బుద్ధౌ తిష్ఠన్నాంతరోఽ సా ధియానీక్ష్యశ్చ ధీవపుః ౹
ధియ మంతర్యమయతీత్యేవం వేదేన ఘోషితమ్ ౹౹164౹౹
164. బుద్ధిని తన శరీరముగ జేసికొని ఈశ్వరుడు బుద్ధియందు ఉండుననీ,కాని బుద్ధియతని నెరుగదనీ బుద్ధియే ఈశ్వరునిచే నియమింప బడుచున్నదనీ శ్రుతి చెప్పును.
బృహదారణ్యక ఉప. 3.7.15,22.
వాఖ్య:- లోకమునందు బుద్ది(విజ్ఞానము) కలవాడే శ్రద్ధాపూర్వకముగా ఆత్మ యజ్ఞమును జేయుచున్నాడు.కాన ఈ బుద్ధి యందున్న పరమేశ్వరుడే సమస్తకర్మలకు కర్తగా నున్నాడు.
ఇట్టి బుద్ధి యందున్న పరమాత్మను తెలుసుకుని అన్నమయాదులయందు ఆత్మభావనను విడిచి బ్రహ్మభావన చేసిన వాడు ఆనందమును అనుభవించుచున్నాడు.
అంతరంగమగు ఈ ఆనందాత్మనందే పరమాత్మ నిండియున్నది.బుద్ధి అనే ఘటమునందు బ్రహ్మ చైతన్యమే ప్రతిబింబించిందనాలి.
సర్వవ్యవహారాలు,
ఇహ పరలోకములు,
సుఖదుఃఖములు అన్నియును చిదాభాసునకే గాని,
అతనితో కలిసియున్న కూటస్థునకు లేవు.
కాని కలిసి వున్నందు వలన కూటస్థునకున్నట్లు భ్రాంతిగా కనబడుచున్నవి.
ఆదిత్యుని కిరణములు చంద్రుని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రుల యందలి చీకటిని పోగొట్టును.అలాగే ఆత్మ చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి సకల వృత్తులు తెలియబడు చున్నవి.
ఏదో ఒక మహత్తరమయిన శక్తి లేకపోతే మనం ఎదురుగా వున్న వస్తువును గుర్తించడం సాధ్యం కాదు.వస్తువులుండి వాటి యెదురుగా కళ్ళున్నంతమాత్రాన ఆ వస్తువును గుర్తించడం సాధ్యం కాదు.
మరణించిన వ్యక్తి కళ్ళు విప్పారి ఉన్నప్పటికీ యెదురుగా ఉన్న వాటిని గుర్తించలేడు.
ఇంద్రియాలు,బుద్ధియందు చైతన్యం పనిచేయుట ద్వారా మాత్రమే సకలం తెలియబడుతుంది.
అందువలననే ఉపనిషత్తుల యందు, బుద్ధి యందు ఈశ్వరుడు వుండుననీ,బుద్ధి ఈశ్వరునిచే నియమింపబడినదనీ శ్రుతి వాక్యము.
No comments:
Post a Comment