*జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*
*🌹అధ్యాయం 4, శ్లోకం 3🌹*
*స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।*
*భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ।। 3 ।।*
*సః — అది;*
*ఏవ — తప్పకుండా;*
*అయం — ఇది;*
*మయా — నా చేత;*
*తే — నీకు;*
*అద్య — నేడు;*
*యోగః — యోగ శాస్త్రము;*
*ప్రోక్తః — తెలియచెప్పబడుతున్నది;*
*పురాతనః — ప్రాచీనమైన;*
*భక్తః — భక్తుడువి;*
*అసి — నీవు;*
*మే — నా యొక్క;*
*సఖా — సఖుడివి (మిత్రుడివి);*
*చ — మరియు;*
*ఇతి — కాబట్టి;*
*రహస్యం — రహస్యము;*
*హి — నిజముగా;*
*ఎతత్ — ఇది;*
*ఉత్తమం — శ్రేష్ఠమైనది.*
*💥అనువాదం:*
*BG 4.3: అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన, ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.*
*💥వ్యాఖ్యానం:*
*తను అర్జునుడుకి చెప్పే ఈ ప్రాచీన యోగ శాస్త్రము సాధారణంగా అందరికీ తెలియని రహస్యమని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి రెండు కారణాలుంటాయి: ఒకటి, రహస్యం కేవలం తనకే తెలిసుండాలనే స్వార్థం. రెండోది, ఆ సత్యాన్ని సమాచార దుర్వినియోగం నుండి కాపాడటానికి. ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండటానికి, ఈ రెండు కారణాలు కాక, వేరే కారణం ఉంది, అదేమిటంటే, అది అర్థం చేసుకోబడటానికి అర్హత ఉండాలి. ఆ అర్హతే, 'భక్తి' అని ఈ శ్లోకంలో తెలియచేయబడింది. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశం కేవలం పాండిత్యానికో లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవటానికి లొంగదు. దీనికి భక్తి అవసరం; ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయని నిర్మూలించి, ఆయన అణు-అంశములగా, ఆయన సేవకులుగా మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది.*
*అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవటానికి తగిన విద్యార్థి, ఎందుకంటే అతను భగవంతుని భక్తుడు. భగవంతునిపై భక్తిని, క్రమంగా ఉన్నతమైన ఈ ఐదు భావాలుగా మనం అభ్యాసం చేయవచ్చు: 1) శాంత భావం : మనల్ని పాలించే చక్రవర్తిగా భగవంతుడిని ఆరాధించటం. 2) దాస్య భావం : భగవంతుడిని మన స్వామిగా, మనం ఆయన దాసుడిగా భావంచటం 3) సఖ్య భావం : భగవంతుడిని మన మిత్రునిగా పరిగణించటం 4) వాత్సల్య భావం : భగవంతుడిని మన బిడ్డగా భావించటం 5) మాధుర్య భావం : మన ఆత్మ-సఖునిగా భగవంతుడిని ఆరాధించటం. అర్జునుడు భగవంతుడిని తన మిత్రునిగా ఆరాధించాడు, కాబట్టి శ్రీ కృష్ణుడు అతనితో తన మిత్రునిగా, భక్తుడిగా సంభాషిస్తున్నాడు.*
*భక్తి నిండిన హృదయం లేకుండా, భగవద్గీత యొక్క సందేశాన్ని వాస్తవరూపంలో అర్థం చేసుకోలేరు. భగవత్ భక్తి లోపించి ఉన్నటువంటి పండితులు, జ్ఞానులు, యోగులు, తపస్వులు వంటి వారు రాసిన భగవద్గీత భాష్యాలు చెల్లవని ఈ శ్లోకం సూచిస్తున్నది. ఈ శ్లోకం ప్రకారం, వారు భక్తులు కారు కాబట్టి, వారు అర్జునుడికి చెప్పబడిన ఈ మహోన్నత జ్ఞానం యొక్క నిజమైన భావాన్ని అర్థం చేసుకోలేరు; కావున వారి భాష్యాలు అసంపూర్ణంగా మరియు/లేదా అసంబద్దంగా ఉంటాయి.*
💥✨💥 ✨💥✨ 💥✨💥
No comments:
Post a Comment