వాసనానాం పరోక్షత్వత్సర్వజ్ఞత్వం నహీక్ష్యతే ౹
సర్వబుద్ధిషు తద్దృష్వా వాసనాస్వనుమీయతామ్ ౹౹162౹౹
162. (ఆక్షేపము)వాసనలు నేరుగా ఆనందమయకోశమునకును తెలియుట లేదు కనుక దాని సర్వజ్ఞత్వము ఎట్లు సిద్ధించును?
(సమాధానము)అన్ని బుద్ధి వృత్తులయందును అది ఉండుటచే దానికి వాసనలన్నీ తెలియునని అనుమానింపవలసి ఉన్నది.
కేన ఉప.2-4
విజ్ఞానమయముఖ్యేషు కోశేష్వన్యత్ర చైవహి ౹
అంతస్తిష్ఠన్యమయతి తేనాన్తర్యామితాం ప్రజేత్ ౹౹163౹౹
163. ఈశ్వరుడు విజ్ఞానమయకోశము మొదలుగా అన్ని కోశము లందును,సృష్టి యందన్యత్రయు,ఉండి వాని కార్యకలాపములను చోదించుచు నియమించు చుండుట వలన అంతర్యామి అనబడుచున్నాడు.
వ్యాఖ్య:- పరబ్రహ్మ ఎలాంటి విషయదోషములు లేనిది. సంకల్పములు,వాసనలు,
భావనలు మనస్సుకు సంబంధించినవి.
ఈశ్వరుడనగా ఆనందమయకోశము నందలి ప్రతిఫలిత చైతన్యము.
మాండూక్య ఉప. 5-6;
బృహదారణ్యక ఉప. 3.7;
తాపనీయ ఉప. 1
ఆ ఆత్మవస్తువు పరమైనది,అను భగవద్గీతానుసారముగా పరబ్రహ్మము విలక్షణమైనది. అందుచే ఆ పరమాత్మకు దోషములు లేవు.శుద్ధము,బుద్ధిగత దోషములు దాని నంటవు.
ఇట్టి ఆత్మే మహా పురుషుడయిన పరమేశ్వరుడు.ఆయన సన్నిధిలోనే సర్వకర్మలూ జరుగుతున్నాయి.
స్థూల-సూక్ష్మ శరీరాలకు భిన్నంగా ఉండే ఈ ఆత్మే అన్ని ప్రాణులలోనూ అన్ని వస్తువులలోనూ అన్ని కాలాలలోనూ ఆత్మ తత్త్వంగా నిత్యమూ అవ్యయంగా ఉంటుంది.
అందరిలోనూ వుండే ఆ ఆత్మే నీలో నాలో వుండే చైతన్యం అదే.
వ్యక్తినుండి వ్యక్తికి కాలంనుండి కాలానికి తెలిసిన అంశాలు మారుతుంటాయి.
కాని అందరిలోనూ ఉండి చైతన్యం నిత్యంగా ఏకంగా వుంటూ,
అన్ని కుండలలోనూ ఉన్న సత్యాన్ని నేనే అని మట్టి అనగలిగినట్లే ఆత్మకుడా ఆత్మగా అంతటా వుంది.
వస్తుతః నా చేతిని పరిశీలిస్తే ఇది కేవలం సున్నం,బొగ్గు,భాస్వరం అనబడే పదార్థాలతో తయారుకాబడినది మాత్రమే.
అయితే ఇది కదలడానికి కారణం దీని నిండుగా జీవతత్త్వం వ్యాపించి ఉండడం వలన మాత్రమే సంభవమౌతుంది.జీవం పోగానే ఇది నశించి పోతుంది.
ఈ విధముగా పదార్థంకంటే వేరుగా ఉన్న మహత్తరమయిన జీవ శక్తి ఈ జడపదార్థానికి చైతన్యాన్ని అరువిస్తూవుంటే పదార్థం నర్తిస్తూ సజీవంగా మనకు కనిపిస్తుంది.
కనిపించే జడ పదార్థమంతా రూపాంతరం చెందిన చైతన్యం మాత్రమే.ఇదే విధముగా పదార్థమంతా చైతన్యం యొక్క స్థూల వ్యక్తరూపం మాత్రమే.
మనశ్శరీరాల రూపంలో ఉన్న ఉపాధుల కతీతంగా నిలిచిన స్థితిలో ఈ శుద్ధచైతన్యాన్ని స్వానుభవంగా గ్రహించగలము.
No comments:
Post a Comment