ఇంటికి వచ్చిన అతిధిలా కాకుండా ఇంటి యజమానిగా ఉండాలి. అతిధి 1-2 రోజులుండి పోయేవాడు. యజమాని శాశ్వతంగా ఉండేవాడు. అంటే ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా - స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి.
ఇలా ఉండాలంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడే గాక కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యము శాస్త్రశ్రవణం చేయాలి. సందేహాలను తొలగించుకోవాలి. అలా నిత్యశాస్త్ర శ్రవణం వల్ల జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయటం, విచారణ చేయటం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యటం. ఇదే జ్ఞానయోగ వ్యవస్థితి. ఇది దైవీసంపద.
No comments:
Post a Comment