☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
48. జీవన్ భద్రాణి పశ్యతు
జీవించి ఉంటే శుభాలను చూడవచ్చు (శ్రీమద్ వాల్మీకి రామాయణం)
ఇది శ్రీమద్రామాయణంలోని సుందరకాండలో వాక్యం. నిరాశావాదాన్నీ,నిరుత్సాహాన్నీ మన సనాతన ధర్మం ఏనాడూ ప్రోత్సహించలేదు. జీవితం ఎంతో
విలువైనదని చాటుతుంది. అందుకే అల్పసుఖాలకోసం ఆయువునీ, బలాన్నీ వృధా చేయవద్దని బోధిస్తుంది. ఈ శరీరం ధర్మంకోసం లభించిన గొప్ప సాధనం- అని
ప్రబోధిస్తూ మంచి అలవాట్లతో, నియమాలతో దీనిని దృఢంగా, బలంగా మలచుకోవాలని అలాంటి ఆరోగ్యవంతమైన శరీరంలో పవిత్రమైన మనస్సు ఉండాలనీ
ఈ రెండు సాధించడమే నిజమైన జీవితమని పలు విధాలుగా తెలియజేస్తోంది.
తాత్కాలిక ఉద్రేకాలకు లోనై జీవితాన్ని నశింపజేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు. అది తప్పని చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఈ ఆప్తవాక్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంతో ధైర్యం లభిస్తుంది.
వినాశే బహవో దోషాః
జీవన్ భద్రాణి పశ్యతు||
"మరణించడంలో అనేక దోషాలున్నాయి. జీవించి ఉంటే మంగళాలను పొందవచ్చు".
ఈ క్షణం అంతా శూన్యంగా తోచుతుంది. ఇంక తాను బ్రతకడం వృధా అనిపిస్తుంది.కానీ ఈ క్షణం శాశ్వతం కాదు. భవిష్యత్తు మన ఊహకి అందదు. అప్పుడు మళ్ళీ
మేలు కలగవచ్చు. ఈలోగా తొందరపడి మరణాన్ని ఆహ్వానిస్తే ఆ మేలును చూసే అవకాశమే ఉండదు.
ఈ ఒక్క వాక్యంలో ఎంతటి ఆశావాద ధోరణి (పాజిటివ్ అప్రోచ్) ఉందో
గమనించాలి.
ఎంత వెతికినా సీత జాడ కానరాకపోయేసరికి హనుమంతుడు నిరాశపడతాడు.'లంక అంతా తిరిగినా సీతమ్మ కనబడలేదు. ఇంక వెతకవలసిన చోటే లేదు. తన ప్రయత్నం వ్యర్థమయ్యిందే' అని బాధపడి, జీవితంపైనే విరక్తి పొందుతాడు. ఆ సమయంలో ధీరుడై ఆశావాదాన్ని తెచ్చుకుంటాడు.
అతడి ఆశావాదమే ఫలించింది.
ఇంతలో అశోకవనం కనిపించడం, సీత జాడ దొరకడం జరిగింది. 'భద్రం' లభించింది. కనుక దిగులు కలగగానే ఆ దిగులే 'పూర్తి జీవితం' అన్నంతగా తన్మయం చెందరాదు. ఆ క్షణమొక్కటే శాశ్వతం -అనిపించేంత భ్రమలో పడరాదు.
భవిష్యత్తులో మేలు కలుగుతుందనే నమ్మకం చాలా గొప్పది.
భగవంతుడిచ్చిన శరీరాన్ని నాశనం చేసుకొనే హక్కు మనకు లేదు. అలా చేసుకుంటే భగవత్ శక్తికి కేంద్రమైన దేహాన్ని ధ్వంసం చేసుకున్న మహాపాపం సంక్రమిస్తుంది.
దానికి నిష్కృతి లేదు.
నిజంగా జీవితం దుఃఖమయమనిపిస్తే, చావు దానికి పరిష్కారం కాదు. వైరాగ్యం
తెచ్చుకొని సత్కర్మాచరణతో జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిజమైన సమాధానం.
'వైరాగ్యం' అంటే 'విరక్తి' అనే చిన్న అర్థం సరిపోదు. ఏదో ఒక దానిపై పెట్టుకున్న పనికిమాలిన మమకారాన్ని వదలడమే వైరాగ్యం. మనం మమకారం పెట్టుకున్న వస్తువు మనకంటే భిన్నమైనది. అది లభించకముందే మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం. మనం (నేను అనే అస్తిత్వం) శాశ్వతం.
'ముందు తాను కలిగితే, మూడు లోకములు' అన్నాడు అన్నమయ్య. ముందు మనమంటూ ఉంటేనే ముల్లోకాలు. మనమే లేనినాడు ముల్లోకాలతో పనేమిటి?
కనుక తనను తాను నాశనం చేసుకొనే హక్కు ఏ జీవికీ లేదు. సహనం వహించితే,కొద్దిసేపటికే మన ఆలోచనలో లోపం మనకే అర్థమౌతుంది.
అందుకే ఎంతో విలువైన జీవితాన్ని జ్ఞానంతో సార్థకం చేసుకోవడమే కర్తవ్యం. ☘️🍁
No comments:
Post a Comment